జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌పై ప్ర‌జాగ్ర‌హం.. సీఎం బ‌య‌టికొస్తే చెడుగుడే..

క‌రోనా కార‌ణంగా చాలా కాలంగా ఎక్క‌డి జ‌నాలు అక్క‌డే. ఏపీలో కొవిడ్ విజృంభ‌ణ భారీగా ఉండ‌టంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. క‌రోనా బారిన ప‌డితే ఏపీలో ఆసుప‌త్రి బెడ్లు కూడా దొర‌క‌వ‌ని, ఆక్సిజ‌న్‌, మందులు లేక ప్రాణాలు పోవ‌డం ఖాయ‌మ‌ని.. ప్ర‌జ‌లే ఎవ‌రి జాగ్ర‌త్త‌లో వాళ్లు ఉన్నారు. క‌ర్ఫ్యూతో రాష్ట్ర‌మంతా నిర్మానుషంగా మార‌డంతో ఏపీ అంతా ప్ర‌శాంతంగా ఉంద‌నే భ్ర‌మ‌లో ఉన్నారు పాల‌కులు.  తాజాగా, కేసులు త‌గ్గ‌డం, క‌ర్ఫ్యూ ఎత్తివేయ‌డంతో సీఎం జ‌గ‌న్‌రెడ్డిపై ప్ర‌జాగ్ర‌హం వెల్లువెత్తుతోంది. జ‌నాలు రోడ్ల‌పైకి వ‌చ్చి నిర‌స‌న‌లు, ధ‌ర్నాలతో త‌మ క‌డుపుమంట వ్య‌క్తం చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా ఏ జిల్లాలో చూసినా.. ఆందోళ‌న‌లు అట్టుడుకుతున్నాయి. సీఎం జ‌గ‌న్ విధానాలపై ప్ర‌జల్లో ఆగ్ర‌హ జ్వాల కాక రేపుతోంది. ఆ సెగ మంత్రుల‌కూ తగులుతోంది.  2 ల‌క్ష‌ల‌కు పైగా ఉద్యోగాలు ఖాళీ ఉంటే.. ప‌ట్టుమ‌ని 10వేలతో జాబ్ క్యాలెండ‌ర్ రిలీజ్ చేసి గొప్ప‌ల‌కు పోయిన ఏపీ స‌ర్కారుకు గూబ గూయ్‌మ‌నేలా ఆందోళ‌నల‌తో విరుచుకుప‌డుతున్నారు నిరుద్యోగులు. కొన్ని రోజులుగా ఎక్క‌డ చూసినా నిరుద్యోగుల ధ‌ర్నాలే.. రోడ్ల‌పై ఆందోళ‌న‌లే. జ‌గ‌న్‌రెడ్డి డౌన్ డౌన్ అనే నినాదాలే. తాజాగా, ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌పై రాష్ట్రంలోని పలు విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో విద్యార్థి, యువజన సంఘాల నేతలు నిరసన చేపట్టారు. మంత్రులు, ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడికి యత్నించారు.  జ‌గ‌న్ స‌ర్కారు మీద‌ మీద వ్య‌తిరేక సెగ.. మంత్రుల‌కు గ‌ట్టిగానే తాకింది. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి, విజయనగరంలో మంత్రి బొత్స, విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్, కడపలో ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా  ఇళ్లను ముట్ట‌డించారు విద్యార్థి సంఘాల నేత‌లు. ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ విద్యార్థులు ప్ర‌యత్నించారు. విద్యార్థి సంఘాల ఆందోళ‌న‌ల‌ను పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ అడ్డుకోవ‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్తాయి. పలువురు విద్యార్థి నాయకులకు గృహనిర్బంధం చేశారు. నిరుద్యోగుల అరెస్టుల‌పై అంతా భ‌గ్గుమంటున్నారు.  ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌లో నామమాత్రంగా ఖాళీ పోస్టులను చూపించారంటూ నిరుద్యోగులు మండిప‌డుతున్నారు. జాబ్‌లు అడిగితే జైలుకు పంపుతారా అని ప్రశ్నిస్తున్నారు. జగనన్న వస్తే ఉద్యోగాల జాతర అన్నారని... లక్షల ఉద్యోగాలు ఉంటే పది వేలతో జాబ్ క్యాలెండర్‌ ప్రకటిస్తారా అని మండిపడుతున్నారు. పాదయాత్రలో నిరుద్యోగులకు జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని.. ఖాళీలను భర్తీ చేసేలా జాబ్ క్యాలెండర్‌ మళ్లీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల‌ ఆందోళ‌న‌ల‌తో ఆంధ్రప్రదేశ్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. క‌ర్ఫ్యూ తొల‌గించ‌డంతో జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో అన్యాయానికి గురవుతున్న అన్ని వ‌ర్గాలు  నుంచి నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్‌ల సమస్యల పరిష్కారం కోరుతూ చిత్తూరు కలెక్టరేట్ ద‌గ్గ‌ర‌ ఆందోళన చేప‌ట్టారు. జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో త‌ర‌లివ‌చ్చిన‌ అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు. మ‌రోవైపు, తెనాలిలో పెట్రో ధరల పెంపును నిరసిస్తూ స్థానికులు నిరసనకు దిగారు. గాంధీ చౌక్ నుంచి మార్కెట్ సెంటర్ వరకు బైక్‌ని తాడుకు కట్టి లాగుతూ ర్యాలీ చేపట్టారు. మోటార్ సైకిల్‌ను కాల్వలో ప‌డేసి నిరసన తెలిపారు. పెంచిన ఆయిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇలా, అనేక స‌మ‌స్య‌ల‌పై ఏపీ వ్యాప్తంగా జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారుకు వ్య‌తిరేకంగా నిర‌స‌న జ్వాల‌లు ఎగిసిప‌డుతున్నాయి.   

కర్ణాటక కాంగ్రెస్ లో లొల్లీ.. డీకే, సిద్దూ మధ్య ఫైట్..

కర్ణాటక శాసన సభ ఎన్నికలకు కొంచెం అటూ ఇటుగా రెండు సంవత్సరాల సమయం ఉంది. అయితే, ఇంతలోనే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో కుర్చీలాట మొదలైంది ... పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి, రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు, కౌన్ బనేగా సీఎం అంటూ చొక్కాలు చించుకుంటున్నారు. అవును, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కొంచెం చాలా ఎక్కువ. అలాగే, అంతర్గత కుమ్ములాటలు కూడా కొంచెం ఎక్కువ. అందుకే ఎవరి అభిప్రాయాన్ని వారు స్వేచ్చగా చెపుతున్నారు, అందులో తప్పేముంది అనుకుంటే అనుకోవచ్చును. కానీ, ఇద్దరు ముఖ్యనేతలు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సిద్దరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ వర్గాల మధ్య ఇప్పటినుంచే ముఖ్యమంత్రి పదవి కోసం మాటల యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే,  పార్టీ విజయావకాశాలను దెబ్బ తీస్తుందని, పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్త పరుస్తున్నాయి.   గత వారం పది రోజులుగా, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత సిద్దరామయ్య అనుచరులు, కాబోయే ముఖ్యమంత్రి సిద్దరామయ్య అంటూ ప్రకటనలు చేస్తున్నారు. సిద్దరామయ్య వర్గం ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రకటనలు సహజంగానే, పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న మరో ముఖ్య నేత శివకుమార్’ను ఇబ్బందికి గురిచేస్తున్నాయి.ఇదలా ఉంటే  తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ అధికార  వెబ్సైటులో శివకుమార్ పేరు ముఖ్యమంత్రి అభ్యర్ధిగా రావడంతో, కొత్త దుమారం మొదలైంది. సిద్దరామయ్యా వర్గం పార్టీలో ఆయన స్థానం ఏంటో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎల్పీ నేత  సిద్దరామయ్య, పీసీసీ చీఫ్ శివకుమార్ వర్గాల మధ్య  ముఖ్యమంత్రి పదవి కోసం సాగుతున్న  అంతర్గత కుమ్ములాటలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఏ మాత్రం రుచించడం లేదు. ముందు ఎన్నికలలో  గెలిస్తే కదా, ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్న వచ్చేది, అనతవరాకు అయినా ఆగలేరా అంటూ నాయకులు కార్యకర్తలు నేతలను ప్రశ్నిస్తున్నారు. ఆందోళన వ్యక్తపరుస్తున్నారు.  బీజేపీలోని అంతర్గత కుమ్ములాటలను అనుకూలంగా మలచుకోవలసిన సమయంలో కాంగ్రెస్ అగ్రనేతల అనుచరుల మధ్య వివాదం అసలుకే మోసం తెచ్చేల ఉందని పార్టీ సీనియర్ నాయకులు వాపోతున్నారు. అంతర్గత కుమ్ములాటల కారణంగానే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేక పోయింది. అంతర్గత కుమ్ములాటల కారణంగానే,2019 లో కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది, అని సీనియర్ నేతలు గుర్తు చేస్తున్నారు. మరో వంక  పార్టీలో పుట్టి పెరిగిన వారికంటే, ఇతర పార్టీల నుంచి వచ్చిన సిద్దరామయ్య వంటి వారికి వారికి ప్రాధాన్యత ఇవ్వడం వలన, పార్టీ నిర్మాణంలో రాళ్లెత్తిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయి అన్న భావన పార్టీలోని ఒక వర్గం బలంగా వినిపిస్తోంది.  ఇక సిద్దరామయ్యను కాబోయే సీఎంగ ప్రొజెక్ట్ చేస్తున్న అయన అనుచరులు, ప్రభుత్వ వ్యతిరేకను పెద్దగా చేసి చూస్తున్నారని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజమే, ప్రభుత్వ వ్యతిరేకత మెల్ల మెల్లగా పెరుగుతోంది, అయితే, ఎన్నికల సమయానికి అది ఎటు మొగ్గుచూపుతుందో ఇప్పుడే చెప్పలేమని, ఇలాంటి పరిస్థితిలో అధికారంలోకి వచ్చేసినట్లే లెక్కలు కట్టడం ఆత్మహత్యా సాదృశ్యం కాగలదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరో వంక కాంగేస్ ఎమ్మెల్యే ఒకరు, “కాంగ్రెస్ పార్టీ మనుగడకు, మెరుగైన ఫలితాలు సాధించేందుకు సిద్దరామయ్యకు ఉన్న జనాకర్షణ శక్తి అవసరం, అదే సమయంలో శివకుమార్ ఎన్నికల వ్యూహ రచనా కూడా  అంతే అవసరం. ఆ ఇద్దరు ఒకటిగా కలిసి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు మరింత దగ్గరవుతాయి” అన్నారు.   కాగా ఇద్దరి మధ్య విబేధాల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం  జోక్యం  చేసుకుని, ఇద్దరికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలని లేదంటే, ఆ ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తుందని పార్టీ ఎమ్మెల్యే ఒకరు పేర్కొన్నారు.  పార్టీ సంప్రదాయం ప్రకారం  కేపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేసులో ఉంటారు. ఆవిధంగా చూస్తే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే, శివ కుమార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అయితే అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు, శివకుమార్, సిద్ద్దరామయ్య ఒకటిగా పనిచేయవలసి ఉంటుందని, పార్టీ కార్యకర్తలు నాయకులను ఏకతాటిపై నడిపించవలసి ఉంటుందని, విశ్లేషకులు భావిస్తునారు. ముఖ్యంగా అధిష్టాన వర్గం జోక్యంచేసుకుని, ఇద్దరి మధ్య గల  విబేధాలను ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత మంచిదని పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుంటుందా? ఆ ఇద్దరి మధ్య సయోధ్య సాధ్యమవుతుందా? ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందా? అన్నీ అనుకున్నట్లు జరిగితే.. కౌన్ బనేగా సీఎం ? అదే పెద్ద ప్రశ్న .. ది బిగ్ క్వశ్చన్ ..

పథకాల్లో కోతలు.. జగన్ మళ్లీ మడమ తిప్పారు! 

ముందు ఎంతైనా సరే తేవాల్సిందే..ఇవ్వాల్సిందే అన్నారు.  తర్వాత ఏ నిధులైనా మళ్లించాల్సిందే..ఇవ్వాల్సిందే అన్నారు. ఆ తర్వాత అప్పు చేసైనా సరే..ఇవ్వాల్సిందే అన్నారు. ఆ ముచ్చట కూడా తీరాక.. అప్పుల కోసం సర్కారీ భూములు తాకట్టు పెట్టండి..ఏమైనా సరే ఇవ్వాల్సిందే అన్నారు. అది సరిగా కుదరక..ఇప్పుడిక చివరి అంకంలోకి దిగారు. ఆదాయం ఎటూ రాదని తేలిపోయింది కాబట్టి.. ఇక ఖర్చు తగ్గించడమే మార్గం అని డిసైడైపోయారు. కావాలంటే ఎన్నికల ముందు మళ్లీ పెంచుదాం...ఇప్పటికైతే కోసేయండనే ఆదేశాలొచ్చాయి.  నవరత్నాలు..సంక్షేమ పథకాలు..జగన్ కి ప్రాణం. ఎందుకంటే తాను జైలుకెళ్లినా..అధికారం అట్టిపెట్టేలా చేసేవి అవే మరి. తాము ఏం చేసుకున్నా..జనం మాట్లాడకుండా ఉండటానికి అవే ఆయుధాలు మరి. ఈ విషయంలో అధికారంలోకి రాక ముందే స్కెచ్ రెడీ అయింది. అందుకే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే పందేరం మొదలైంది. రెండు నెలలకోసారి ఏదో ఒక పేరుతో ఒక ఫ్యామిలీకి 10 వేలు వేస్తున్నారు. దీంతో జనం కూడా మిగతా విషయాలు పట్టించుకోవడం లేదనే భావనలో వైసీపీ నేతలు ఉన్నారు. రాజధాని తరలించినా.. అక్రమ కేసులు పెట్టినా..మాట విననివారిని వేధించినా...పోలీసులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అంతా వైసీపీ కార్యకర్తల్లా పని చేసినా కూడా పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులు పట్టించుకోరనదే వారి కాన్సెప్ట్. మరి ఈ పథకాలన్నీఅమలు  కావాలంటే డబ్బులెలా? అందుకే ఉన్న డబ్బులన్నీ అటే డైవర్ట్ చేశారు. అప్పులు చేశారు. చివరకు తాకట్టులు పెడుతున్నారు.అయినా ఆదాయమే లేకపోతే..ఎన్నాళ్లనీ సర్దుతారు. ఆదాయం వచ్చే పనులేమీ చేయటం లేదు సరి కదా.. ఉన్న కంపెనీలు పోయేలా చేస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కరెంట్ బిల్లు పెంచేది లేదంటూనే..దొంగదారిలో అన్నీపెంచేశారు. ఆస్తిపన్ను విధించారు. ఇవన్నీకూడా సరిపోవటం లేదు. అందుకే ఇప్పుడు కోతలు మొదలెట్టారు. లబ్ధిదారుల సంఖ్య తగ్గించే పనిలో పడ్డారు. పెన్షన్లలో అవకతవకలు అంటూ లక్షల మందిని గుర్తించి..వారికి నోటీసులిచ్చారు. ఇవన్నీ ఉన్నాయని ఇప్పటివరకు తెలియక కాదు..ఇప్పుడు తీసేయాలి కాబట్టి.. ఇప్పుడే తెలిసింది.  మరోవైపు వైఎస్సార్ భీమా పథకంలో కూడా నెంబర్ తగ్గించేస్తున్నారు. ఇకపై అన్నిపథకాల్లోనూ వెరిఫికేషన్ పేరుతో భారీగా సంఖ్య తగ్గించబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. అమ్మ ఒడి, ఇతర పథకాలన్నిటికి ఇదే రూల్ పెట్టబోతున్నారు. దీంతో ఇప్పుడు లబ్దిదారుల్లో కలవరం మొదలైంది. ఎ వరికి తీసేస్తారో.. ఎవరిని ఉంచుతారో అనే ఆందోళన మొదలైంది. అందరూ వాలంటీర్లను సంప్రదిస్తున్నారు. పనిలో పనిగా...లోకల్ వైసీపీ నేతలకు చెప్పుకుంటున్నారు...మీరే ఏదైనా చేయాలని. ఇప్పుడే మొదలైన ఈ సెగ.. జిల్లా స్థాయి నేతలకు కొన్నిరోజుల్లో తగలనున్నది. ఆ తర్వాత మంత్రులకు..సీఎంకు చేరుతుంది. అయినా అలా తగులుతుందని ముందే తెలుసు కాబట్టి..  దానిని ఎలా కవర్ చేయాలో ముందే ప్లాన్ చేసుకుంటారు.కాకపోతే పథకాలు కోల్పోతున్న లబ్ధిదారుల ఆగ్రహం ఎలా ఉంటుందో..వారి రియాక్షన్ ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగుల రియాక్షన్ గట్టిగానే ఉంది  

