ముంచుకొస్తున్న డెల్టా ప్లస్.. తెలుగుస్టేట్స్ అలర్ట్..
posted on Jun 26, 2021 @ 2:21PM
డెల్టాతోనే డేంజర్ అనుకుంటే డెల్టా ప్లస్ మరింత డేంజరస్ అంటున్నారు సైంటిస్టులు. కొత్త వేరియంట్ మరింత వేగంగా వ్యాపిస్తోంది. దేశంలో 12 రాష్ట్రాల్లో.. 50కిపైగా కేసులు నమోదయ్యాయి. డెల్టా ప్లస్ కేసుల్లోనూ మహారాష్ట్ర ముందుగా బలవుతోంది. అత్యధికంగా మహారాష్ట్రలో 22 కేసులు.. తమిళనాడులో 9, మధ్యప్రదేశ్‌లో 7 కేసులు వెలుగుచూశాయి. కేరళలో మూడు, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో రెండేసి కేసులు.. ఏపీ, ఒడిశా, రాజస్థాన్, జమ్ము, కశ్మీర్, హరియాణా, కర్ణాటకల్లో ఒక్కో కేసు బయటపడ్డాయి.
సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటకల్లో కేసులు నమోదు కావడంతో తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. అన్ని జిల్లాల వైద్య, ఆరోగ్య అధికారులను రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు అలర్ట్ చేశారు. కొవిడ్ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా రోజుకు లక్ష తగ్గకుండా చేయాలని సూచించారు. డెల్టా ప్లస్ వేరియంట్ సోకినవారికి ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో ఆస్పత్రుల్లో ప్రాణవాయువు ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 130 (డీఎంఈ, టీవీవీపీ) ఆస్పత్రుల్లో 27,141 పడకలను వైద్య శాఖ సిద్ధం చేసింది. 10,224 బెడ్స్‌కు ఆక్సిజన్ లైన్ ఏర్పాటు చేయగా, మిగిలిన 16,917 పడకలకు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. డెల్టా ప్లస్‌పై ఏపీ సైతం అప్రమత్తమైంది. ఇప్పటికే సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించి తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
మహారాష్ట్రలో థర్డ్ వేవ్‌లో ఐదు లక్షల మంది పిల్లలు సహా 50 లక్షల మంది వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని ఆ రాష్ట్ర మంత్రి రాజేంద్ర షింగ్నే ఆందోళన వ్యక్తం చేశారు. మూడో వేవ్‌లో దాదాపు 8 లక్షల యాక్టివ్ కేసులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 5 లక్షల మంది పిల్లల్లో 2.5 లక్షల మందికి ఆస్పత్రి చికిత్స అవసరమవుతుందని అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. థర్డ్‌వేవ్, డెల్టా ప్లస్ ముప్పు నేపథ్యంలో మహారాష్ట్ర.. మళ్లీ లెవెల్-3 ఆంక్షలను అమల్లోకి తెచ్చింది.
డెల్టా వేరియంట్‌కు.. బీటా వేరియంట్‌లోని కే417ఎన్ మ్యుటేషన్ తోడై.. డెల్టా ప్లస్ వేరియంట్‌గా రూపొందిందని నిపుణులు వివరిస్తున్నారు. ప్లస్ అంటే దీని తీవ్రత ఎక్కువని అర్థం కాదని చెబుతున్నారు. డెల్టా ప్లస్ కేసులు పెరుగుతున్నందున్న అప్రమత్తంగా ఉండాలని ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక సహా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కేంద్రం హెచ్చరించింది.
కరోనా థర్డ్‌వేవ్ ముప్పు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ.. అది రెండో వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడం ద్వారా ఈ ముప్పును వీలైనంతవరకూ బాగా తగ్గించవచ్చని వెల్లడైంది. ఐసీఎంఆర్‌కు చెందిన సందీప్ మండల్, బలరామ్ భార్గవ్, సమీరన్ పాండా, ఇంపీరియల్ కాలేజ్ లండన్‌కు చెందిన నిమలన్ అరినమిన్‌పతి చేసిన ఈ అధ్యయన నివేదిక ‘ప్లాసిబిలిటీ ఆఫ్ ఏ థర్డ్ వేవ్ ఆఫ్ కొవిడ్-19 ఇన్ ఇండియా: ఏ మ్యాథమెటికల్ మోడలింగ్ బేస్డ్ ఎనాలిసిస్’’.. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్‌లో ప్రచురితమైంది.