లయన్ రేవంత్‌రెడ్డి కమింగ్.. ఇక కాస్కో కేసీఆర్...
posted on Jun 26, 2021 @ 10:33PM
పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి. రామ్‌గోపాల్‌వర్మ మాటల్లో చెప్పాలంటే సింహాన్ని పీసీసీ ప్రెసిడెంట్‌గా ప్రకటించి సూపర్ ఫెంటాస్టిక్ డెసిషన్ తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పుడిక పులులన్నీ ఆ సింహాన్ని చూసి భయపడాల్సిందే. తెలంగాణ రాజకీయం ఇప్పటి దాకా ఓ లెక్క. రేవంత్‌రెడ్డి ఎంట్రీతో ఇప్పుటి నుంచి ఇంకోలెక్క. ఆ లెక్క.. అనేక మంది తలరాతలు మార్చేసే అవకాశం ఉంది. సింహం వేటాడితే ఎట్టా ఉంటాదో ఇకపై చూడబోతోంది తెలంగాణ సమాజం. చిచ్చరపిడుగు రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ చీఫ్‌గా పగ్గాలు చేతబట్టి.. కేసీఆర్‌పై దండయాత్రకు దూసుకొస్తున్నారు. రేవంత్‌రెడ్డి టార్గెట్ ఒక్కటే.. అది కేసీఆర్‌ను గద్దె దింపడం. ఆయన్ను ఒక్కరోజైనా జైల్లో పెట్టడం.
లేటైనా.. లేటెస్ట్‌గా జెట్ స్పీడ్‌తో దూసుకొస్తున్నారు డైనమిక్ లీడర్ రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్‌లో ఇంత స్పీడ్‌గా ఎదిగిన మరో నేత మనకు కనిపించరు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నాక.. ఇక టీడీపీతో వర్కవుట్ కాదని.. హస్తం పార్టీలో చేరారు. అనతికాలంలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. ఇప్పుడు పీసీసీ చీఫ్ పోస్ట్ సాధించారు. ఆ పదవే ఆయన్ను ఏరికోరి వరించింది. సీనియర్లు ఎన్ని కొర్రీలు పెట్టినా.. అధిష్టానానికి ఎన్ని లేఖలు రాసినా.. వీహెచ్ లాంటి నేతలు ఎంతగా రచ్చ చేసినా.. అవేవీ రేవంత్ స్పీడ్‌కు బ్రేకులు వేయలేకపోయాయి. రాహుల్‌గాంధీ ఆశీస్సులు పుష్కలంగా ఉండటం.. క్షేత్ర స్థాయిలో నివేదికలన్నీ రేవంత్‌రెడ్డికే అనుకూలంగా ఉండటంతో.. ఆయన పేరునే ఖరారు చేయక తప్పలేదు అధిష్టానానికి. చేష్టలుడిగి.. చేవ చచ్చిన కాంగ్రెస్‌కు.. ఇప్పుడు రేవంత్‌రెడ్డే పెద్ద దిక్కు. రేవంత్ హస్తం పార్టీ హస్త రేఖలు మార్చే మొనగాడు. అందుకే, కాంగ్రెస్ ఈసారి ఎలాంటి తప్పు చేయకుండా.. రేవంత్‌రెడ్డికి పీసీసీ కిరీటం కట్టబెట్టింది. ఇన్నేళ్ల చరిత్రలో ఆ పార్టీ తీసుకున్న మంచి నిర్ణయాల్లో ఇదొకటిగా నిలిచిపోతుందని అంటున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అసలేమాత్రం బాగాలేదు. కేసీఆర్ దూకుడు ముందు హస్తం పార్టీ అస్తవ్యస్థం అవుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రేవంత్‌రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్‌గా ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టైంది. దమ్మున్న మొనగాడు పార్టీ పగ్గాలు చేపట్డడంతో ఇక కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వచ్చినట్టేనంటూ అప్పుడే ఊరూరా సంబరాలు చేసుకుంటున్నారు రేవంతన్న అభిమానులు.
ఇక, ఇవాళ రాత్రి కేసీఆర్ ప్రశాంతంగా నిద్రపోలేరని ఎద్దేవా చేస్తున్నారు కాంగ్రెస్‌వాదులు. ఎందుకంటే ఇకపై కేసీఆర్‌కు మనశ్శాంతి కరువవుతుందని చెబుతున్నారు. రేవంత్ రంగంలోకి దిగితే మామూలుగా ఉండదు మరి. కేసీఆర్‌కు చుక్కలే. పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ.. రేవంత్‌రెడ్డికే ఒకటే పని.. ఒకటే ధ్యాస.. ఒకటే లక్ష్యం.. అది కేసీఆర్‌ను దెబ్బకొట్టడం. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచీ.. రాత్రి నిద్ర పోయేదాక.. కేసీఆర్ పని పట్టడమే రేవంత్‌రెడ్డి పని. రేవంత్ రంగంలోకి దిగితే కేసీఆర్‌కు మామూలుగా ఉండదిక. దేత్తడి.. పోచమ్మ గుడే... ఇక కాస్కో కేసీఆర్.....