తెర‌పైకి ఓటుకు నోటు కేసు? రేవంత్‌రెడ్డి మెడ‌కు వేలాడే క‌త్తి!

రేవంత్‌రెడ్డి. టీపీసీసీ ప్రెసిడెంట్‌. ఆయ‌న పేరు అధిష్టానం ప్ర‌క‌టించిందో లేదో వెంట‌నే ఓటుకు నోటు అంశం ప్ర‌స్తావించారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి. రేవంత్‌రెడ్డి రాజ‌కీయ ప్ర‌స్థానంలో మాయ‌ని మ‌చ్చ‌గా మారింది ఓటుకు నోటు ఎపిసోడ్‌. అది ఎల్ల‌ప్పుడూ సీఎం కేసీఆర్ చేతిలో బ్ర‌హ్మాస్త్రమే. రేవంత్‌రెడ్డితో త‌న‌కు ఎస‌రు వ‌స్తుంద‌నుకునే సంద‌ర్భంలో ఓటుకు నోటు కేసు మ‌ళ్లీ బ‌య‌ట‌కు తీసే అవ‌కాశం ఉందంటున్నారు. స‌రైన స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌యోగించ‌డానికే.. ఆ కేసును బ్ర‌హ్మాస్త్రంలా త‌న అమ్ముల పొదిలో కేసీఆర్ దాచారని చెబుతున్నారు. కేసీఆర్ కావాల‌నుకున్న‌ప్పుడు ఆ కేసులో మ‌ళ్లీ క‌ద‌లిక వ‌స్తుందంటున్నారు. తాజాగా, రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ కావ‌డంతో ఓటుకు నోటు కేసు మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌స్తుందా? అనే అనుమానం రాజ‌కీయ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.  కొన్ని వారాలుగా రేవంత్‌రెడ్డి పేరు పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వికి బ‌లంగా వినిపించింది. రేవంత్ పేరు దాదాపు ఖ‌రారంటూ వార్త‌లు వ‌చ్చాయి. సీనియ‌ర్లు ఢిల్లీలో మ‌కాం వేసి.. రేవంత్‌రెడ్డికి వ్య‌తిరేకంగా లాబీయింగ్ చేస్తున్న స‌మ‌యమ‌ది. స‌రిగ్గా అదే టైమ్‌లో అనూహ్యంగా ఓటుకు నోటు కేసులో మ‌ళ్లీ క‌ద‌లిక వ‌చ్చింది. ఏసీబీ నివేదిక మేర‌కు ఆ కేసులో ఈడీ ఛార్జిషీట్ ఫైల్ చేసింది. అయితే, అందులో చంద్ర‌బాబు పేరు తొల‌గించడం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. మ‌రోవైపు, ముందుగా త‌నపై విచార‌ణ వ‌ద్దంటూ రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టునూ ఆశ్ర‌యించారు. ఇలా.. పీసీసీ రేసులో రేవంత్‌రెడ్డి పేరు వినిపిస్తున్న స‌మ‌యంలోనే ఓటుకు నోటు కేసులో కాస్త హ‌డావుడి రావ‌డం కాక‌తాళీయ‌మా? లేక, కావాల‌నా? అనే అనుమానం వినిపిస్తోంది. రేవంత్‌రెడ్డి పీసీసీ ప్ర‌య‌త్నాల‌కు గండికొట్టేందుకే.. ఆ స‌మ‌యంలో ఆ కేసును క‌దిలించార‌ని అంటున్నారు. ఆ కేసును బూచీగా చూపించి.. రేవంత్‌రెడ్డికి పీసీసీ పీఠం ద‌క్క‌కుండా చేయాల‌నే ఎత్తుగ‌డ కావొచ్చ‌ని అనుమానిస్తున్నారు. ఇవేవీ, రేవంత్‌రెడ్డి ప్ర‌మోష‌న్‌ను అడ్డుకోలేక‌పోయాయి. పీసీసీ వ‌ర‌మాల ఆయ‌న మెడ‌లోనే ప‌డింది. అయితే, త‌న‌కు ద‌క్క‌ని పీఠం రేవంత్‌కు ద‌క్కింద‌నే అక్క‌స్సుతో కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి మ‌ళ్లీ ఓటుకు నోటు ప్ర‌స్తావ‌న తీసుకొచ్చార‌ని అంటున్నారు. అదొక్క‌టి మిన‌హా రేవంత్‌రెడ్డిపై బుర‌ద జ‌ల్ల‌డానికి ఆయ‌న ద‌గ్గ‌ర మ‌రే విష‌య‌మూ లేద‌ని మండిప‌డుతున్నారు.  అయితే, ఇక్క‌డ మ‌రో విశ్లేష‌ణ కూడా చ‌ర్చ‌కొస్తోంది. ఓటుకు నోటు కేసు ఇంకా ఓపెన్‌గా అలానే ఉంది. ఆ కేసులో ప‌క్కా వీడియో సాక్షం కూడా ఉంది. అదే కేసులో రేవంత్‌ ఓమారు జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఇటు ఏసీబీ, అటు ఈడీ ఆ కేసును డీల్ చేస్తున్నాయి. అసెంబ్లీ స్పీక‌ర్ టేబుల్ మీద కూడా ఆ కేసు అలానే పెండింగ్‌లో ఉంది. ఏసీబీ రాష్ట్ర ప‌రిధిలోని విచార‌ణ సంస్థ‌. ఈడీ కేంద్ర ఆధీనంలో ఉంటుంది. ఎంత కాద‌న్నా.. ప్ర‌భుత్వ క‌నుస‌న్న‌ల్లోనే ఆ కేసు ఫ‌లితం ఉంటుంద‌నేది ఓ ఆరోప‌ణ‌. ఆ లెక్క‌న‌,, కేంద్రంలో అధికారంలో ఉన్న‌ బీజేపీకి కాంగ్రెస్ పార్టీనే ప్ర‌ధాన శ‌త్రువు. కాంగ్రెస్ ముక్త్ భార‌త్ బీజేపీ ఏకైక ల‌క్ష్యం కాబ‌ట్టి.. భ‌విష్య‌త్‌లో రేవంత్‌రెడ్డి కీల‌క పొజిష‌న్‌కు చేరుకుంటే.. ఓటుకు నోటు కేసులో ఈడీ ద‌ర్యాప్తుతో ఉచ్చు బిగుసుకునే అవ‌కాశం లేక‌పోలేదు. ఇటు, కేసీఆర్ స‌ర్కారు సైతం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏసీబీ విచార‌ణ‌లో దూకుడు పెంచొచ్చు. ఇలా రేవంత్‌రెడ్డిని క‌ట్ట‌డి చేసేందుకు ఆయ‌న మెడ‌లో ఎప్పుడూ ఓటుకు నోటు క‌త్తి వేలాడుతూనే ఉంటుంద‌ని అంటున్నారు. అయితే, ఆ క‌త్తి వేటు ఎప్పుడు పడుతుంద‌నేది.. రేవంత్‌రెడ్డి ఎదుగుద‌ల‌ను బ‌ట్టి ఉంటుంది. పీసీసీ చీఫ్ కాగానే ఆయ‌న‌పై కేసు విచార‌ణ స్పీడ‌ప్ కాక‌పోవ‌చ్చు. కొన్నాళ్లు టైమ్ ఇచ్చి.. రేవంత్ దూకుడు ప‌రిశీలించి.. కేసీఆర్ సీటుకు ఎస‌రు వ‌స్తుందని అనిపిస్తే.. అప్పుడు మాత్ర‌మే ఆ కేసు చిక్కుముడులు విప్ప‌బ‌డ‌తాయి. అప్ప‌టి దాకా.. అవ‌స‌ర‌మైన‌ప్పుడు రేవంత్‌రెడ్డిని తోలుబొమ్మ‌లాట‌లా క‌ట్ట‌డి చేసే ఆ-ధారాలు కేసీఆర్ చేతిలో భ‌ద్రంగా ఉంటాయంటున్నారు. మ‌రి, రేవంత్‌రెడ్డి ఆ కేసు ఉచ్చు నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఒక్క‌టే ఛాన్స్‌. అది.. కేంద్ర‌, రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు మార‌డం. సో, రేవంత్‌రెడ్డి సీఎం అవ‌డం.. ఓటుకు నోటు కేసు క్లియ‌ర్ అవ‌డం.. రెండింటికీ లింకు ఉంటుంద‌న్న‌మాట‌. అప్ప‌టిదాకా ఉంటుంది రాజ‌కీయ‌ త‌మాషా....  

'మా'లో మ‌జారే మ‌జా.. సిని'మా' రాజ‌కీయం!

