ఫస్ట్ రౌండ్ లో ఈటలదే విన్! కేసీఆర్ దిగొచ్చారుగా...
posted on Jun 26, 2021 @ 3:42PM
రాజకీయాలలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చును. లెఫ్ట్ లో పుట్టి రీజినల్ పార్టీలో ఎదిగిన ఈటల రాజేందర్, రైటిస్ట్ పార్టీ బీజేపీలో చేరతారని ఎవరైనా ఉహించారా, ఒక్క ఈటల మాత్రమే కాదు, ఇంకా చాలా మంది, విభిన్న భావజాలాలకు చెందిన వారు, అందుకు విభిన్న భావజాల పార్టీలలో చేరి సర్దుకు పోతున్నారు. రాజకీయ అవసరాలు ఎంతటి వారిని అయినా చివరకు కేసీఆర్’ అంతిటి వాడినే అయినా, కిందకు దిగి వచ్చేలా చేస్తాయి. అందులోనూ అందితే జుట్టు, లేదంటే కాళ్ళు పటుకోవడంలో సిద్దహస్తుల విషయం అయితే చెప్పనే అక్కర లేదు. అదేమంటే, వసుదేవుడు ... గాడిద కాళ్ళు ఉండనే ఉన్నాయి.
ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్న చరిత్రను చూస్తే, అదే అనిపిస్తుంది. ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత గౌరవం ఇస్తారో, అందరికే తెలిసిన విషయమే. ఇంతవరకు ప్రగతి భవన్’లో కాలు పెట్టిన ప్రతిపక్ష నాయకులను వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చును.సరే, మంత్రులకే ఎంట్రీ లేని కోటలోకి, ప్రతిపక్ష పార్టీల నాయకులకు ఎంట్రీ లేక పోవడం పెద్ద విచిత్రం కాదు. నిజమే, కుక్క మనిషిని కరిస్తే అది వార్త కాదు. మనిషి కుక్కను కరిస్తే అది వార్త ... అని కదా అంటారు. అందుకే కాంగ్రెస్ నాయకులకు ముఖ్యమంత్రి అప్పాయింట్మెంట్ ఇవ్వడం సంచలన బ్రేకింగ్ వార్త అయింది.
కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, జగ్గా రెడ్డి. కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి బృందానికి ప్రగతి భవన్’లోకి ఎంట్రీ కాదు. ఏకంగా రెడ్ కార్పెట్ స్వాగతమే లభించింది. అంతే, కాదు కాంగ్రెస్ నేతలకు అడిగిందే తడవుగా అప్పాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా,యదాద్రి జిల్లా గూడూరు పోలీసి స్టేషన్’లో దళిత మహిళ మరియమ్మ అనుమాన స్పద మృతిపై ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని పుచ్చుకుని, నిముషాల్లోనే, చర్యలు తీసుకున్నారు. మరియమ్మ మృతిపై విచారణకు ఆదేశించారు. నిజ నిర్ధారణ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, అవసరం అయితే, మరియమ్మ మృతికి బాధ్యులైన వారిని ఉద్యోగం నుంచి తొలిగించాలని, బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించాలని డీజీపీని ఆదేశించారు. అంతే కాదు మరియమ్మ కుమారుడు ఉదయ్ కిరణ్’కు రూ.15 లక్షలు, ఆమె ఇద్దరు కుమార్తెలకు రూ.10 లక్షల వంతున ప్రభుత్వ సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అంతే కాదు, ఎస్సీల పట్ల సమాజ దృక్పధం మారాలని, ఎస్సీలు పేదలపట్ల పోలీసుల ఆలోచనాదోరణి మారాలని ముఖ్యమంత్రి ఉద్భోదించారు. ఎస్సీల మీద చేయి పడితే ఊరుకునేది లేదని ఓ హెచ్చరిక కూడా చేశారు.
ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులకు అప్పాయింట్మెంట్ ఇవ్వడమే చిత్రం, విచిత్రం అనుకుంటే, ఇలా నిముషాల్లో విపక్ష నేతల డిమాండ్లను జీహుజూర్ తరహాలో అములు చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. అయితే ఇందంతా హుజురాబాద్ మహత్యం అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్’ను ముఖ్యంగా తెరాస భవిష్యత్’ను తిరగరాసే ప్రమాదం పొంచి ఉందని, అందుకే కేసీఆర్’ లో ఈమార్పు అని అంటున్నారు. నిజానికి, హుజురాబాద్, ఈటల ఎఫెక్ట్’ తోనే కేసీఆర్, ఫార్మ్ హౌస్ వదిలి ప్రజల్లోకి వెళ్లారు.అధికార కార్యక్రమాల పేరున వెళ్ళినా, ఎన్నికల ప్రసంగమే చేశారు. ఇక, హుజురాబాద్ ‘లో అయితే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను రేషన్ కార్డులు ఇతర ప్రయోజనాలను ఇంటింటికి పంచుతున్నారు. మరో రాజకీయ బేరసారాలు జోరుగా సాగుతున్నాయాని, ఈటల ఇతర బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయినా అది వేరే విషయం అనుకోండి.
అయితే మార్పు మంచిదే అయినా, ఎస్సీల మీద చేయిపడితే ప్రభుత్వం ఊరుకోబోదని, నిందితులపై తక్షణమే కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన హెచ్చరిక స్వాగతించ దగినదే అయినా, యాదాద్రి లాకప్‌డెత్ ఘటనపై నిమిషాల్లో విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి , ఏళ్లు గడిచిపోతున్నా నేరెళ్లలో దళితులపై జరిగిన భౌతిక దాడులపై అవే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న సందేహాలు సహజంగానే వ్యక్తమవుతున్నాయి. నేరెళ్ళ దురాగతం జరిగి ఇన్నేళ్ళు అయినా, ఇప్పటకీ, కేటీఆర్ తమ సొంత నియోజకవర్గం సిరిసిల్లకు ఎప్పుడు వెళ్ళినా, దళితులను అరెస్ట్ చేయడం, లాఠీలు విరగడం రొటీన్’ గా జరిగి పోతూనే ఉంది, కదా.. అన్న ప్రశ్నలు కూడా దళిత వర్గాల నుంచే వినవస్తున్నాయి. ముఖ్యమంత్రి మొదలు అధికార పార్టీ అగ్రనేతలు హుజురాబాద్’ ఉప ఎన్నిక విషయంలో వ్యవహరిస్తున్నతీరు చూస్తే, ఎందుకో ఉలిక్కి పడుతున్నట్లు కనిస్తోంది. అందుకే, ఫస్ట్ రౌండ్’లో ఈటలదే పై చేయి అంటున్నారు విశ్లేషకులు.