ఫ్రైర్ బ్రాండ్ లీడర్.. రాజకీయ సంచలనం రేవంత్ రెడ్డి
posted on Jun 27, 2021 @ 9:32AM
ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి.. ఫైర్ బ్రాండ్ లీడర్. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. తనదైన దూకుడుతో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు రేవంత్ రెడ్డి. జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రేవంత్ రెడ్డి.. అనతి కాలంలోనే ఎన్నో కీలక పదవులు సాధించారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదొర్కున్నారు. కొన్ని రోజులు జైలు జీవితం కూడా గడిపారు.తెలంగాణలో తనకంటూ ఓ పత్యేక అనుచర గణాన్నిఏర్పరుచుకున్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్‌కు ధీటైన నాయకుడిగా ఎదిగారు. గత కొన్నేండ్లుగా కేసీఆర్ సర్కార్ పై, కేసీఆర్ కుటుంబంపై చేస్తున్న పోరాటంతో ఆయనకు మరింత క్రేజీ వచ్చింది. ఈ క్రమంలోనే ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించింది. పీసీసీ పదవికి గట్టి పోటీ ఉన్నా రేవంత్‌పై నమ్మకంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆయననే రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించింది.
1969 నవంబర్ 8న మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లిలో జన్మించారు రేవంత్ రెడ్డి. విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు మళ్లారు. ఓయూలో విద్యార్థిగా ఉన్నప్పుడు ఆరెస్సెస్ కు మద్దతుదారుగా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ చదువుతున్నప్పుడు రేవంత్‌రెడ్డి అఖిలభారత విద్యార్థి పరిషత్ సభ్యుడిగా ఉన్నారు. 24 ఏళ్ల వయసులోనే రేవంత్ రెడ్డికి వివాహమైంది. వారికి నైమిష అనే కుమార్తె ఉంది.
2006లో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ కు మద్దతుగా పని చేశారు. అప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ అంతంతమాత్రంగానే ఉంది. మిడ్జిల్ జెడ్పీటీసీ టికెట్ కోసం ఎంత ప్రయత్నించినా ఏ పార్టీ ఇవ్వకపోవడంతో సొంతంగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2008లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేశారు. అప్పుడు కూడా స్వతంత్రంగానే పోటీ చేసిన రేవంత్ రెడ్డికి టీడీపీ సపోర్ట్ చేసింది. ఎమ్మెల్సీగా అప్పటి అధికార పార్టీ అభ్యర్థిపై గెలిచి సంచలనం స్పష్టించారు రేవంత్ రెడ్డి. అప్పటి నుంచి ఆయన రాజకీయం గమనం వేగంగా మారిపోయింది. కొంత కాలానికే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపీలో చేరారు.
తన సొంతూరు అచ్చంపేట నియోజకవర్గంలో ఉంది. ఆ నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ కావడంతో కొడంగల్ కు మకాం మార్చారు రేవంత్ రెడ్డి. 2009 ఎన్నికల్లో తొలిసారి కొడంగల్ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీ చేశారు. అప్పుడు కొడంగల్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ లో బలమైన నేతగా ఉన్న గురునాథ రెడ్డి ఉన్నారు. ఆతనికి ఎదుర్కోవడం రేవంత్ రెడ్డి వల్ల కాదనుకున్నారు. 2009 ఎన్నికల ప్రచారంలోనూ రేవంత్ రెడ్డి చాలా కష్టాలు పడ్డారని చెబుతారు. అయితే ఆ ఎన్నికలో అనూహ్య విజయం సాధించారు రేవంత్ రెడ్డి. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కూడా కొడంగల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఓసారి ఎమ్మెల్సీ, రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలోనూ టీడీపీలోనే ఉన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధినేత టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అయినా.. రేవంత్ రెడ్డి హవా నడిచేది. ఆయన ఏం చేసినా చెల్లుబాటయ్యేది. అసెంబ్లీలో కూడా పార్టీ ఫ్లోర్ లీడర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు అయినా.. రేవంత్ రెడ్డి లేచి నిలబడితే అధికార పార్టీ నేతల కళ్లు ఎర్రబడేవి. ఓ దశలో కవిత మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేసే వరకు వ్యవహారం వెళ్లింది.
2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ అభ్యర్థికి ఓటేసేందుకుగాను ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారన్న ఆరోపణలతో తెలంగాణ ఏసీబీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించిన స్టింగ్ ఆపరేషన్ వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపింది. ఆ కేసులో అరెస్టయిన రేవంత్ రెడ్డి అయినా వెనక్కి తగ్గలేదు. కొద్ది రోజులు జైలులో ఉన్న రేవంత్ రెడ్డి.. విడుదలయ్యాక కూడా సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు.తెలంగాణలో బలపడుతున్న కేసీఆర్, ఏపీకే పరిమితమవుతున్న చంద్రబాబు.. ఈ రెండింటినీ బేరీజు వేసుకున్న రేవంత్ రెడ్డి వ్యూహాత్మక అడుగు వేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఆ తర్వాత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించింది.
ఆ తర్వాత రేవంత్ రెడ్డి మీద ఐటీ దాడులు జరగడం సంచలనంగా మారింది. రేవంత్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారంటూ ఓ న్యాయవాది ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు చేయడంతో ఇన్‌కం ట్యాక్స్ దాడులు నిర్వహించింది. ఇక, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి బరిలో నిలిచిన రేవంత్ రెడ్డి ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే ఆ ఎన్నికల సమయంలో కొడంగల్‌లో చోటుచేసుకన్న పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. పోలింగ్‌కు రెండు రోజుల ముందు పోలీసులు రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. దీనిపై ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్‌లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన రేవంత్ రెడ్డి.. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.