'మా' ఎన్నిక‌. ఇంతకు ముందెప్పుడూ లేనంత ఉత్కంఠ‌. ప్ర‌శాశ్‌రాజ్ బ‌రిలో నిల‌వ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఆయ‌న లోకల్ కాదంటూ ఓ వివాదం. ఆయ‌న‌కు టీఆర్ఎస్ మ‌ద్ద‌తు ఉందంటూ మ‌రో ఆరోప‌ణ‌. మెగా ఫ్యామిలీ స‌పోర్ట్ ఆయ‌న‌కే అనే టాక్‌. ప్ర‌కాశ్‌రాజ్‌కు కౌంట‌ర్‌గా పాలిటిక్స్ ఓ రేంజ్‌లో మొద‌లైపోవ‌డంతో 'మా' ఎన్నిక‌లు కాక రేపుతున్నాయి. తొలిసారి రాజ‌కీయ రంగు పులుముకుంటున్నాయి. మెగా ఫ్యామిలీకి పోటీనా అనేట్టు మంచు కుటుంబం కూడా సీన్‌లో ఎంట్రీ ఇవ్వ‌డంతో మ‌రింత మ‌జా. సీనియ‌ర్ల ఆశీస్సులు త‌న‌కేనంటూ.. జూనియ‌ర్ల‌తో క‌లిసి సేవ చేస్తానంటూ మంచు విష్ణు లేఖ‌తో రిక్వెస్ట్ చేసి అంద‌రినీ ఐస్ చేసేశారు. మోహ‌న్‌బాబు త‌న‌యుడు కాబ‌ట్టి ఈయ‌న‌కు వైసీపీ మ‌ద్ద‌తు ఉందా అనే అనుమానం ఫిల్మ్ న‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది.  సీవీఎల్‌. లేటైనా, లేటెస్ట్‌గా నేను సైత‌మంటూ పోటీకి సై అన్నారు. ఎప్పుడూ మీరు మీరేనా.. 'మా'లో మాలాంటోళ్లు ఉండొద్దా అంటూ నామినేష‌న్‌కు సిద్ధ‌మైపోయారు. సీవీఎల్‌.. మ‌రింత కాంట్ర‌వ‌ర్సీ స్టేట్‌మెంట్స్ కూడా చేశారు. తెలంగాణ‌, ఏపీల‌కు వేరువేరు 'మా'లు ఉండాల‌ని డిమాండ్ లేవ‌నెత్తారు. టాలీవుడ్‌లో ఎన్న‌డూ లేనిది.. కొత్త‌గా ఆంధ్ర‌-తెలంగాణ అనే ప్రాంతీయ భావాలు సీవీఎల్ తీసుకొస్తుండ‌టం కాక రేపుతోంది. అనూహ్యంగా ఆయ‌న‌కు రాముల‌మ్మ నుంచి స‌పోర్ట్ రావ‌డం విశేషం. 'మా'లో మెంబ‌ర్ కూడా కాని లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి సీవీఎల్ న‌ర్సింహారావుకు మ‌ద్దతు ఇచ్చారంటే.. ఆయ‌నను బీజేపీ ప్ర‌మోట్ చేస్తోందా అనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఎన్న‌డూ లేనిది.. బీజేపీ నేత విజ‌య‌శాంతి స‌డెన్‌గా మా ఎన్నిక‌ల‌పై స్పందించ‌డం, సీవీఎల్‌కు స‌పోర్ట్ చేయ‌డం చూస్తుంటే తెర వెనుక‌ ఏదో జ‌రుగుతోంద‌నే అనుమానం.  ఇక‌, ఎప్పుడూ మా అధ్య‌క్షులుగా మ‌గ‌వారేనా? మ‌హిళ‌ల‌కు ఇంకెప్పుడు ప‌ట్టం క‌డ‌తారంటూ.. గిరి గీచి బ‌రిలో దిగబోతున్నారు జీవిత అండ్‌ హేమ. మెగా కుటుంబానికి ఝ‌ల‌క్ ఇచ్చేందుకే జీవిత రాజ‌శేఖ‌ర్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నార‌నేది కొంద‌రి మాట‌. గ‌తంలోనూ ఓసారి మా వేదిక‌పై చిరంజీవి, రాజ‌శేఖ‌ర్ మ‌ధ్య డైలాగ్ వార్ న‌డిచింద‌ని గుర్తు చేస్తున్నారు. రాజ‌శేఖ‌ర్‌పై క్ర‌మ‌శిక్ష‌ణాచ‌ర్య‌లు తీసుకోవాలంటూ అప్ప‌ట్లో చిరంజీవి ప‌రోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. అందుకు రివేంజ్‌గానే ఇప్పుడు మా ఎల‌క్ష‌న్‌లో జీవితారాజ‌శేఖ‌ర్ పోటీ చేస్తున్నార‌నేది ఓ టాక్‌.   అటు, బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఇలా వెళ్లి అలా వ‌చ్చేసిన హేమ‌.. ఇప్పుడు 'మా' ఇంట్లో త‌న అదృష్టం ప‌రీక్షించుకోబోతున్నారు. మ‌హిళ‌ను అధ్య‌క్షురాలిగా ప్ర‌క‌టిస్తే మాకు ఓకే అంటూ కొన్ని స్వ‌రాలు వినిపిస్తున్నాయి. మా ప్ర‌స్తుత అధ్య‌క్షులు న‌రేశ్‌, స‌భ్యురాలు క‌రాటే క‌ల్యాణిలాంటి వాళ్లు హేమ‌ను ఏక‌గ్రీవం చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నారు. హేమ వెనుక పొలిటిక‌ల్ యాంగిల్ లేక‌పోయినా.. ఉమెన్ యాంగిల్ వ‌ర్క‌వుట్ చేయాల‌నేది ఆమె ప్లాన్‌. ఇలా, గ‌తానికి భిన్నంగా 'మా' ఎల‌క్ష‌న్ల‌లో ప‌రోక్షంగా రాజ‌కీయ పార్టీలు త‌లా ఓ చేయి, కాలు వేస్తున్నార‌నో అనుమానాలు వినిపిస్తున్నాయి. అయితే, ప్ర‌కాశ్‌రాజ్‌కే విజ‌యావ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని అంటున్నారు. లోక‌ల్‌-నాన్‌లోక‌ల్ వివాదం ఆయ‌న‌కే అనుకూలంగా మారింద‌ని.. ఆ ఆరోప‌ణ‌లో ప్ర‌కాశ్‌రాజ్ చేసిన సేవ మ‌రోసారి చ‌ర్చ‌కు రావ‌డంతో ఆయ‌న ఇమేజ్‌ మ‌రింత పెరిగింద‌ని అంటున్నారు. అయినా, మా ఎన్నిక‌ల‌ను డిసైడ్ చేసేది.. మెగా ఫ్యామిలీనే కానీ.. అభ్య‌ర్థులు, ప్యానెల్ చూసి కాద‌నే ఓ టాక్ ఎప్ప‌డినుంచో ఉంది. ఇండ‌స్ట్రీకి పెద్ద‌లుగా ఉండే చిరంజీవి-అల్లు అర‌వింద్‌-సురేశ్‌బాబు-నాగార్జున‌-దిల్‌రాజు లాంటి వాళ్లంతా ఒకే మాట మీద ఉంటార‌ని.. వాళ్లు ఎవ‌రికి స‌పోర్ట్ చేస్తే వాళ్లకే గెలుపు అవ‌కాశాలనేది అక్క‌డ ఓపెన్ సీక్రెట్‌. నాగ‌బాబు, శ్రీకాంత్‌ల ఎంట్రీతో ప్ర‌కాశ్‌రాజ్‌కు మెగా స‌పోర్ట్ ఉంద‌ని తేలిపోయింది. ఇప్పుడిక ప్ర‌కాశ్‌రాజ్ కేటీఆర్‌కు బాగా క్లోజ్ అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. సో, టాలీవుడ్‌లోని తెలంగాణ బ్యాచ్ మ‌ద్ద‌తు కూడా ఆయ‌న‌కే  అని అంటున్నారు. ప్ర‌కాశ్‌రాజ్ రేసులో ముందున్నా.. మంచు విష్ణు, జీవిత, హేమ‌, సీవీఎల్‌లు ఎంత పోటీ ఇవ్వ‌గ‌ల‌రో చూడాలి. ఏదిఏమైనా ఈసారి మా ఎన్నిక‌లు గ‌తానికి భిన్నంగా పొలిటిక‌ల్ క‌ల‌రింగ్‌తో మ‌స్త్ మ‌జాగా సాగ‌బోతున్నాయి. 

హుజురాబాద్ బరిలో పొన్నం? ఉత్తమ్ కు రేవంత్ షాక్? 

తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన హుజురాబాద్ నియోజకవర్గంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందని భావిస్తుండగా.. తాజాగా జరిగిన పరిణామాలతో సీన్ మారిపోయింది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకంతో హుజురాబాద్ కాంగ్రెస్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. అంతేకాదు హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలోనూ రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన అభ్యర్థిని కూడా డిసైడ్ చేసి పెట్టుకున్నట్లు చెబుతున్నారు. హుజురాబాద్ లో జరిగే త్రిముఖ పోరులో విజయం సాధించేలా రేవంత్ రెడ్డి స్కెచ్ వేశారని సమాచారం. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డికి తొలి సవాల్ హుజురాబాద్ ఉప ఎన్నికే కానుంది. అది తొలి పోటీని తీవ్రంగా తీసుకుంటున్న రేవంత్ రెడ్డి.. ఎలాగైనా కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో ఉన్నారు. అందుకే ఉప ఎన్నికలో  తన సన్నిహితుడైన పొన్నం ప్రభాకర్ వైపే రేవంత్ మొగ్గు చూపుతున్నారని సమాచారం.  ఇప్పటివరకు హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బంధువు కౌశిక్ రెడ్డి పేరు బలంగా వినిపించింది. అయితే దేవరయాంజల్ భూముల విషయంలో కాంగ్రెస్ లైన్‌కు వ్యతిరేకంగా కౌశిక్ రెడ్డి పనిచేయడం, ఒక కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో కౌశిక్ రెడ్డి మంతనాలు జరపడంతో.. టీఆర్ఎస్‌కు తొత్తుగా ఆయన వ్యవహరిస్తున్నానే టాక్ నడించింది. దీంతో కౌశిక్ రెడ్డికి హుజురాబాద్ టికెట్ ఇచ్చే అవకాశాలు లేవనే చర్చ నియోజకవర్గంలో జోరుగా జరుగుతోంది. గతంలో కరీంనగర్ ఎంపీగా పనిచేశారు పొన్నం ప్రభాకర్. తెలంగాణ ఉద్యమంలో అత్యంత చురుకుగా వ్యవహరించారు. తెలంగాణ బిల్లు లోక్ సభలో పెట్టిన రోజున జరిగిన గొడవలో గాయపడ్డారు పొన్నం ప్రభాకర్. అందుకే పొన్నం ప్రభాకర్ ను తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది హైకమాండ్. ఇటీవల కాలంలో ఎంపీ రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉంటున్నారు పొన్నం. రాజీవ్​ రైతు భరోసా యాత్ర ముగింపు సభకు సీనియర్లు వద్దన్నా.. పొన్నం ప్రభాకర్ మాత్రం హాజరై రేవంత్‌కు సపోర్ట్ చేశారు. దీంతో పొన్నం ప్రభాకర్‌కు హుజురాబాద్ టికెట్‌ను కేటాయించే యోచనలో రేవంత్ ఉన్నట్లు సమాచారం.టికెట్ ఇవ్వడంతో కాదు గెలిపించి తీరుతానని తమ అనుచరులతో రేవంత్ రెడ్డి చెబుతున్నారట. మరోవైపు బలమైన నేతగాఉన్న ఈటలను  ఓడిచేందుకు అధికార టీఆర్ఎస్ కూడా తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా శనివారం మంత్రి హరీష్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న కోరం సంజీవరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ టికెట్ పొన్నం ప్రభాకర్ కు ఇస్తే.. ప్రస్తుత ఇంచార్జ్ గా ఉన్న కౌశిక్ రెడ్డి భవిష్యత్ ఏంటన్న చర్చ జరుగుతోంది. మూడు రోజుల క్రితమే హుజురాబాద్ లో భారీ ర్యాలీ తీశారు కౌశిక్ రెడ్డి. గ్రామాల్లో జోరుగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ రాకపోతే ఆయన కాంగ్రెస్ లో ఉండకపోవచ్చని, గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉందనే ప్రచారం ఉంది. కౌశిక్ రెడ్డికి కాకుండా పొన్నం ప్రభాకర్ కు హుజురాబాద్ టికెట్ ఇస్తే... ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా రేవంత్ రెడ్డి చెక్ పెట్టినట్లేననే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. 

టీఆర్ఎస్ లో అలకలు ..లుకలుకలు! బ్యాడ్ డేస్ మొదలైనట్టేనా..

ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఇటీవల వరంగల్’లో పర్యటించారు.ముఖ్యమంత్రి పర్యటన ప్రధాన లక్ష్యం ఏమిటో,అది ఎంతవరకు నెరవేరిందో, ఏమో కానీ,ఆయన పర్యటన తర్వాత అధికార పార్టీలో అలకలు, లుకలుకలు బయట పడ్డాయి. ముఖ్యమంత్రి పర్యటన  సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్దిసుదర్శన్ రెడ్డి వాహనాన్ని సభా ప్రాంగణం వద్దకు అనుమతించక పోవడంతో మొదలైన రచ్చ, ఇంకా  అలా కాగుతూనే ఉంది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి  ఎదురైన చేదు అనుభవంపై జిల్లా రాజకీయవర్గాల్లో సీరియస్‌గా చర్చ జరుగుతోంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర రావుతో విబేధాల కారణంగానే, సుదర్శన్ రెడ్డిని కొందరు నేతలు టార్గెట్ చేసారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.  నిజానికి ఉమ్మడి వరగంల్ జిల్లాలో ఉద్యమ కాలం నుంచి సుదర్శన్ రెడ్డి పార్టీలో కీలకంగా ఉంటూ వస్తున్నారు. జిల్లాలో పార్టీ నిర్మాణంలో ఆయనదే ప్రధాన భూమిక. 2009-10 ఉద్యమం సమయంలో వరంగల్‌లో టీఆర్ఎస్ నిర్వహించిన సింహగర్జన బహిరంగ సభ ఉద్యమాన్ని కొత్త మలుపు తిప్పింది. ఆ సభ సక్సెస్’కు సుదర్శన్ రెడ్డి ఎంతో కష్టపడ్డారు. అదే విషయాన్ని ఆ నాటి సభలో  స్వయంగా కేసీఆర్ చెప్పారు. సుదర్శన్ రెడ్డిని అభినందించారు.  అలాంటి తమ  నాయకుడికి అవమానం జరిగినా అధిష్టానం స్పందించకపోవడం పట్ల  అయన అనుచరలు అగ్రహం  వ్యక్తం చేస్తున్నారు. అదలా ఉంటే, పుండు మీద కారం అద్దినట్లు, తమ బాధను చెప్పుకునేందుకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఅర్  అప్పాయింట్ కోరితే, ఇవ్వలేదు..ట. మరో వంక మరో ముఖ్య నాయకుడు, సుదర్శన్ రెడ్డినే తప్పు పట్టారని ఆయన తమ అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తపరిచిట్లు తెలుస్తోంది. వాస్తవానికి మొదటి ఎర్రబెల్లి టీడీపీలో ఉన్నప్పటి నుంచే ఇద్దరి మధ్య వైరం కొనసాగుతోంది, ఇప్పుడు అది మరింతగా ముదిరి పాకాన పడిందని అంటున్నారు.  వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు, కడియం శ్రీహరి,రాజయ్య మధ్య మరోసారి మాటల యుద్ధం చోటు చేసుకుంది. ప్రజా సేవ చేయడానికి పదవులు, ప్రోటోకాల్ అవసరం లేదని ఎమ్మెల్యే రాజయ్యను ఉద్దేశిస్తూ కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను కడియం పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే రాజయ్య వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి రావడానికి ఎవరి అనుమతి తీసుకోవాల్సిన పనిలేదని తేల్చి చెప్పారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ ప్రజలు తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చారని, పదవి ఉన్నా, లేకున్నా అందుబాటులో ఉండి సేవ చేయడమే తన లక్ష్యమని అన్నారు. ప్రజలకు మేలుచేసే పనులు ఎవరు చేసినా స్వాగతించి, అభినందించాలని పిలుపునిచ్చారు. కడియం శ్రీహరి నిజాయతీగా పని చేస్తాడని ప్రజల్లో తనకు గుర్తింపు ఉందన్నారు. దేవాదుల సాగునీరు గురించి మాట్లాడని వారు, దేవాదుల పట్ల అవగాహన లేని వారు హడావుడి చేయడం విడ్డురంగా ఉందని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. కడియం శ్రీహరి ఎమ్మెల్సీ పదవి ఈ నెల 2తో ముగిసింది. దీంతో ఆయనకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని ఇటీవల ఎమ్మెల్యే రాజయ్య ఎద్దేవా చేశారు. దీంతో రాజయ్య మాటలకు కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. ప్రజాసేవ చేయాలంటే ప్రోటోకాల్ అవసరం లేదని అన్నారు. తనకు ప్రజలిచ్చిన ప్రొటోకాల్‌తో సేవ చేస్తానని తెలిపారు.  స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఒకప్పుడు కడియం శ్రీహరి, రాజయ్య రాజకీయ ప్రత్యర్థులు. రాష్ట్ర విభజనతో రాజయ్య, కడియం శ్రీహరి ఇద్దరూ టీఆర్ఎస్‌లో చేరారు. ఇద్దరూ డిప్యూటీ సీఎంలుగా పని చేశారు. అయితే వారిద్దరి మధ్య ఇంకా కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. టీఆర్ఎస్ పెద్దలు సయోధ్య కుదర్చినప్పటికీ అంతగా ఫలించలేదు. తాజాగా వీరిద్ధరి మధ్య యుద్ధం మళ్లీ బయటపడింది.అయితే, ఈ మొత్తం వ్యవహారంలో తెరమీద సుదర్శన్ రెడ్డి,ఎర్రబెల్లి, కడియం, రాజయ్య పాత్రలు కనిపించినా, అసలు సూత్రం దారులు వేరే ఉన్నారని గులాబీ పార్టీలో వినిపిస్తున్న మాట. అంతే కాదు త్వరలోనే జిల్లాపార్టీలో అగ్నిగోళం బద్దలైనా ఆశ్చర్య పోనవసర లేదని కూడా అంటున్నారు

పవన్ కు కేంద్ర మంత్రి పదవి ఉత్తదే..?

