వామ్మో.. మళ్లీ ఎన్నికలా! వైసీపీ నేతల్లో టెన్షన్...
posted on Jun 26, 2021 @ 3:29PM
పరిషత్ ఎన్నికలు మళ్లీ పెడతారా? అమ్మో అంటూ గుండె పట్టుకుంటున్నారు వైసీపీ నేతలు. ఒకవైపు ప్రభుత్వం ఎన్నికల రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేసే పనిలో బిజీగా ఉంటే..రూల్స్ బుక్ చదువుతూ న్యాయమూర్తులు మాత్రం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను నిలదీస్తోంది. దీంతో మళ్లీ ఎన్నికలు పెట్టక తప్పవా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇంకోవైపు అసలు గెలిచామో లేదో కూడా తెలియని పరిస్ధితుల్లో ఉన్న క్యాండేట్లు మాత్రం..మళ్లీ పోలింగ్ అనే ఆలోచన వస్తేనే అల్లాడిపోతున్నారు.
జిల్లా, మండల స్థాయి వైసీపీ నేతలు పాపం కష్టాల్లో పడ్డారు. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడ్డ పరిషత్ ఎన్నికలకు..మూడు సార్లూ ప్రచారం ఖర్చు పెట్టుకున్నారు. పోలింగ్ మేనేజ్ మెంట్ ఖర్చు ఎటూ భారీగానే ఉంటుంది. ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టాత్మకంగా మెజారిటీ స్థానాలు గెలవాలని ఆదేశమివ్వడంతో.. పాపం భారీగానే ఖర్చు పెట్టారు. అయితే ఇప్పుడు ఆ ఖర్చంతా వేస్ట్ అనే పరిస్దితి రావడంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డారు. మళ్లీ ఎన్నికలు అంటే...కష్టమేనని వారంతా ఆవేదన చెందుతున్నారు.
ఆల్ రెడీ టీడీపీ బాయ్ కాట్ చేయడంతో... కొందరు ఖర్చు పెట్టుకున్నారు..చాలామంది వదిలేశారు. కాని వైసీపీ పరిస్దితి మాత్రం అది కాదు. ప్రతి స్థానం మనమే గెలవాలన్నట్లుగా వ్యూహాలు పన్ని.. పై నుంచి అధినాయకులు ఒత్తిడి చేయడంతో... డబ్బులు కుమ్మరించేశారు. డామిట్ కథ అడ్డం తిరిగిందన్నట్లు అయిందిప్పుడు పరిస్దితి. అసలు తప్పంతా ఎవరిదంటే..అందరి చూపు జగన్మోహన్ రెడ్డి వైపు తిరుగుతుంది. పైకి ఏమీ అనలేరు..ఆయనేమో కంటి చూపుతోనే బెదిరించడం కాదు.. అసలు కంటిచూపుకే దొరకని పరిస్ధితి. ఎమ్మెల్యేలు, మంత్రులతోనే మొరపెట్టుకోవాల్సి వస్తోంది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత కాలం...ఎన్నికల జరగకుండా ఆపాలని చూసిన వైసీపీ సర్కార్...ఆయన ఎన్నికలు పెట్టినప్పుడు ఆపడానికి హైకోర్టు, సుప్రీంకోర్టుకు పరుగులు పెట్టింది. చివరకు తప్పక పాల్గొనడానికి సిద్ధపడ్డారు. అయితే విచిత్రంగా అక్రమాలు ఎన్ని జరిగినా..కంప్లయింట్లు ఎన్నివచ్చినా... నిమ్మగడ్డ రమేష్ కుమార్ సైలెంట్ గానే ఉండిపోయారు. పైగా గతంలో ఆయనే స్వయంగా రాసిన అక్రమాల గురించి కూడా పట్టించుకోలేదు. దీంతో టీడీపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించింది.
ఇక నిమ్మగడ్డ రిటైర్ కాగానే...వెంటనే వినయ విధేయ సాహ్ని గారిని ఎన్నికల కమిషనర్ చేసేశారు. వాళ్లనుకున్నట్లుగా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు కంప్లీట్ చేసేయాలనే ప్లాన్ లో ఉన్న జగన్ ఆదేశాలను తుచ తప్పక పాటించిన సాహ్ని.. సుప్రీంకోర్టు గత ఆదేశాలను, నిబంధనలను అన్నీ తుంగలో తొక్కేసి హడావుడిగా ఎన్నికలకు వెళ్లిపోయారు. చాలామంది కోర్టుకు వెళ్లినా... హైకోర్టు స్టే విధించలేదు. దీంతో ఎన్నికలు జరిగిపోయాయి..కాని తర్వాత తుది తీర్పులో హైకోర్టు ఎన్నికలను రద్దు చేసింది. దీంతో కథ మొదటికి వచ్చింది. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టిన వైసీపీ జిల్లా, మండల స్థాయి నేతలు మాత్రం ఫలితాల సంగతి మర్చిపోయారు. మళ్లీ ఎన్నికలు పెట్టకపోతే అదే పదివేలని ఎదురు చూస్తున్నారు. కాని ఎన్నికలు మళ్లీ పెట్టక తప్పేటట్టు లేదు. అదే జరిగితే అటు అధినేత డబ్బులు ఎటూ ఇవ్వరు.. మంత్రులు, ఎమ్మెల్యేల సంగతి సరే సరి..వాళ్లకు ఇన్ కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ ఉండదు. అందుకే మళ్లీ డబ్బులు ఎలా సమకూర్చుకోవాలా అనే టెన్షన్ లో పడ్డారు వైసీపీ నేతలు.