శోభనానికి సరిపోదు.. జగనన్న ఇళ్లపై వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు..
posted on Jun 26, 2021 @ 4:21PM
నవరత్నాల హామీలో భాగంగా 2023 జూన్ నాటికి పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఏపీ సర్కారు టార్గెట్ పెట్టుకుంది. ఏపీలో రెండు దశల్లో రూ.50,944 కోట్లతో.. 28,30,227 పక్కా ఇళ్లను నిర్మించడానికి ప్రణాళిక రూపొందించింది. మొదటి దశలో 15.60 లక్షల గృహాలు, రెండో దశలో 12.70 లక్షల ఇళ్లను నిర్మించనుంది. వైఎస్సార్ జగనన్న కాలనీలుగా నిర్మించనున్నారు. ఒకేరకమైన డిజైన్‌తో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని 340 చదరపు అడుగులలో ఒక పడక గది, హాలు, వంట గది, స్నానాల గది, వరండాతో నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ప్రచారం, ఆర్బాటం ఇలా ఉంటే.. వాస్తవం మరోలా ఉంది. జగనన్న ఇళ్లు కాపురానికి పనికి రావంటూ సొంత పార్టీ ఎమ్మెల్యేనే కామెంట్లు చేయడం కలకలం రేపుతోంది. ఇంకా పక్కాగా చెప్పాలంటే.. కొత్త జంట శోభనానికి ఈ ఇళ్లు పనికి రావంటూ.. జగనన్న ఇళ్లపై సమీక్ష నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రకటించడం సంచలనంగా మారింది.
జగనన్న ఇళ్లపై హౌసింగ్ రివ్యూలో నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగనన్న ఇళ్లలో బెడ్రూమ్స్ సరిగా లేవని అన్నారు. బెడ్ రూమ్స్‌లో పెళ్ళయిన కొత్త జంటలకు శోభనానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందంటూ ఘాటైన కామెంట్లు చేశారు. బెడ్ రూమ్ చాలా చిన్నదిగా ఉందని.. లబ్ధిదారులు రాత్రివేళల్లో బెడ్ రూమ్ లో ఏదైనా పని చేయాలనుకున్నా ఇబ్బందిగా ఉంటుందంటూ ‘ఏ’ సర్టిఫికెట్ కామెంట్స్ చేయడం కలకలం రేపుతోంది.
బెడ్ రూమ్ లో పెద్ద మంచం వేయాల్సి వస్తే కష్టంగా ఉంటుందన్నారు వైసీపీ ఎమ్మెల్యే. బాత్ రూమ్ బయట ఏర్పాటు చేసి బెడ్రూమ్ సైజు పెంచాలని సూచించారు. అర్బన్ ప్రాంతాల్లో కేవలం 6 అంకణాల్లోనే ఇళ్లు నిర్మించనున్నారని.. అలాంటి ఇళ్లలో.. హాల్లో శోభనం చేసుకొని బెడ్రూమ్‌లో పడుకోవాల్సి వస్తుందంటూ ప్రసన్నకుమార్ కామెంట్స్ చేయడాన్ని బట్టి చూస్తే.. ఆ జగనన్న ఇళ్లు ఎంత చెండాలంగా ఉన్నాయో అర్థం అవుతోందని అంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఈ తరహా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది. జగనన్న ఇళ్ల సంఖ్య పెంచడానికి ఇరుకిరుకు ఇళ్లను కడుతున్నారని అంటున్నారు. ఆర్భాటం మినహా.. ఆ ఇళ్లు కాపురానికి పనికి రావంటూ ఎద్దేవా చేస్తున్నారు. అందుకు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కామెంట్లనే ఉదహరిస్తున్నారు. మరి, ఎమ్మెల్యే ఆరోపించినట్టు.. జగనన్న ఇళ్లు.. శోభనానికి పనికి వస్తాయో లేదో.. ఆ జగనన్నే చెప్పాలి మరి....