ఎక్కడ యాక్టివ్ గా ఉన్నా లేకున్నా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్...జనసైనికులు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్లు యాక్టివ్ గా ఉంటారు. అందుకే సోషల్ మీడియా న్యూస్ లో ఆ పేరు ఎలాగోలా వినిపించేద్దామని చూస్తారు. ఈ మధ్య యూట్యూబ్ పై బాగా డిపెండ్ అయిపోయిన శాటిలైట్ ఛానెల్స్ సైతం అదే ట్రెండ్ లో వెళుతున్నాయి. అందుకే పవన్ కల్యాణ్ న్యూస్ ఏమీ లేకపోయినా.. ఏదో ఒక అవకాశంతో ఏదో ఒకటి క్రియేట్ చేస్తే చాలు పిచ్చ వ్యూస్ వస్తాయని రాసేసుకుంటున్నారు. రిపోర్టర్ చిన్న ముక్క అందిస్తే చాలు.. హాఫెన్ హవర్ ప్రోగ్రామ్ తో చెలరేగిపోతున్నారు. అలా పుట్టిందే పవన్ కల్యాణ్ కు కేంద్ర మంత్రి పదవి అనే వార్త.  పవన్ కేంద్రమంత్రి వర్గంలో చేరుతున్నాడు..బిజెపి బంపర్ ఆఫర్ ఇచ్చింది. అది ఇది కాదు.. ఏకంగా హోంశాఖ ఇస్తున్నారంటూ మీడియా చెలరేగిపోయింది. గ్రౌండ్ డేటాకు... ఈ న్యూస్ కు పొంతన లేకపోవడంతో చాలామంది అయోమయంలో పడ్డారు. నిజమేనా..? ఇది నిజమేనా?అంటూ అందరూ తెగ చర్చించుకున్నారు. కరెక్టని కొందరు.. కాదని కొందరు వాదులాడుకున్నారు కూడా. అయితే గ్రాడ్యువల్ గా ఆ న్యూస్ వెనక్కి పెట్టేశారు. ఇప్పుడు రాసే కేంద్ర మంత్రివర్గ విస్తరణ వార్తల్లో పవన్ కల్యాణ్ పేరే వినపడటం లేదు. అదేంటని బిజెపి నేతలను అడుగుతుంటే..పుట్టించింది మీరే..చంపేసింది మీరే..మధ్యలో మమ్మల్ని అడుగుతారేంటని నవ్వుతున్నారు. ఒక పక్క పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బిజిబిజీగా ఉన్నారు. అదేమంటే డబ్బులు కావాలి కదా పార్టీ నడపాలంటే అనే సమాధానం ఎప్పటి నుంచో వినపడుతుందే. తిరుపతి సీటు ఇస్తాం ఇస్తాం అని చివరకు ఇవ్వలేదు. పవన్ కల్యాణ్ కూడా మొక్కుబడిగా ఒక్క మీటింగుతో సరిపెట్టారు. ఆ తర్వాత కరోనా కలిసి రావడంతో అసలు వెళ్లనే లేదు. ఓట్లు ఘోరంగా వచ్చాయి. పవన్ సీఎం క్యాండేట్ అని కూడా ఈ సందర్భంగానే అనౌన్స్ చేశారు. బిజెపి ఏమో తన కార్యక్రమాలు తాను...జనసేనతో ఒప్పందానికి భిన్నంగా పోతోంది. దీనిపై కూడా జనసేన నేతలు కూడా గుర్రుగానే ఉన్నారు. మొదటి నుంచి పవన్ కల్యాణ్ జగన్ ను వ్యతిరేకిస్తున్నారు. జగన్ సైతం..ఇతర పార్టీల నేతలకు భిన్నంగా పవన్ కల్యాణ్ పై పర్సనల్ అటాక్ చేశారు. అందుకే 2019 ఎన్నికల ప్రచారంలో కూడా పవన్ జగన్ మీదే కేంద్రీకరించారు. అప్పుడప్పుడు చంద్రబాబు, లోకేష్ అవినీతి అది ఇదీ అన్నా కూడా.. జగన్ మీదే ఎక్కువగా విరుచుకుపడ్డారు. జగన్ కేసులు విచారించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను పార్టీలో చేర్చుకున్నారు.  ఇలా పవన్ వైసీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే.. బిజెపి మాత్రం వైసీపీతో డబల్ గేమ్ ఆడుతోంది. పైకి విమర్శలు చేస్తూ..లోపల అన్నిటికి సహకరిస్తోంది. అది అందరికీ అర్ధమవుతూనే ఉంది. అమరావతి విషయంలో పాదయాత్ర చేస్తానన్న పవన్ ను ఆపేసింది బిజెపియేనని అందరికీ తెలుసు. తమ అవసరాలు పెరుగుతున్న కొద్దీ బిజెపి జగన్ ను చేరదీస్తోంది. ఈ పరిణామం పవన్ కు మింగుడుపడటం లేదనే టాక్ వినిపిస్తోంది. అందుకే కాస్త సైలెంటుగా ఉంటున్నారంటున్నారు. పరిస్ధితులన్నీ ఇలా ఉంటే..పవన్ ను కేంద్ర మంత్రి చేస్తారని ప్రచారం చేసేశారు. అది ఉత్తదేనని ఇప్పుడు తేలిపోయింది.

జర్నలిస్టులపై కక్ష కట్టారా జగన్! రఘురామ మరో లేఖాస్త్రం... 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు మరో లేఖ రాశారు. ఈసారి జర్నలిస్టుల సమస్యలపై ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. గతంలో ఇచ్చిన హామీలు గుర్తు చేస్తూ.. వెంటనే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. జర్నలిస్టుల కష్టాలు, గత రెండేండ్లుగా పడుతున్న బాధలను తన లేఖలో వివరించారు ఎంపీ రఘురామ రాజు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఎంపీ రఘురామ రాజు రాసిన లేఖ ఇది.. ముఖ్యమంత్రి గారూ, జర్నలిస్టులు…. మన మాటల్ని ప్రపంచానికి చెప్పే వీరి మాటల్ని మీకు చెప్పేందుకు నేను ఈ లేఖ రాస్తున్నాను.మీరు తీసుకున్న ఒక నిర్ణయం తీవ్ర వివాదానికి కేంద్ర బిందువుగా మారిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. జర్నలిస్టులకు ప్రభుత్వ గుర్తింపు ఇచ్చే ఎక్రిడిటేషన్ కమిటీలో ప్రభుత్వ ప్రతినిధులు, వివిధ మీడియా సంస్థల నుంచి జర్నలిస్టులు, జర్నలిస్టు యూనియన్ నాయకులు సభ్యులుగా ఉంటారు. అయితే మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎక్రిడిటేషన్ కమిటీలో ఒక్క జర్నలిస్టు కూడా లేడు. ఈ విషయంపై ఏ జర్నలిస్టు సంఘం కూడా మాట్లాడటం లేదు అంటే క్షేత్ర స్థాయిలో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఏ కారణమో తెలియదు కానీ ఒక్క సమావేశం కూడా జరుపుకోకుండానే ఆ కమిటీని రద్దు చేసేశారు కూడా. జర్నలిస్టు ఎక్రిడిటేషన్ కమిటీని రద్దు చేయడం కూడా పలు నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. ఆ తర్వాత మళ్లీ పైన చెప్పిన అందరు ప్రతినిధులు సభ్యులుగా మరొక కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.  ఆ తర్వాత మన ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. జర్నలిస్టులు ఎక్రిడిటేషన్ కార్డు పొందేందుకు (తన పనికి సంబంధించిన) ఆధారాలను సమర్పించాలని కోరింది. గతంలో జారీ చేసిన కార్డులను భద్రపరచుకోలేని జర్నలిస్టులు అందరూ కూడా ఈ నిబంధనతో కొత్త కార్డు పొందలేకపోయారు.  జర్నలిస్టు సోదరులు చెబుతున్నది ఏమిటంటే జీవో నెం 142 జారీ చేయడం ద్వారా ఎక్రిడిటేషన్ కార్డుల జారీలో తమకు తీరని అన్యాయం చేశారని. ఎక్రిడిటేషన్ కమిటీ నుంచి జర్నలిస్టులను తొలగించడం ఈ జీవో జారీ పర్యవసానమే. జర్నలిస్టులకు ఎక్రిడిటేషన్ లు మంజూరు చేసేందుకు 2005లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 92 స్థానంలో మన ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 142ను సవాల్ చేస్తూ కొందరు జర్నలిస్టులు అందుకే హైకోర్టును ఆశ్రయించారు.  గత రెండు సంవత్సరాలుగా మన ప్రభుత్వం జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను జారీ చేయలేదు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి సుమారుగా 40,000 దరఖాస్తులు మన సమాచార శాఖ వద్ద పడి ఉన్నాయి. 60 సంవత్సరాల వయసు దాటిన కొందరు సీనియర్ జర్నలిస్టులకు మాత్రమే గౌరవ సూచకంగా ఫ్రీలాన్స్ జర్నలిస్టు క్యాటగిరి కింద ఎక్రిడిటేషన్లు జారీ చేశారు. ఇలా పెండింగ్ లో ఉన్న 40 వేల దరఖాస్తులలో 32 వేల దరఖాస్తులు సక్రమంగా ఉన్నట్లు సమాచార శాఖ అధికారులు చెబుతున్నారు కానీ వాటిలో 17 వేల దరఖాస్తులే ఇప్పటి వరకూ పరిశీలించారు. ఇప్పటి వరకూ 470 ఎక్రిడిటేషన్ కార్డులు మాత్రమే జారీ చేశారు. మరో 400 కార్డులు జారీ చేస్తారని అంటున్నారు. మరో ఆరు వేల మంది దరఖాస్తుదారుల సమాచారాన్ని మళ్లీ పంపమని కోరారు. జర్నలిస్టులు ఎక్రిడిటేషన్ కార్డులు పొందడంలేదు సరికదా అసలు దరఖాస్తు చేసుకోవడానికే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఎక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయడానికి సమాచార శాఖ అత్యంత అసంబంద్ధమై నిబంధనలు పెట్టింది. చిన్న మధ్య తరగతి వార్తా పత్రికల వారు కూడా రెండు సంవత్సరాల జీఎస్ టి చెల్లింపుల లెక్కలు చెప్పాలనే కఠిన నిబంధన అందులో ఉన్నది. మీరు పాదయాత్ర చేసే సందర్భంలో జర్నలిస్టుల సమస్యలు అన్నీ పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. అయితే మీరు ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వ వాణిని ప్రజలకు వినిపించే అతి ముఖ్యమైన ప్రభుత్వ ప్రచార సాధనం అయిన ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్ ప్రచురణనే నిలిపివేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వెల్లడించే ఆ మ్యాగజైన్ ముద్రణ నిలిపివేయడమే తొలి తప్పిదం. గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు ఒక స్కీమ్ ఉండేది. జర్నలిస్టులు రూ.1200 చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక శాఖ నుంచి అంతే మొత్తం చెల్లించి ప్రభుత్వం జర్నలిస్టులకు పటిష్టమైన ఆరోగ్య భద్రత (హెల్త్ ఇన్ ష్యూరెన్స్) కల్పించేది. గత రెండు సంవత్సరాలుగా మీరు దీన్ని అమలు చేయడం లేదు. ఈ కరోనా మహమ్మారి కాలంలో వందలాది మంది జర్నలిస్టులు మరణించారు. ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి సాయం అందలేదు. ఎక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులు కరోనాతో మరణిస్తే వారి కుటుంబాలకు రూ.5 లక్షలు చెల్లిస్తామని మీరు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకూ ఎవరికి చెల్లింపులు చేయలేదు. ఎక్రిడిటేషన్ కార్డు ఉన్న జర్నలిస్టులు అందరూ ఆరోగ్య శ్రీ పథకం కింద అర్హులే. అయితే ఏ ఆసుపత్రి కూడా ఆరోగ్య శ్రీ పథకం కింద జర్నలిస్టులకు ఈ రోజు వరకూ సాయం చేయలేదు. కరోనా మహమ్మారి సమయంలో క్షేత్ర స్థాయిలో పని చేస్తూ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న జర్నలిస్టులను కరోనా 19 వారియర్స్ తరహాలోనే, వారికి ఇస్తున్నట్లుగానే జర్నలిస్టులకు కూడా  రూ.50 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించాలి. డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ఇతర సంబంధిత సిబ్బంది తరహాలోనే జర్నలిస్టులను, మీడియా సిబ్బందిని తక్షణమే ఫ్రంట్ లైన్ వారియర్స్ జాబితాలో చేర్చాలి. కోవిడ్ 19 పరిస్థితులలో కేరళ, ఒడిసా ప్రభుత్వాలు ప్రతి ఎక్రిడిటేటెడ్ జర్నలిస్టుకు రూ.10 వేలు ఎలవెన్సుగా చెల్లిస్తున్నాయి. రెవెన్యూ శాఖ అధికారులు, వైద్య సిబ్బంది, పోలీసులు పని చేస్తున్న విధంగానే జర్నలిస్టులు కూడా ఎంతో కష్టపడి పని చేస్తున్నారు.  జరుగుతున్న ఈ పరిణామాలతో జర్నలిస్టులు మన ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. అందువల్ల మీరు ఈ విషయంపై తక్షణమే ప్రత్యేక శ్రద్ధ చూపాలని నేను సూచిస్తున్నాను. ఎక్రిడిటేషన్ కార్డుల జారీపైనా, ఆరోగ్య శ్రీ హెల్త్ కార్డు విషయంలోనూ సమస్యలు తీర్చి తక్షణమే నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నాను. జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వర్కర్లుగా తక్షణమే గుర్తించడం ద్వారా వారి సమస్యలను పరిష్కరించే వీలుకలుగుతుంది. మీ నుంచి సత్వర చర్యలను ఆశిస్తూ.. భవదీయుడు కె.రఘురామకృష్ణంరాజు

