కేంద్రమంత్రిపై ట్విట్టర్ రివేంజ్! ఏఆర్ రెహమాన్ కారణమా?
posted on Jun 26, 2021 @ 3:46PM
కేంద్రప్రభుత్వం వర్సెస్ ట్విట్టర్. ఐటీ చట్టాల అమలుపై కొంతకాలంగా ఓ రేంజ్‌లో వార్ నడుస్తోంది. కేంద్రం స్ట్రాంగ్ యాక్షన్‌తో ట్విట్టర్‌ను కార్నర్ చేయడంతో దిగిరాక తప్పలేదు. అంతకుముందు కోర్టుకు వెళ్లినా.. ఇక తప్పేలా లేదంటూ ఐటీ చట్టాలకు సరేనంటూ తలొగ్గింది ట్విట్టర్. కేంద్రం దెబ్బకు దిబ్బ తిరిగి మైండ్ బ్లాంక్ అయినంత పనైంది ఆ అమెరికన్ కంపెనీకి.
దబాయించడమే తెలిసిన ట్విట్టర్‌ను దడదడలాడించిన ఘనత మాత్రం కేంద్రానిదే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కే చుక్కలు చూపెట్టిన ట్విట్టర్.. భారత ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ముందు తోక ముడిచింది. దీన్ని అవమానంగా భావించిందో, లేక ప్రతీకారం తీర్చుకోవాలనుకుందో.. శుక్రవారం మంత్రి ట్విట్టర్ అకౌంట్‌ను గంట పాటు ఆపేయడం కలకలం రేపింది. ట్విట్టర్ ఓవరాక్షన్‌పై రవిశంకర్ ప్రసాద్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. గంట తర్వాత అకౌంట్ పని చేసినా.. రచ్చ మాత్రం కంటిన్యూ అవుతోంది. మరోమాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శశిథరూర్ సైతం తనకూ రెండుసార్లు ఇలానే జరిగిందంటూ ట్విట్టర్‌పై మండిపడ్డారు.
ఇంతకీ కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ ఖాతాను గంటసేపు ఎందుకు బ్లాక్ చేయాల్సి వచ్చిందంటూ ఆరా తీస్తే.. ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది. మంత్రి గారి ట్విట్టర్ అకౌంట్‌పై మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఎఫెక్ట్ పడింది. నేరుగా లేకపోయినా.. ఆయన కంపోజ్ చేసిన ఓ సాంగ్ రవిశంకర్ అకౌంట్ మూతపడేలా చేసింది. ఎలాగంటే...
కాపీరైట్ చట్టం కింద ట్విట్టర్ సంస్థ మంత్రి ట్వీట్లను నిలిపివేసింది. అయితే మంత్రి రవిశంకర్ ఓ మ్యూజిక్ కంపెనీ సౌండ్‌ట్రాక్‌ను వాడడం వల్ల కాపీరైట్ జరిగినట్లు తేలింది. ఏఆర్ రెహ్మాన్ కంపోజ్ చేసిన ‘మా తుజే సలామ్’ పాట సౌండ్‌ట్రాక్‌లోని ఓ క్లిప్‌ను మంత్రి పోస్ట్ చేసిన ఓ వీడియోలో ఉన్నట్టు లుమెన్ డేటాబేస్ ద్వారా వెల్లడైంది. అమర వీరులకు నివాళులర్పిస్తూ మంత్రి రవిశంకర్ పోస్ట్ చేసిన వీడియోలో మా తుజే సలామ్ ట్రాక్ వాడటంతో కాపీరైట్స్ స్ట్రైక్ పడింది. సోని మ్యూజిక్ సంస్థ ఆ కాపీరైట్‌ను జారీ చేసింది. అమెరికాకు చెందిన డిజిటల్ మిలీనియమ్ కాపీరైట్ యాక్ట్ కింద ఈ ఉల్లంఘన జరిగినట్లు ట్విట్టర్ వెల్లడించింది. గంట తర్వాత మళ్లీ పునరుద్దరించినా.. ట్విట్టర్ సంస్థ భారతీయ ఐటీ చట్టాలను ఉల్లంఘించిందంటూ మంత్రి మండిపడ్డారు. భారత ఐటీ శాఖకు ట్విట్టర్‌కు మధ్య పెద్ద ఎత్తున వివాదం నెలకొన్ని ప్రస్తుత సందర్భంలోనే ఈ ఘటన జరగడం కాకతాళీయమా? లేక, ఉద్దేశ్యపూర్వకమా? అనే అనుమానం రాకమానదు. ముందుముందు ఈ కవ్వింపు చర్యలు ఎక్కడికి దారి తీస్తాయో చూడాలి...