పీకే వ్యూహం ఏమిటో ? కాంగ్రెస్ మీటింగ్ అందుకేనా?
ఎదో జరుగుతోంది? ఎమీలేకుంటే, ఎన్నికల వ్యూహకర్త, ప్రశాంత్ కిషోర్ పక్షం రోజులల్లో మూడవసారి ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ను ఎందుకు కలుసుకున్నారు? ఈ భేటీల పర్యవసానంగా కాంగ్రెస్ మొదలు మోడీ వ్యతిరేక పార్టీలు, నాయకులలో ఇలా ఇంతలా కదలిక ఎందుకు వస్తుంది. ఎన్నిని ఊహాగానాలు ఎందుకు వినిపిస్తాయి? నిప్పు లేనిదే పొగరాదు, ఏదో జరుగుతోంది, రాజకీయ వంటకం ఎదో ఉడుకుతోంది.
జూన్ 11వ తేదీన ముంబైలో మొదటిసారిగా శరద్ పవార్’తో సమావేశమైన ప్రశాంత్ కిశోర్, రెండురోజుల క్రితం ఢిల్లీలో రెండవసారి పవార్’తో భేటీ అయ్యారు.. మళ్ళీ బుధవారం, పవార్ ఢిల్లీ నివాసంలో మరో సారి ఆ ఇద్దరు కలుసు కున్నారు. ఓ గంట సేపు రహస్యంగా మంతనాలు సాగించారు. శరద్ పవార్ నివాసంలో పీకే సారధ్యంలో ఏడెనిమిది పార్టీల నాయకులు, కొంతమంది మేథావులు సమావేశంమైన 24 గంటల్లోనే కిషోర్ మళ్ళీ పవార్’ను కలుసుకున్నారు.
శరద్ పవార్ సారధ్యంలో జరిగిన సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత లేదని ఎన్సీపీ నాయకులు చెపుతున్నారు. అలాగే ఈ సమావేశానికి సూత్రధారి వ్యవహరించిన టీఎంసీ జాతీయ ఉపాధ్యక్షుడు యశ్వంత్ సిన్హా, అప్పుడెప్పుడో తాను తెరిచి, మూసేసిన రాష్ట్రీయ మంచ్’ ను మళ్ళీ తెరమీదకు తెచ్చారు. పవార్ నివాసంలో జరిగిన సమావేశాన్ని ‘మంచ్ ముచ్చట్ల’ పిచ్చాపాటి సమావేశం మాత్రమే అని, ఈ సమావేశానికి రాజకీయ ప్రధాన్యత అస్సలు లేనే లేదని చెప్పుకొచ్చారు. కావచ్చు, పవార్ నివాసంలో జరిగింది, యశ్వత్ సిన్హా చెప్పినట్లుగా పెద్ద ముత్తయిదువుల క్లాక్షేపం కబుర్లే అనుకుందాం, అయితే, ఆ సమావేశానికి అంత హైప్ ఎందుకొచ్చింది. థర్డ్ ఫ్రంట్ అని అదనీ, ఇదనీ ఊహాగానాలు ఎందుకు షికారు చేశాయి. అప్పుడే, యశ్వంత్ సిన్హా, ఇది రాష్ట్రీయ మంచ్ సమావేశమే కానీ, రాజకీయ సమావేశం కాదని, ఈ సమావేశానికి రాజకీయ ప్రాధన్యత లేదని ఎందుకు చెప్పలేదు. అంతకు ముందు పవార్, ప్రశాంత్ కిషోర్ సెకండ్ భేటీ తర్వాత ఎన్సీపీ అధికార ప్రతినిధి, పవార్ సారధ్యంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు ప్రారంభ మయ్యాయని ఎందుకు ప్రకటించారు? ఇంతాచేసి చివరకు ప్రశాంత్ కోశోర్ తెర మీదకు వచ్చి, ‘థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్’తో లాభం లేదు, బీజేపీ ఓడించడం థర్డ్, ఫోర్త్ ఫ్రంట్స్’తో అయ్యే పని కాదని’ చావు కబురు చల్లగా చెప్పడంలో అంతరం ఏమిటి? అంతలోనే మళ్ళీ పవార్’తో రహస్య భేటీ అంతర్యం ఏమిటి? పవార్, ప్రశాంత్ కిషోర్ భేటీల చుట్టూ చాలా ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకే, ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే, ఎదో జరుగుతోంది అనేది అందరికీ ఆర్ధమవుతోంది.