దేశ రాజకీయ మెరునగధీరుడు పీవీ.. ఆర్థిక సంస్కరణల శిల్పి

పాములపర్తి వేంకట నరసింహారావు.. భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దక్షిణ భారతీయుడు. ఒకేఒక్క తెలుగువాడు. భారతదేశ రాజకీయ చరిత్రలో మెరునగధీరుడు...తెలంగాణ పల్లెలో పుట్టి ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిన దురంధరుడు... బాహుభాష కోవిధుడు, తెలంగాణ ముద్దు బిడ్డ, శ్రీ పి.వి. నరసింహారావు గారు, 10వ ప్రధానమంత్రిగా, మన భారతదేశంలో ఎన్నో సరళీకృత ఆర్ధిక విధానాలు ప్రవేశ పెట్టి, దేశ ప్రగతికి కొత్త బాటలు వేసిన అసమాన ప్రజ్ఞావంతులు మన పివీ. అతను బహుభాషావేత్త, రచయిత. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి.  1957 లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పివి రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రి గానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించారు. భారతదేశపు  లుక్ ఈస్ట్ పాలసీ ప్రధాని పివీ యొక్క దార్శనికత కునిదర్శనం.దేశ విదేశాంగ విధానాలను కొత్త పుంతలు తొక్కించింది. ఈ విధానం యొక్క ప్రధానలక్ష్యం దేశం యొక్క వాణిజ్య దృష్టిని పశ్చిమ మరియు పొరుగువారి నుండి అభివృద్ధి చెందుతున్న ఆగ్నేయాసియా దేశాలకు మార్చడం. ఈ విధానం 2014 లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడే వరకు కొనసాగింది. తెలంగాణ లోని వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28 న రుక్నాబాయి, సీతారామరావు దంపతులకు పీవీ జన్మించాడు. వరంగల్లు జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టాడు. తరువాత పూర్వపు కరీంనగర్ జిల్లా, భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు అతనును దత్తత తీసుకోవడంతో అప్పటినుండి పాములపర్తి వేంకట నరసింహారావు అయ్యాడు. 1938 లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరి నిజాము ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడాడు. దీంతో తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి అతనును బహిష్కరించారు. దాంతో ఓ మిత్రుడి సాయంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి నాగపూరులో ఆ మిత్రుడి ఇంట్లోనే ఉంటూ 1940 నుండి 1944 వరకు ఎల్లెల్బీ చదివాడు. స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు ల అనుయాయిగా స్వాతంత్ర్యోద్యమంలోను, హైదరాబాదు విముక్తి పోరాటంలోను పాల్గొన్నాడు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెసు పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెసు నాయకులు మర్రి చెన్నారెడ్డి, శంకరరావు చవాన్, వీరేంద్ర పాటిల్ లతో కలిసి పనిచేసాడు. 1951లో అఖిల భారత కాంగ్రెసు కమిటీలో సభ్యుడిగా స్థానం పొందాడు. నరసింహారావు తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి, కాకతీయ పత్రిక నడిపి అందులో జయ అనే మారుపేరుతో 1950 ప్రాంతాలలో వ్రాసేవాడు. బహుభాషలు నేర్చి ప్రయోగించాడు. రాష్ట్ర రాజకీయాల్లో పీవీ కులప్రాబల్యం, పార్టీ అంతర్గత వర్గాల ప్రాబల్యం అధికంగా ఉండే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పీవీధి ఒక ప్రత్యేక స్థానం. హంగూ ఆర్భాటాలు లేకుండా ఒదిగి ఉండే లక్షణం ఆయనది . తనకంటూ ఒక వర్గం లేదు. బ్రాహ్మణుడైన అతనుకు కులపరంగా బలమైన రాజకీయ స్థానం లేనట్లే. పార్టీలో అత్యున్నత స్థాయిలో తనను అభిమానించే వ్యక్తులు లేరు. అయినా రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగాడు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఉద్దండులెందరో ఉండగా ఆ పదవి ఆయన్ని వరించింది. అప్పటి రాజకీయ పరిస్థితి అటువంటిది. 1957 లో మంథని నియోజక వర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1962 లో మొదటిసారి మంత్రి అయ్యాడు. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రి గాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించాడు. 1969 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం అప్పుడే చల్లారింది. ముఖ్యమంత్రిని మార్చడమనేది కాంగ్రెసు పార్టీ ముందున్న తక్షణ సమస్య. తెలంగాణా ప్రజల, ఉద్యమనేతల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణా ప్రాంత నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చెయ్యడమనేది అనివార్యమయింది. తెలంగాణా ప్రాంతం నుండి ముఖ్యమంత్రి పదవి ఆశించే వారు తక్కువేమీ లేరు. వివాదాల జోలికి పోని అతను వ్యక్తిత్వం, పార్టీలోని ఏ గ్రూపుకూ చెందని అతను రాజకీయ నేపథ్యం అతనుకు 1971 సెప్టెంబరు 30 న ముఖ్యమంత్రి పదవిని సాధించిపెట్టాయి. ముఖ్యమంత్రిగా పీవీ.. ముఖ్యమంత్రిగా పీవీ రికార్డు ఘనమైనదేమీ కాదు. పీఠం ఎక్కీ ఎక్కగానే పార్టీలో అసమ్మతి తలెత్తింది. ఈ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ, హైదరాబాదుల మధ్య తిరగడంతోటే సరిపోయేది. తాను ముఖ్యమంత్రిగా ఉండగా భూసంస్కరణలను అమలుపరచేందుకు చర్యలు తీసుకున్నాడు.. ఇందువలన భూస్వామ్య వర్గాలు తిరగబడ్డాయి.పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం తెచ్చింది కూడా పీవీయే. 1972 లో పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ ఎన్నికలలో 70% వెనుకబడిన వారికిచ్చి చరిత్ర సృష్టించారు. రాష్ట్ర ప్రధానకార్యదర్శి ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే, హైదరాబాదులో కంటే, ఢిల్లీలోనే ఎక్కువ వీలు కుదిరేదని ఒక రాజకీయ పరిశీలకుడు వ్యాఖ్యానించాడు. ఆ సమయంలోనే ముల్కీ నిబంధనలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆందోళన చెందిన కోస్తా, రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ జై ఆంధ్ర ఉద్యమం చేపట్టారు. పీవీని తెలంగాణా నాయకుల పక్షపాతిగా ఆంధ్ర, రాయలసీమ నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రులలో చాలామంది రాజీనామా చేసారు. రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో 1973 జనవరి 8 న కొత్త మంత్రులను తీసుకుని పీవీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు.  అయితే పార్టీ అధిష్టానం ఆలోచన పూర్తిగా భిన్నంగా ఉంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన మరునాడే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి, రాష్ట్రపతి పాలనను విధించింది. ఆ విధంగా పీవీ ముఖ్యమంత్రిత్వం ముగిసింది. శాసనసభ సభ్యుడిగా 1977 వరకు అతను కొనసాగినా రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా పక్కన పెట్టబడ్డాడు. పీవీ దగ్గరనుండి అసలు విషయం రాబట్టటం అంత తేలిక కాదు. కారణం లౌక్యం అంతా ఉపయోగించేవాడు. ఆగ్రహాన్ని దాచేవాడని ప్రముఖ పాత్రికేయుడు ఇన్నయ్య అతని గురించి వ్రాశాడు. శాసనసభలో, లోక్ సభలో బాగా సిద్ధపడి వచ్చి మాట్లాడేవాడు. ప్రశ్నలకు సమాధానం చెప్పేవాడు. ఢిల్లీ రాజకీయాల్లో పీవీ ముద్ర.. తరువాత పీవీ రాజకీయ కార్యస్థలం ఢిల్లీకి మారింది. కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు.మొదటిసారిగా లోక్‌సభకు హనుమకొండ స్థానం నుండి ఎన్నికయ్యాడు. రెండోసారి మళ్ళీ హనుమకొండ నుండే లోక్‌సభకు ఎన్నికయ్యాడు. మూడోసారి ఎనిమిదో లోక్‌సభకు మహారాష్ట్ర లోని రాంటెక్ నుండి ఎన్నికయ్యాడు. మళ్ళీ రాంటెక్ నుండే తొమ్మిదో లోక్‌సభకు ఎన్నికయ్యాడు. నంద్యాల లోక్‌సభ నియోజకవర్గానికి 1991లో జరిగిన ఉప ఎన్నికలో ఎన్నికై పదో లోక్‌సభలో అడుగుపెట్టాడు. 1980- 1989 మధ్య కాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశవ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ లను వివిధ సమయాల్లో నిర్వహించాడు. 1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్లో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రోను అబ్బురపరచాడు. ఇక పీవీకి ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది. 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చెయ్యకుండా, దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెసు పార్టీకి నాయకుడు లేకుండా పోయాడు. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పీవీ అందరికీ ఆమోదయోగ్యుడుగా కనపడ్డారు. వానప్రస్థం నుండి తిరిగివచ్చి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుండి గంగుల ప్రతాపరెడ్డిచే రాజీనామా చేయించి, అక్కడి ఉప ఎన్నికలో గెలిచి, పీవీ లోక్‌సభలో అడుగుపెట్టాడు. సాటి తెలుగువాడు ప్రధాని ఆవుతున్నాడని నంద్యాల పార్లమెంట్ సీటుకు జరిగిన ఉప ఎన్నికలలో ఎన్.టి.రామారావు అతనుపై తెలుగు దేశం అభ్యర్థిని పోటీలో పెట్టలేదు.  తన సహజ సిద్ధంగా ఉన్న తెలివితేటలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో అతనుకు ఉన్న అపార అనుభవం అతనుకు ఈ క్లిష్టసమయంలో తోడ్పడ్డాయి. ఐదు సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, గాంధీ కుటుంబంబాల బయటి మొదటి వ్యక్తి, పీవీయే. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా, ఇది సాధించడం అతను రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. అందుకే అతన్ని అపర చాణక్యుడు  అన్నారు. అందుకు అతను అనుసరించిన కొన్ని విధానాలు వివాదాస్పదం అయ్యాయి కూడా.పీవీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలలో ఎన్నో గొప్ప మలుపులు, పరిణామాలు చోటుచేసుకున్నాయి.  ఎన్నో అవినీతి ఆరోపణలు ప్రభుత్వాన్నీ, పీవీని చుట్టుముట్టాయి. దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు, సంస్కరణలకు బీజం వేసాడు. తన ఆర్థికమంత్రి, మన్మోహన్ సింగ్‌కు స్వేచ్ఛనిచ్చి, సంస్కరణలకు ఊతమిచ్చాడు. ఆ సంస్కరణల పర్యవసానమే, ఆ తరువాతి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన అద్భుతమైన అభివృద్ధి. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు. పంజాబ్ తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ ప్రభుత్వానిదే. కాశ్మీరు తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినపుడు వారి డిమాండ్లకు లొంగకుండా ప్రముఖులను విడిపించిన ఘనత కూడా పీవీదే. ఇజ్రాయిల్‌తో దౌత్య సంబంధాలు, తీవ్రవాదానికి పాకిస్తాను ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయటపెట్టి ప్రపంచదేశాల్లో చర్చకు పెట్టడం, ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంచుకోవడం, చైనా, ఇరానులతో సంబంధాలు పెంచుకోవడం వంటివి విదేశీ సంబంధాల్లో పీవీ ప్రభుత్వం సాధించిన అనేక విజయాల్లో కొన్ని.1998లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పీవీ ప్రభుత్వమే. అతను కాలంలోనే బాంబు తయారయింది. ఈ విషయాన్ని స్వయంగా వాజపేయే ప్రకటించాడు. పీవీపై విమర్శలు.. పీవీ తన జీవితంలో ఎదుర్కొన్న వివాదాలు, అవినీతి ఆరోపణలు దాదాపుగా అన్నీ అతను ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన సంఘటనల పర్యవసానాలే.1994లో లోక్‌సభలో అవిశ్వాస తీర్మాన గండం నుండి తన మైనారిటీ ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి వక్ర మార్గాలను అనుసరించారని విమర్శలు ఉన్నాయి.1992 డిసెంబర్ 6 న అయోధ్యలో బాబరీ మసీదును కూలగొట్టిన సంఘటన అతను ఐదేళ్ళ పాలన లోనూ జరిగిన అత్యంత పెద్ద సంఘటన. దాన్ని కాపాడలేక పోవడం అతను వైఫల్యాల్లో అతిపెద్దది.సాధువులకు, బాబాలకు అతను సన్నిహితంగా ఉండేవాడు. పీవీ రచనలు  సహస్రఫణ్: విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన వేయిపడగలు కు హిందీ అనువాదం చేశారు. ఈ పుస్తకానికై పీవీకి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది. అబల జీవితం: పన్ లక్షత్ కోన్ ఘతో అనే మరాఠీ పుస్తకానికి తెలుగు అనువాదం. ఇన్‌సైడర్: అతను రచించిన ఆత్మకథాత్మక నవల. దీనిలోని ఘట్టాలకు పీవీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేంతవరకూ అతను జీవితఘట్టాలకు చాలా చాలా పోలిక ఉంది. నవలలోని కథానాయక పాత్ర ఆనంద్ పీవీ నరసింహారావేనని విమర్శకులు భావించారు. ఇందులో జాతీయస్థాయి నాయకుల పాత్రలు నిజపాత్రలు పెట్టి, రాష్ట్రనాయకుల పాత్రలకు పేర్లు మార్చారు. ఈ బృహన్నవల వివిధ భాషల్లోకి అనువాదమయింది. తెలుగులోకి లోపలి మనిషిగా అనువాదం అయింది.  ప్రముఖ రచయిత్రి "జయ ప్రభ" కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించాడు. తెలంగాణా సాయుధ పోరాట నేపథ్యంలో "గొల్ల రామవ్వ" కథ విజయ కలంపేరుతో కాకతీయ పత్రికలో 1949లో ప్రచురితమైంది. 1995లో "విస్మృత కథ" సంకలనంలో ప్రచురించబడేప్పుడు కథారచయిత శ్రీపతి చొరవ, పరిశోధనలతో ఇది పి.వి.నరసింహారావు రచనగా నిర్ధారణ అయింది.[10] ఇవేగాక మరెన్నో వ్యాసాలు కలం పేరుతో వ్రాసాడు. కాంగ్రెసువాది పేరుతో 1989 లో మెయిన్‌స్ట్రీం పత్రికలో వ్రాసిన ఒక వ్యాసంలో రాజీవ్ గాంధీ పాలనను విమర్శించాడు. 1995 లో ఆ విషయం ఫ్రంట్‌లైన్ పత్రిక ద్వారా వెలుగులోకి వచ్చింది. నరసింహారావు సత్యమ్మరావును వివాహం చేసుకున్నాడు. సత్యమ్మరావు 1970, జూలై 1న మరణించింది. వారికి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు పి.వి. రంగారావు, మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి మంత్రివర్గంలో విద్యామంత్రిగా, వరంగల్ జిల్లాలోని హనమకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు పనిచేశాడు. రెండవ కుమారుడు పి.వి. రాజేశ్వర్ రావు, సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం నుండి 11వ లోకసభ (15 మే 1996 - 4 డిసెంబర్ 1997) పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు.[11][12] కూతరు సురభి వాణి దేవి చిత్రకారిణిగా, విద్యావేత్తగా, సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నది. 2021 మార్చిలో జరిగిన మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందింది.తన ఆత్మకథ రెండో భాగం వ్రాసే ఉద్దేశం అతనుకు ఉండేది. ఆ కార్యం నెరవేరకుండానే, 2004, డిసెంబర్ 23 న పి.వి.నరసింహారావు కన్నుమూసాడు. అంత్యక్రియల్లో వివాదం.. పీవీ నరసింహారావు మరణించిన తర్వాత అతని కుటుంబం అంత్యక్రియలు న్యూఢిల్లీలో ప్రభుత్వ లాంఛనాలతో జరగాలని కోరుకుంది. అంతకుముందు మరణించిన భారత మాజీ ప్రధానులందరి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు న్యూఢిల్లీలో జరగడం, వారికి అక్కడ ఒక స్మృతి చిహ్నం ఏర్పాటుచేయడం సాధారణంగా జరిగేది. కానీ అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ సమన్వయకర్త సోనియాగాంధీకి ఇష్టం లేకపోవడంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పీవీ నరసింహారావు కుటుంబసభ్యులను ఢిల్లీలో కాకుండా పీవీ అంత్యక్రియలు హైదరాబాద్‌లో జరగడానికి ఒప్పించారు. ఢిల్లీ నుంచి పీవీ నరసింహారావు భౌతిక కాయాన్ని హైదరాబాద్ తీసుకువచ్చే క్రమంలో కొద్దిసేపు కాంగ్రెస్ కార్యాలయంలో అభిమానుల సందర్శనార్థం ఉంచాలన్నా అనుమతించలేదు. హుస్సేన్ సాగర్ తీరంలో అతని అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేశారు. అయితే శవం సగమే కాలిందనీ, అర్థరాత్రి కుక్కలు శవాన్ని బయటకు లాగాయని టీవీ ఛానెళ్ళు వీడియోలు ప్రదర్శించాయి, వార్తలు వచ్చాయి. పి.వి.కి సన్నిహితుడైన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పివిఆర్‌కే ప్రసాద్‌ దీనిని ఖండించారు. "అతను దేహం సగంకాలిన స్థితిలో వదిలివేయబడింది అన్నది నిజంకాదు. శరీరం పూర్తిగా కాలింది. కాకపోతే కాలిపోయిన శరీరపు బూడిద అదే ఆకారంగా కనబడింది. ప్రజల మనస్సులో అదే ఉండిపోయింది... ఏమైనా అతను మృతదేహాన్ని బలవంతంగా హైదరాబాదుకు పంపించారనీ, ఢిల్లీలో కాంగ్రెస్‌ కార్యాలయంలోకి అడుగుపెట్టనివ్వలేదనీ ప్రజలందరికీ తెలిసిన విషయమే. పి.వి. శరీరం సగమే కాలిందన్న భావన అతనుకు జరిగిన అన్యాయం పట్ల ప్రజల ఆగ్రహానికి సూచిక మాత్రమే." అని అన్నారు.  స్మృతి చిహ్నాలు పి.వి. నరసింహారావు స్మృత్యర్ధం హైదరాబాదులో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లై ఓవర్ కు పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే అని పేరుపెట్టారు. ఇది 19.10.2009 న ప్రారంభం అయ్యింది. మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వరకు నిర్మించారు. శంషాబాద్ విమానాశ్రయం ప్రయాణీకులను దృష్టిలో ఉంచుకొని దీనిని నిర్మించారు. శత జయంతి వేడుకలు పి.వి. నరసింహరావు శత జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 2020, జూన్ 28 నుండి 2021, జూన్ 28 వరకు శత జయంతి వేడుకలు నిర్వహించింది. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో 2020, జూన్ 28 ఆదివారంనాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ శతజయంతి ఉత్సవాలను ప్రారంభించాడు. రాష్ట్రవ్యాప్తంగా, ఇతర 50 దేశాలలో ఈ ఉత్సవాలను నిర్వహించారు. పి.వి. నరసింహరావు శత జయంతి సమీక్ష సమావేశములో తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి పి.వి. నరసింహరావు కు భారత రత్న ఇవ్వాలని , వారి చిత్ర పటమును పార్లమెంటు లో పెట్టాలని, వారు నెలకొలిపిన కేంద్రీయ యూనివర్సిటీ కి పి.వి. నరసింహరావు పేరు పెట్టాలని అసెంబ్లిలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వమునకు పంపారు. ఇందుకు పీవీ నరసింహారావు అన్ని విధాలా అర్హులే... 

కోమటిరెడ్డి కామెంట్లతో రేవంత్ కే లాభమా?

ఆయన దుమ్ము దులుపుతున్నానని అనుకుంటున్నాడు. చెలరేగిపోతే చింపేయొచ్చని ఫీలవుతున్నాడు. తానేసిన బాంబులతో ప్రత్యర్ధి మటాష్ అనుకుంటున్నాడు.  కాని తాననుకునేది ఒకటి... జరగుతున్నది.. జరగబోయేది మరోటి. కీడు చేయాలనుకుని మాటల యుద్ధం మొదలెట్టాడు..కాని మేలు చేస్తున్నాననే ఆలోచన ఆయన బుర్రకు తట్టడం లేదు.  ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఆవేశంతో రగిలిపోతున్నారు. ఎన్నాళ్ల నుంచో కాంగ్రెస్ పార్టీకి విశ్వాసపాత్రుడిగా ఉంటే... తనను కాదని..బయటి నుంచి జస్ట్ మూడున్నరేళ్ల క్రితం వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తారా అంటూ మండిపడుతున్నారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాక.. ఆయన వర్గంగా ఉన్న కోమటిరెడ్డి..తర్వాత కాలంలో కాస్త సైలెంట్ అయ్యారు. విభజన తర్వాత తెలంగాణకు నాయకుడు కావాలని ఆశపడ్డారు. కాని రాహుల్ గాంధీ ఫ్రెండ్ షిప్ తో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పదవిని ఎగరేసుకుపోయారు. అసంతృప్తితో టీఆర్ఎస్ లో వెళ్లాలని కూడా ఆలోచించారు. కేసీఆర్ అప్పటికి ఇప్పటికి టచ్ లోనే ఉన్నారు.  ఎందుకనో ఏదో కుదరక.. గులాబీ జెండా జోలికి పోలేదు.  ఎప్పటికైనా పీసీసీ చీఫ్ కాకపోతానా అనుకున్నారు. ఏ మాట కా మాట.. నియోజకవర్గంలో.. పని చేయడంలో మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్ ఫెక్ట్. ఆ విషయంలో ఎలాంటి లోపం లేదు. కాని నల్గొండ జిల్లాలో తన బలంతో... రాష్ట్రానికి నాయకుడు కావాలనుకోవడమే అత్యాశ అనే కామెంట్లు వచ్చాయి. కాని హైకమాండ్ ఎవరిని పెడితే వారే రాజు.. అందుకే ఎందుకు కాకూడదు అనుకున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతోనే..అదే సామాజికవర్గానికి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి శకునం మంచిగా అనిపించలేదు. సహజంగానే దూకుడుగా ఉండే రేవంత్ రెడ్డి అదే స్టయిల్ లో వెళుతూ హైలెట్ అయిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇమేజ్ ఉండటంతో... పీసీసీ చీఫ్ పదవికి గట్టి పోటీదారు అయ్యారు. కేసీఆర్ ను ఢీకొట్టి మళ్లీ అధికారంలోకి రావాలంటే రేవంతే కరెక్టని.. హైకమాండ్ భావించినట్లుంది..అందుకే ఇచ్చేసింది. కాని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఈ పరిణామం ఏ మాత్రం రుచించలేదు. ఏ శ్రీధర్ బాబుకో, జీవన్ రెడ్డికో ఇచ్చినా అంత బాధపడేవారు కాదు..కాని రేవంత్ రెడ్డికి ఇవ్వటంతోనే ఆగ్రహించారు. అందుకే విరుచుకుపడిపోయారు. అయితే కాంగ్రెస్ లో హైకమాండ్ దే తుది నిర్ణయం. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక చాలామంది ఫాలో అయిపోతారు..టైం వచ్చినప్పుడు చూసుకుందాం అనుకునేవారు కొందరు.. పైకి సైలెంట్ గా ఉండి వెనక నుంచి పావులు కదిపేవారు మరికొందరు. కాని వెంకటరెడ్డి వ్యాఖ్యలతో... రేవంత్ అంటే ఇష్టమున్నా లేకపోయినా.. ఖండనలతో బయటికి రావాల్సి వచ్చింది. అంటే ఒక విధంగా రేవంత్ రెడ్డిపై ఘాటు కామెంట్లు చేసి...మిగతా నేతలందరిని రేవంత్ కు మద్దతుగా ఉన్నారనేలా రియాక్షన్స్ వచ్చేలా చేశారు. అంటే రేవంత్ రెడ్డికి మేలే చేశారు.. చేస్తున్నారు.

రేవంత్‌రెడ్డి కేక‌.. కోమ‌టిరెడ్డి కాక‌.. కాంగ్రెస్‌లో అంతే...!

కాంగ్రెస్‌ను ఎవ‌రూ ఓడించన‌వ‌స‌రంలేదు. హ‌స్తం పార్టీని సొంత పార్టీ నేత‌లే ఓడిస్తారు. ఏళ్లుగా వినిపిస్తున్న ఫేమ‌స్ డైలాగ్ ఇది. రేవంత్‌రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్‌గా ప్ర‌క‌టించాక.. ఆ పార్టీ సీనియ‌ర్ నేత కోమ‌టిరెడ్డి చేసిన కామెంట్లు చూశాక‌ మ‌రోసారి ఈ సామెత గుర్తుకు వ‌స్తోందంటున్నారు. ఇప్పుడే పీసీసీ చీఫ్‌ను ప్ర‌క‌టించారు. ఇంకా రేవంత్‌రెడ్డి బాధ్య‌త‌లు కూడా స్వీక‌రించ‌నే లేదు. అప్పుడే లుక‌లుక‌లు, రుస‌రుస‌లు,, అల‌క‌లు, రాజీనామాలు మొద‌లైపోయాయి. కాంగ్రెస్‌లో అంతే.. అని మ‌రోసారి రుజువు చేస్తున్నారు.  కాంగ్రెస్‌కు సీనియ‌ర్ నేత కేఎల్ఆర్ రాజీనామా చేశారు. మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి త‌న పార్టీ ప‌ద‌విని వ‌దిలేశారు. ఇక పీసీసీ చీఫ్ ప‌ద‌వికి రేవంత్‌రెడ్డితో స‌మానంగా పోటీప‌డిన కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి.. అప్పుడే ఎర్ర‌జెండా ఎగ‌రేశారు. నోటికి ప‌ని చెప్పారు. రేవంత్‌తో పాటు తెలంగాణ ఇంఛార్జ్‌పై డైరెక్ట్ అటాక్ చేశారు. ప‌నిలో ప‌నిగా ఇక తాను గాంధీభ‌వ‌న్ మెట్లు ఎక్క‌బోనంటూ శ‌ప‌థం కూడా చేసేశారు.  కోమ‌టిరెడ్డి అభ్యంత‌ర‌మంతా ఒక్క‌టే.. మొద‌టి నుంచీ కాంగ్రెస్‌లో ఉన్న త‌న‌ను కాద‌ని.. టీడీపీ నుంచి వ‌చ్చిన రేవంత్‌రెడ్డికి పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించ‌డ‌మేంట‌నేది ఆయ‌న క‌డుపుమంట‌లా ఉంది. ఎప్పుడు వ‌చ్చామ‌న్న‌ది కాద‌న్న‌య్యా.. బుల్లెట్ దిగిందా లేదా అనేది రేవంత్‌రెడ్డి వ‌ర్ష‌న్‌. ఇద్ద‌రులో ఎవ‌రు క‌రెక్ట్? రేవంత్‌రెడ్డికి తెలంగాణ వ్యాప్తంగా మంచి ఇమేజ్ ఉంది. కోమ‌టిరెడ్డి బ‌ల‌మంతా ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాకే ప‌రిమితం. కేసీఆర్‌పై విమ‌ర్శ‌ల‌కు రేవంత్‌రెడ్డి అంద‌రికంటే ముందుంటారు. కోమ‌టిరెడ్డి ఎండాకాలంలో వ‌ర్షంలా అప్పుడ‌ప్పుడు అలా హ‌డావుడి చేసి మ‌ళ్లీ సైడ్ అయిపోతుంటారు. కోమ‌టిరెడ్డికి న‌ల్గొండ వ్యాప్తంగా విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది. రేవంత్‌రెడ్డికి జిల్లాల్లోనూ అభిమాన సంఘాలు ఉన్నాయి. కోమ‌టిరెడ్డికి కేసీఆర్‌పై ఎలాంటి వ్య‌క్తిగ‌త క‌క్ష్య‌ల్లాంటివి లేవు. అదే, రేవంత్‌రెడ్డి జీవిత‌ల‌క్ష్యం కేసీఆర్‌ను దెబ్బ‌కొట్ట‌డం. కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి సోద‌రుడు రాజ‌గోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరేందుకు ట్రై చేస్తున్నారు. ఇప్ప‌టికే కాంగ్రెస్ తీరుపై ప‌లుమార్లు బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేశారు.  కోమ‌టిరెడ్డి చేసిన అత్యంత కీల‌క‌మైన ఆరోప‌ణ‌.. ఓటుకు నోటు మాదిరే.. పీసీసీ చీఫ్ ప‌ద‌వి అమ్ముకున్నార‌నే సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్‌.. డ‌బ్బులు తీసుకొని ప్రెసిడెంట్ ప‌ద‌విని అమ్ముకున్నారంటూ ప‌రోక్షంగా హైక‌మాండ్‌పైనే ఆరోప‌ణ‌లు చేసి కాంట్ర‌వ‌ర్సీకి కేరాఫ్‌గా మారారు. రేవంత్‌రెడ్డి పొలిటిక‌ల్ కెరీర్‌లో ఉన్న ఏకైక మ‌చ్చ‌.. ఓటుకు నోటు కేసు. అందుకే, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ఆ ఇష్యూనే మెయిన్‌గా టార్గెట్ చేస్తూ రేవంత్‌పై విమ‌ర్శ‌లు గుప్పించ‌డం కాంగ్రెస్‌లో క‌ల‌క‌లం రేపుతోంది. టీపీసీసీని టీటీడీపీగా మార్చేశారంటూ.. ఇక తెలంగాణ‌లో కాంగ్రెస్ ప‌ని ఖ‌తం అనే అర్థం వ‌చ్చేలా వెంక‌ట్‌రెడ్డి కామెంట్లు చేశారు. చంద్ర‌బాబే రేవంత్‌రెడ్డికి పీసీసీ చీఫ్ ప‌ద‌వి ఇప్పించారంటూ మ‌రింత కాక రేపారు. కోమ‌టిరెడ్డి విమ‌ర్శ‌ల‌పై అప్పుడే అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లిపోయాయ‌ని చెబుతున్నారు. కోమ‌టిరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై హైక‌మాండ్ సైతం సీరియ‌స్‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే, తాను మాత్రం కాంగ్రెస్‌ను వీడేది లేద‌ని.. త‌న‌నెవ‌రూ క‌ల‌వ‌ద్దొంటూ త‌న ఇలాఖాలో పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌య్యారు కోమ‌టిరెడ్డి. అయితే, తాను అంద‌రినీ క‌లుపుకొని వెళ్తాన‌ని.. త‌న‌కు ఎవ‌రితోనూ విభేదాలు లేవంటూ రేవంత్‌రెడ్డి కూల్‌గా స్టేట్‌మెంట్ ఇవ్వ‌డం కొస‌మెరుపు.   