నిజానికి ఏమి జరుగుతోంది అనేది కూడా గొప్ప రహస్యం ఏమీ కాదు, ‘బీజేపీని ఓడించాలి ... మోడీని గద్దె దించాలి’, ఇదే ఈ రహస్య భేటీలు, బహిరంగ సమావేశాల సెంట్రల్ థీమ్. ఇదేమీ రహస్యం కాదు. నిజానికి అదేమీ తప్పు కాదు. బీజీపీ ప్రత్యర్ధి పార్టీలు, బీజేపీ ఓటమినే కోరుకుంటాయి. అలాగే, బీజేపీ తమ ప్రత్యర్ధి పార్టీల పతనాన్ని కోరుకుంటుంది. అంతే కానీ, సోనియా/ రాహుల్ కాంగ్రెస్’, పవార్ కాంగ్రెస్, మమతా కాంగ్రెస్ లేదా మరో పార్టీకి మోడీ, షా జై కొట్టదు. ఇన్ ఫాక్ట్, ‘కాంగ్రెస్ ముక్త భారత్’ అనే నినాదంతోనే బీజేపీ ముందుకు పోతోంది. సో, బీజేపీయేతర పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా జట్టు కట్టండంలో వవిశేషం ఏమీ లేదు. రాజకీయంగా తప్పు కాదు. నిజంగా అలంటి ప్రయత్నం జరుగుతుంటే, అది స్వాగతించవలసిన, సంతోషించదగ్గ పరిణామమే అవుతుంది .
అయితే ఈ క్రతువులో కీలకంగా మారిన, ప్రశాంత్ కిశోర్, వ్యూహం ఏమిటి అన్నదే ఇక్కడ కీలకంగా మారింది. బెంగాల్ ఎన్నిక్లాలకు ముందు ప్రశాంత్ కిషోర్ ఇమేజ్ వేరు, ఇప్పుడు ఆయన ఇమేజ్ లంకలో హనుమంతుడిలా ఎన్నో రెట్లు పెరిగింది. పశ్చిమ బెంగాల్’ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్’ ను ప్రశాంత్ కిషోర్ గెలిపించారు. అదే వండర్ అనుకుంటే, బీజేపీకి 200 ప్లస్ సీట్లు వస్తాయని తొడకొట్టిన అమిత్ షాను సవాలు చేసి మరీ కాషాయ పార్టీని వందలోపు సీట్లకు పరిమితం చేశారు, ప్రశాంత్ కిషోర్. దీంతో ప్రశాంత్ కిషోర్ భయంకరంగా పెరిగిపోయింది. ఆయన ఇమేజ్ దేశ సరిహద్దులను దాటి అంతర్జాతీయ స్థాయికి చేరింది. అలాగని, ప్రశాంత్ కిషోర్ ఇప్పుడ నడిపిస్తున్న డ్రామా వెనక భారత వ్యతిరేక అంతర్జాతీయ శక్తులు ఉన్నాయని కాదు. కానీ, బెంగాల్ గెలుపు తర్వాత, వ్యూహారచన వ్యాపకానికి స్వస్తి చెపుతున్నానని ప్రకటించిన ఆయన ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు, చిన్న అనుమానాలకు తావిచ్చేలా ఉందనే సందేహాలు వ్యక్తమసుతున్నాయి.
2019 ఎన్నికల ఓటమి తర్వాత ఇంతవరకు స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో కూడా కదలిక వచ్చింది. తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, చాలాకాలం తర్వాత తొలిసారిగా, ఈరోజు (జూన్ 24) పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇంచార్జ్’లతో సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో సంస్థాగత అంశాలతో పాటుగా, వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్టాలలో పరిస్థితిని కూడా చర్చిస్తారని అంటున్నారు. అలాగే, అధికారంలో ఉన్న పంజాబ్, రాజస్థాన్ సహా అధికారంలో లేని కర్నాటక, తెలంగాణ, కేరళ, ఢిల్లీ వంటి అనేక రాష్ట్రాలలో పతాక స్థాయికి చేరిన అంతర్గత కుమ్ములాటలపై కూడా దృష్టి పెడతారని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఏమి జరుగుతుంది అనే విషయాన్ని పక్కన పెడితే, ఈ సమావేశం వెనక కూడా పీకేనే ఉన్నారా? ఆయన వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ లో కదలిక వచ్చిందా, అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి, ప్రతిపక్ష పార్టీలు రాజీవ్ గాంధీని ప్రదాని అభ్యర్ధిగా అంగీకరిస్తే, బీజేపీ ఓడించేందుకు పనిచేస్తానని ప్రశాంత్ కిషోర్ గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఆయన చుట్టూ తిరుగుతున్న విపక్షాల రాజకీయాలకు, ఆయన ఈ ట్వీట్ తోనే శ్రీకారం చుట్టారు. సో ... వ్యూహ రచనలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న ప్రశాంత్ కిషోర్, మాంత్రికుడు ఏ చిత్తు కాగితాన్నో, సంచిలో పెట్టి, ఇటూ అటూ తిరగేసి, అందులోంచి, ఏ రెండు వేల నోటునో, ప్రాణమున్న చిలకనో తీసునట్లు, పవార్, కు ముసుగేసి ఏ రాహుల్ బొమ్మనో బయటకు తీసిన ఆశ్చర్య పోనవసరం లేదని పిస్తోంది.ఏమి జరుగుతుందో.. చూడవలసిందే.