తెలంగాణలో రాజకీయ సెగలు.. పాదయాత్ర చేయనున్న ముఖ్య నేతలు  

తెలంగాణ మీడియాకు ఫుల్లు పని...జనానికి రోజూ న్యూసే...పాదయాత్రల సీజన్ వచ్చేసింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు రెడీ అవుతున్నారు పాదయాత్ర చేయడానికి. ఇప్పటికే బండి సంజయ్ హూజూరాబాద్ టార్గెట్ గా రెండు నెలల పాటు పాదయాత్ర చేయబోతున్నారు. అలాగే కాంగ్రెస్ చీఫ్ అయిన రేవంత్ రెడ్డి సైతం.. రాష్ట్రమంతా పాదయాత్ర చేసే ప్లాన్ లో ఉన్నారు. మరోవైపు కొత్త పార్టీ వైఎస్సార్టీపీ నేత షర్మిల కూడా పాదయాత్ర ప్లానింగ్ లో ఉన్నారు. ఇలా భారీ ఎత్తున పాదయాత్ర ల ప్లానింగులు నడుస్తున్నాయి. ఇది గాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఇవన్నీ మొదలైతే.. రాష్ట్రంలో సందడే సందడి. మీడియాకు కవరేజ్ చేసే పని మస్తుగా పడుతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ఓ రాజకీయ ముందడుగుగా మార్చేశారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేసి.. అధికారంలోకి రావటమే కాదు...ప్రజల అవసరాలకు తగ్గట్టు సంక్షేమ పథకాలు తెచ్చారు. ఆ పాదయాత్రతో ప్రజల్లో నాయకుడిగా ఎదిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ లో సైతం తనకు ఎదురు లేకుండా చేసుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబునాయుడు పాదయాత్ర చేశారు. అయితే పాదయాత్ర తర్వాత తెలంగాణ రావటం..విభజన జరగటంతో లెక్కలు మారిపోయాయి. అయినా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చారు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ పాదయాత్ర చేసి 2019లో అధికారంలోకి వచ్చారు. దీంతో పాదయాత్ర చేస్తే పవర్ వచ్చి తీరుతుందనే సెంటిమెంట్ వచ్చేసింది.  అయితే ఎప్పుడూ కూడా ఇలా ఒకసారే ఇద్దరు ముగ్గురు నేతలు పాదయాత్రలు చేయలేదు. ఇప్పుడు తెలంగాణలో అదే జరగబోతుంది. ఇలా రేవంత్ రెడ్డి, బండి సంజయ్, షర్మిల ముగ్గురూ పాదయాత్రలు చేస్తే.. ఆ హంగామా మామూలుగా ఉండదు. కాకపోతే కేసీఆర్ సార్ కి ఫికర్ లేకుండా పోవచ్చు..ఇంతమంది గట్టిగా చేస్తే..వాళ్లల్లో వాళ్లు ఓట్లు చీల్చుకుంటరు..మనం బాజాప్తా మళ్లీ పవర్ లోకి వస్తామనే సోచాయిస్తున్నారనే టాక్ వినపడుతోంది.బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు అధిష్టానం అనుమతి ఇప్పటికే వచ్చేసింది. ఇప్పటికే దూకుడుతో..పంచ్ డైలాగులతో బండి సంజయ్ బిజెపి నేతల్లో హైలెట్ అయిపోయారు. ఇక పాదయాత్ర కూడా చేశారంటే..తిరుగు లేకుండా పోవచ్చు. బిజెపి సీఎం క్యాండేట్ గా మరొకరికి ఛాన్స్ లేకుండా చేయొచ్చనే ప్లాన్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక రేవంత్ రెడ్డికి అయితే అవసరం కూడా.  ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా స్ట్రాంగ్ గా రేవంత్ పై మాటల దాడి చేశారు. ఏకంగా పీసీసీ ఎంపిక ఓటుకు నోటులాగే జరిగిందంటూ అధిష్టానంపై కూడా గుస్సా చూపించారు. పైగా తన జిల్లాలో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఇలా స్వపక్షంలోనే విపక్షం వినపడకుండా ఉండాలంటే పాదయాత్ర సక్సెస్ కావాలి... లీడర్ గా స్ట్రాంగ్ కావాలే..అప్పుడే రేవంత్ అధికారపక్షంపై గట్టిగా పోరాడగలరు..రేవంతన్న పాదయాత్రకు హైకమాండ్ అనుమతి కూడా వస్తుందని ఆయన మనుషులు చెబుతున్నారు. షర్మిల పార్టీ అయితే మొదటి నుంచి మార్కెటింగ్ స్ట్రాటజీలో పోతుంది. కరోనా సెకండ్ వేవ్ వచ్చి పాపం వారి ప్లాను ఖరాబు చేసింది కాని.. లేదంటే ఇంకా బాగా రక్తి కట్టించేవారు. నాన్న లాగా, అన్నలాగా పాదయాత్ర చేసేసి.. స్ట్రాంగ్ అయిపోవాలనే ఆలోచనలో షర్మిల ఉన్నట్లు గతంలోనే చెప్పారు. ఇప్పుడు ఆ పాదయాత్రను ఎప్పుడు చేయాలనే షెడ్యూల్ ఫిక్సింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. పైగా రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడంతో... షర్మిల మరింత తొందరపడుతున్నట్లు సమాచారం.

కోమటిరెడ్డిపై కాంగ్రెస్ సస్పెన్షన్ వేటు ? ఏ పార్టీలో చేరబోతున్నారో.. 

పీసీసీ చీఫ్ ఎంపిక తెలంగాణ కాంగ్రెస్ లో సెగలు రేపుతోంది. రేవంత్ రెడ్డికి మద్దతుగా ఓ వైపు కేడర్ సంబరాలు చేసుకుంటుంగా.. మరోవైపు కొందరు సీనియర్లు మాత్రం కామెంట్లతో కాక రేపుతున్నారు. రేవంత్ రెడ్డి ఎంపికపై సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పీసీసీ పోస్టును పార్టీ ఇంచార్జ్ ఠాగూర్ అమ్ముకున్నారన్న ఆరోపణలపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా ఉందని తెలుస్తోంది. మాణిక్కం ఠాగూర్ కూడా కోమటిరెడ్డి మాటలపై ఆరా తీశారని సమాచారం. కొందరు ముఖ్య నేతలకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్నారట ఠాగూర్. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కోమటిరెడ్డి వ్యాఖ్యలకు కొందరు కాంగ్రెస్ నేతలు కౌంటరిచ్చారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన మహేష్ గౌడ్ .. కోమటిరెడ్డిపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి ఎన్నో పదవులు అనుభవించారని చెప్పారు. ఆ పదవులన్ని డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారా అని ప్రశ్నించారు. పీసీసీ పదవిని అమ్ముకున్నారన్న వ్యాఖ్యలు తీవ్రమైనవని చెప్పారు. వెంటనే కోమటిరెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మహేష్ గౌడ్ డిమాండ్ చేశారు. లేదంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఏఐసీసీ ప్రోగామ్స్ పర్యవేక్షణ కమిటి చైర్మన్ గా నియమించబడిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా స్పందించారు. ఏదో ఆవేశంలో కోమటిరెడ్డి మాట్లాడినట్లు ఉన్నారన్నారు. పార్టీ నేతలమంతా సమిష్టిగా పని చేసి పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని తెలిపారు మహేశ్వర్ రెడ్డి.  ఢిల్లీ నుంచి సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. పీసీసీ ఎంపికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ పదవి కార్యకర్తకు  ఇస్తారు అనుకున్నానని కాని అలా జరగలేదన్నారు కోమటిరెడ్డి. ఓటుకు నోటు లాగా పీసీసీ పదవిని అమ్ముకున్నారని ఆరోపించారు. పార్టీలు మారిన వారికి పీసీసీ పదవి ఇచ్చారని మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ డబ్బులు తీసుకొని పీసీసీ పదవిని రేవంత్ కు కట్టబెట్టారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. టి కాంగ్రెస్ ను  టి టీడీపీ లాగా మార్చవద్దన్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి రావడంలో చంద్రబాబు పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు వెంకట్ రెడ్డి. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆధారాలతో సహా బయట పెడుతానన్నారు.

బీజేపీ, TRS కలిసినా కాంగ్రెస్ దే విజయం.. రేవంత్ రెడ్డి మరో సంచలనం

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డిని నియమించడంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా ఊపు వచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పీసీసీ చీఫ్ ఎంపిక, రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు, బీజేపీ పరిస్థితి ఏంటీ, హుజురాబాద్ ఉప ఎన్నికలో ఏం జరగబోతుంది అన్న చర్చే జనాల్లో సాగుతోంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ప్రకటన తర్వాత రాజకీయ పార్టీల్లోనూ అనూహ్య మార్పులు జరుగుతున్నాయి. బీజేపీకి సీనియర్ నేత ,మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు షాకిచ్చారు. ఆయన త్వరలోనే గులాబీ గూటికి చేరతారనే ప్రచారం జరుగుతోంది. అటు కాంగ్రెస్ లో అసమ్మతి గళం క్రమంగా పెరుగుతోంది. పీసీసీ ప్రకటన వచ్చిన వెంటనే సీనియర్ నేత కేఎల్లార్ పార్టీకి రాజీనామా చేయగా.. ఆదివారం పార్టీ సమన్వయ కమిటికి మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు. పీసీసీ పోస్టు కోసం రేసులో నిలిచిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎంపికపై హాట్ కామెంట్స్ చేసి కాక రేపారు. బీజేపీ నేతలు కూడా రేవంత్ రెడ్డి లక్ష్యంగా మాటల దాడి మొదలు పెట్టారు.  బీజేపీ నేతలు తనను టార్గెట్ చేస్తున్నా, సొంత పార్టీ నేతలు కొందరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా.. కూల్ గా తన పని తాను చేసుకుపోతున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తన భవిష్యత్ కార్యాచరణపై ఆయన కొంత స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు...సమిష్టి నిర్ణయాలు మాత్రమే ఉంటాయని చెప్పారు. తెలంగాణ లో ప్రజల పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు తన పాదయాత్ర ఉండే అవకాశం ఉందన్నారు రేవంత్ రెడ్డి. అది ఎప్పుడు అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.  ఇపుడున్న పరిస్థితులలో ఎన్టీఆర్, వైఎస్సార్ లను విమర్శించడం వికృతమైన చర్య అన్నారు రేవంత్ రెడ్డి.  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానన్నారు.  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం ఇప్పడు తిరుగుబాటుగా మరాల్సిన అవసరం వచ్చిందన్నారు. టిఆర్ఎస్,బిజెపి కలిసి పోటీ చేసిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు రేవంత్ రెడ్డి.  లింగోజి గూడ వ్యవహారంలో ప్రగతి భవన్ వెళ్లినదుకు బిజెపి కమిటీ ఇచ్చిన నివేదికపై ఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఎప్పటి లోగా చర్యలు తీసుకుంటారో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.  

కేసీఆర్ టార్గెట్ గా ఉద్యమకారుల ఉమ్మడి వేదిక.. హుజురాబాద్ లో త్వరలో భారీ సభ.. 

తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం హుజురాబాద్ కేంద్రంగానే జరుగుతున్నాయి. ఉప ఎన్నికకు ఇంకా చాలా సమయం ఉన్నా పార్టీలన్ని అప్పుడే దూకుడు పెంచాయి. కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. ఉప ఎన్నిక ద్వారా కేసీఆర్ పై కసి తీర్చుకోవాలని భావిస్తున్నారు. అంతేకాదు తెలంగాణ ఆత్మగౌరవానికి , కేసీఆర్ అహంకారానికి మధ్య పోటీ జరుగుతుందని చెబుతున్నారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్ ను ఓడించడం ద్వారా తెలంగాణ ప్రజలను గెలిపిస్తానంటున్నారు ఈటల. అటు టీఆర్ఎస్ కూడా హుజురాబాద్ లో తన బలగాన్ని మోహరించింది. ఎట్టి పరిస్థితులోనూ ఈటలను ఓడించేందుకు పావులు కదుపుతోంది. మండలాల వారీగా మంత్రులను ఇంచార్జులుగా నియమించారు గులాబీ బాస్. తమకు సవాల్ గా మారిన హుజురాబాద్ ఉప ఎన్నికల గెలుపు కోసం అధికార పార్టీ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమకారులు కూడా హుజురాబాద్ ఎన్నిక రాష్ట్రానికి అత్యంత కీలకమని భావిస్తున్నారు. తెలంగాణలో ఏడేండ్లుగా నియంతృత్వ పాలన సాగుతుందని ఆరోపిస్తున్న ఉద్యమకారులు... హుజురాబాద్ లో కేసీఆర్ కు తగిన బుద్ది చెప్పేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్ గెలిస్తే.. కేసీఆర్ నియంతృత్వం మరింత పెరుగుతుందని, ఆయన నుంచి రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరని చెబుతున్నారు. ఉద్యమంలో జరిగిన ఘటనలు, కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలు, గత ఏడేండ్లుగా సాగుతున్న టీఆర్ఎస్ పాలనపై పూర్తి అవగాహనతో ఉన్న ఉద్యమకారులు.. తామే  నేరుగా రంగంలోది దిగాలని డిసైడయ్యారు.  హుజూరాబాద్ కేంద్రంగా ప్రజాస్వామ్య వేదిక ఏర్పాటు చేయబోతున్నారు. నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి కేసీఆర్ కు, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు.   తెలంగాణ ఉద్యమకారుడు, మాజీమంత్రి ఏ.చంద్రశేఖర్ నివాసంలో ఆదివారం  ఉద్యమకారులు సమావేశమయ్యారు. స్వామిగౌడ్, ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి, గాదె ఇన్నయ్య, బెల్లయ్య నాయక్, కపిలవాయి దిలీప్ కుమార్, బండి సాదానంద్, రాములు నాయక్, రాణి రుద్రమ్మ తదితరులు హాజరయ్యారు. అద్దంకి దయాకర్ తో పాటు మరికొందరు ఉద్యమ నేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కలిసి వస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమ‌ ఆకాంక్షలు నెరవేరలేదని వారంతా అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల సాధన కోసం ఉద్యమకారులంతా  ఒకే వేదిక మీదకు రావాలని పిలుపిచ్చారు.  హుజూరాబాద్‌లో ఉద్యమకారులతో భారీ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.   హుజూరాబాద్ ఉప ఎన్నికను ఉద్యమకారులు అవకాశంగా తీసుకోవాలని స్వామిగౌడ్‌ అన్నారు.  ఈటల గెలుపు కోసం ఉద్యమకారుల్ని ఏకం చేస్తున్నామని చెప్పారు, కేసీఆర్ పాలనలో ప్రజ్వాస్వామ్యం మంట కలిసిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని బతికించటానికే ఉద్యమకారులు సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సీఎం పదవి ఇస్తేనే దళితులు కేసీఆర్‌ను నమ్ముతారని చంద్రశేఖర్‌ అన్నారు. దళితులతో రాజకీయాలు చేయటం మానుకోవాలని సూచించారు. హుజూరాబాద్‌ ఎన్నికల కోసమే దళితులపై కేసీఆర్‌ ప్రేమ చూపిస్తున్నారని చెప్పారు.  

సంచలనం... చంద్రబాబు వల్లే పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి?  

తెలంగాణ పీసీసీ ఎంపిక వ్యవహారం కాక రేపుతోంది. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ప్రకటించిన కొన్ని గంటల్లోనే రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. కాంగ్రెస్ లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుగుతుండగా.. అదే సమయంలో అసమ్మతి గళం వాయిస్ పెరుగుతోంది. పీసీసీ చీఫ్ పదవి కోసం చివరి వరకు ప్రయత్నించిన సీనియర్ కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న వెంటనే శంషాబాద్ ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి.. రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వడంపై ఘాట్ కామెంట్స్ చేశారు.  పీసీసీ పదవి కార్యకర్తకు  ఇస్తారు అనుకున్నానని కాని అలా జరగలేదన్నారు కోమటిరెడ్డి. ఓటుకు నోటు లాగా పీసీసీ పదవిని అమ్ముకున్నారని ఆరోపించారు. పార్టీలు మారిన వారికి పీసీసీ పదవి ఇచ్చారని మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ డబ్బులు తీసుకొని పీసీసీ పదవిని రేవంత్ కు కట్టబెట్టారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. టి కాంగ్రెస్ ను  టి టీడీపీ లాగా మార్చవద్దన్నారు.  రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి రావడంలో చంద్రబాబు పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు వెంకట్ రెడ్డి. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆధారాలతో సహా బయట పెడుతానన్నారు. తనను  కలవడానికి ఎవరు రావద్దన్నారు సూచించారు వెంకట్ రెడ్డి.   పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించడంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి. మరోవైపు తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. రాహుల్ గాంధీతో చంద్రబాబు మాట్లాడటం వల్లే రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి వచ్చిందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి అన్నారు. 2018లో టీడీపీ, కాంగ్రెస్ కలిసి పని చేశాయని, అప్పటినుంచి రాహుల్ తో చంద్రబాబు సంబంధాలు కొనసాగిస్తున్నారని చెప్పారు.  అయితే రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి రావడం వెనుక చంద్రబాబు పాత్ర ఉందన్న వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో చంద్రబాబుకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తు్ననారు. చంద్రబాబుకు అంత అవకాశం ఉంటే ఏడు నెలలుగా పీసీసీ పదవిని ఎందుకు భర్తీ చేయలేకపోయారని చెబుతున్నారు. కొందరు నేతలు తమ రాజకీయ పబ్బం కోసం సంబంధం లేని విషయంలో చంద్రబాబును లాగుతున్నారని మండిపడుతున్నారు. 

కుటుంబంలో జగనన్న చిచ్చు! అత్తపై వేడి నూనే పోసిన కోడలు..

ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలు ఎక్కువగానే అమలవుతున్నాయి. అర్హులను గుర్తించి నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జన చేస్తోంది జగన్ రెడ్డి సర్కార్. అయితే ప్రభుత్వ పథకాలు కొన్ని కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి. సర్కార్ అందించిన నగదు విషయంలో గొడవలు పడుతున్నారు. కృష్ణా జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. నగదు కోసం అత్తా, కోడలు గొడవ పడ్డారు. ఈ ఘటనలో అత్తపై కోపంతో  కోడలు వేడి నూనే పోసిందని తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వం ఇటీవలే వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల ఖాతాల్లో రూ.18,750 చొప్పున జమ చేసింది.  కృష్ణాజిల్లా గుడివాడ శివారులోని మందపాడుకు చెందిన చుక్కా లక్ష్మి బ్యాంక్ అకౌంట్ లో కూడా వైఎస్ఆర్ చేయుత నగదు డబ్బులు పడ్డాయి. దీంతో ఆ డబ్బులు ఇవ్వాల్సిందిగా కోడలు స్వరూప గొడవకు దిగింది.  ఈ క్రమంలో అత్త లక్ష్మి నిద్రిస్తుండగా.. కోడలు స్వరూప వేడివేడి నూనెపోసి హత్యాయత్నం చేసింది. స్థానికులు ఆమెను గుడివాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.   ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు కొడుకు చుక్కా శివ నారాయణ, కోడలు లక్ష్మీలను అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు  

చంద్ర‌బాబు నుంచి రాహుల్‌ వ‌ర‌కు.. రేవంత్‌రెడ్డి డైన‌మిక్ పాలిటిక్స్‌..

తెలంగాణ టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్. ఆ త‌ర్వాత కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఏకంగా టి-కాంగ్ ప్రెసిడెంట్‌. రేవంత్‌రెడ్డికి అంత ఈజీగా రాలేదు ఈ ప‌ద‌వులు. నంద‌మూరి కుటుంబ‌మూ కాదు.. గాంధీ వార‌స‌త్వ‌మూ లేదు. సొంత టాలెంట్‌తో ఈ స్థాయికి ఎదిగారు రేవంత్‌రెడ్డి. ఇప్ప‌టికి జ‌స్ట్ రెండుసార్లు మాత్ర‌మే ఆయ‌న ఎమ్మెల్యే. అయినా, ఓ ముఖ్య‌మంత్రికి ఉన్నంత పాపులారిటీ ఆయ‌నది. ప్ర‌స్తుతం ఎంపీగా ఉన్నా.. స్టూడెంట్ లీడ‌ర్‌గా ఉన్న‌ప్పుడే ఆయ‌న‌లో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌తో రాజ‌కీయాల్లో తొలి అడుగు వేశారు. టీడీపీలో ఆయ‌న ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకున్నారు. చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో రాజ‌కీయంగా రాటుదేలారు. ఆ రోజుల్లో చంద్ర‌బాబుకు అత్యంత న‌మ్మ‌క‌స్తుడిగా మెదిలారు రేవంత్‌రెడ్డి. టీడీపీ అధినేత సైతం రేవంత్‌రెడ్డికి అంతే ప్రాధాన్యం ఇచ్చారు. యువ‌కుడిగా ఉన్న‌ప్ప‌టి నుంచే ప్రోత్సాహం అందించారు. ఎమ్మెల్యేగా పెద్ద‌గా అనుభ‌వం లేక‌పోయినా.. పార్టీలో కీల‌క నేత‌గా రేవంత్‌రెడ్డికి గుర్తింపు ఇచ్చి.. ఆయ‌న్ను నాయ‌కుడిగా ప్ర‌మోట్ చేసిన ఘ‌న‌త చంద్ర‌బాబుదే.  అప్ప‌టికే టీడీపీలో కీల‌క నేత‌గా ఉన్న ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావుకు రేవంత్‌రెడ్డి అంటే క‌ళ్లుమంట అంటారు. నిత్యం చంద్ర‌బాబు ప‌క్క‌నే ఉండే ఎర్ర‌బెల్లి.. ప్ర‌తీ స‌భ‌లోనూ చంద్ర‌బాబు పక్క సీటే కావాల‌ని డిమాండ్ చేసే ద‌యాక‌ర్‌రావు.. రేవంత్‌రెడ్డికి అధినేత ఇస్తున్న ప్రాధాన్య‌త‌ను చూసి ఓర్వ‌లేద‌ని చెబుతారు. 2014లో తెలంగాణ అసెంబ్లీలో ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావును టీడీపీ ఫ్లోర్ లీడ‌ర్ చేసి.. టీటీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్‌రెడ్డిని నియ‌మించారు చంద్ర‌బాబు. రేవంత్‌రెడ్డిని ఎలాగైనా దెబ్బ తీయాల‌నే దురుద్దేశ్యంతో.. ఓటుకు నోటు ఆప‌రేష‌న్‌పై ప్ర‌భుత్వానికి ఉప్పందించింది అప్ప‌టి టీడీపీ నేత ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావేన‌నే ఆరోపణ ఉంది. అదే నిజ‌మైతే, ఎర్ర‌బెల్లి కొట్టిన దొంగ‌దెబ్బ‌కు.. రేవంత్‌రెడ్డి జైలు పాల‌వ‌డం.. తెలంగాణ‌లో టీడీపీకి బాగా డ్యామేజ్ జ‌ర‌గ‌డం.. ద‌యాక‌ర్‌రావు కారెక్క‌డం.. ఇప్పుడాయ‌న మంత్రి కావ‌డం.. ఇలా తెలంగాణ‌లో ప‌లు కీల‌క ప‌రిణామాలు రేవంత్‌రెడ్డి కేంద్రంగానే జ‌రిగాయ‌ని గుర్తు చేస్తున్నారు.  ఓటుకు నోటు ఎపిసోడ్ రేవంత్‌రెడ్డి పొలిటిక‌ల్ కెరీర్‌ను మ‌రో మ‌లుపు తిప్పింది. తాను జైలు పాల‌వ‌డానికి కార‌ణ‌మైన కేసీఆర్‌ను ఢీ కొట్ట‌డం టీడీపీతో సాధ్యం కాద‌ని భావించి.. వీడ‌లేక చంద్ర‌బాబును వీడి.. కాంగ్రెస్‌లో చేరారు రేవంత్‌రెడ్డి. ఇక‌, కాంగ్రెస్ గురించి తెలిసిందేగా. అక్క‌డ ప్రోత్స‌హించే వారికంటే.. కాలుప‌ట్టి లాగే వాళ్లే ఎక్కువంటారు. కాంగ్రెస్‌లో ఎవ‌రి ఆట వాళ్లే ఆడుకుంటారు. అలా ఆ ఆట‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్‌లో చేరిన అన‌తికాలంలోనే రాహుల్‌గాంధీ దృష్టిలో ప‌డ్డారు. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎదిగారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో అంద‌రికంటే రేవంత్‌రెడ్డినే ముందుంచారు రాహుల్‌. ప్ర‌చార బాధ్య‌త‌లతో పాటు పార్టీని గెలిపించే బ‌రువు బాధ్య‌త‌లు సైతం రేవంత్‌రెడ్డి భుజాల‌పైనే మోపారు. చిచ్చ‌ర‌పిడుగులాంటి రేవంత్‌రెడ్డిని.. సుడిగాలిలా తెలంగాణ మొత్తం తిప్పేందుకు ప్ర‌త్యేకంగా ఆయ‌న కోస‌మే ఓ హెలికాప్ట‌ర్‌ను సైతం కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. కానీ, కేసీఆర్ రేవంత్‌పై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టి.. కేసులు, కుట్ర‌లు, అరెస్టుల‌తో ఆయ‌న్ను కొడంగ‌ల్‌కే క‌ట్ట‌డి చేసి.. రేవంత్‌ను అసెంబ్లీలో అడుగుపెట్ట‌కుండా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు. అయితే, నేల‌కు కొట్టిన బంతిలా.. మ‌ల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా గెలిచి.. ఏకంగా పార్ల‌మెంట్ స్థాయికి ఎదగడం రేవంత్‌రెడ్డి స‌త్తాకు నిద‌ర్శ‌నమ‌నే చెప్పాలి.  ఓట‌మితో, కేసీఆర్ దూకుడుతో జ‌వ‌స‌త్వాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి.. మ‌ళ్లీ పున‌ర్ వైభ‌వం తీసుకొచ్చేందుకు కొత్త పీసీసీ నియామ‌కానికి పూనుకుంది హ‌స్తం పార్టీ అధిష్టానం. ఆ జాబితాలో రేవంత్‌రెడ్డి పేరే అంద‌రిక‌న్నా ముందున్నా.. సీనియ‌ర్లు ఓ పట్టాన ఒప్పుకోలేదు. కాంగ్రెస్‌లో అంతే. పార్టీ బాగుకంటే కూడా త‌మ బాగుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు నేత‌లు, రేవంత్ విష‌యంలోనూ అనేక కొర్రీలు పెట్టారు. కేసులున్నాయ‌ని.. వేరే పార్టీ నుంచి వ‌చ్చాడ‌ని.. ఇలా సిల్లీ రీజ‌న్స్ చెప్పారు. సీనియ‌ర్లు ఎన్నిచెప్పినా.. ప్ర‌జా క్షేత్రంలో ఎవ‌రి బ‌లం ఎంతో హైక‌మాండ్‌కు తెలియంది కాదు. రాహుల్‌గాంధీకి సైతం రేవంత్‌రెడ్డి మీదే న‌మ్మ‌కముంది. సోనియా స‌రేనంది. 150 ఏళ్ల‌కు పైగా చ‌రిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ పీసీసీ ప‌గ్గాలు రేవంత్‌రెడ్డి చేతిలో పెట్టింది. ఆయ‌న నెత్తిన మోయ‌లేనంత భారం మోపింది. రేవంత్‌రెడ్డి అయితేనే కాంగ్రెస్ ర‌థ చ‌క్రాల‌ను తెలంగాణ వ్యాప్తంగా దూసుకెళ్లేలా చేస్తార‌ని.. కేసీఆర్‌ను ఢీకొట్టి గ‌ద్దెదింపే సామ‌ర్థ్యం రేవంత్‌రెడ్డికే ఉంద‌ని కాంగ్రెస్ హైక‌మాండ్ డిసైడ్ అయింది. అందుకే, డైన‌మిక్ లీడ‌ర్ రేవంత్‌రెడ్డికి పీసీసీ కిరీటం తొడిగింది.. ఇక, కేసీఆర్‌పై దండ‌యాత్రే మిగిలింది.. క‌మాన్ రేవంత్‌.. లెట్స్ ప్రూవ్‌.. అంటూ స‌మ‌రోత్సాహంలో ఉంది కాంగ్రెస్‌.