రెండేళ్లుగా చివాట్లే చివాట్లు.. అహంకారమే అసలు సమస్యా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇది మొదటి ఎదురుదెబ్బ కాదు. చివరిది కూడా కాకపోవచ్చును. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఇలా కోర్టుల చేత మొట్టి కాయలు వేయించుకోవడం ఆలవాటుగా మారి పోయింది. అదే క్రమంలో ఇప్పుడ మరో మొట్టికాయ గట్టిగా పడింది. ఇంటర్, టెన్త్ పరీక్షలు నిర్వహించేందుకు,ఇది సమయం కాదు. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. థర్డ్ వేవ్ సిద్ధంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో పరీక్షలు నిర్వహించడం అంటే, పిల్లల ప్రాణాలతో చేలగాడం ఆడడమే అవుతుంది. ఇది కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. ఇది తెలుసుకునేందుకు అంత, ‘అజ్ఞానం’ కూడా అవసరం లేదు. అయినా, అపోజిషన్ పరీక్షలు రద్దు చేయమని కోరింది కాబట్టి, అపోజిషన్ను అపోజ్ చేయడమే సర్కార్ విధానంగా పెట్టుకున్న జగన్ రెడ్డి ఆరు నూరైనపరీక్షలు నిర్వహింఛి తీరాలని నిర్ణయించారు. అందుకోసం సుప్రీం కోర్టు వరకు వెళ్లారు. బొక్కబోర్లా పడ్డారు. కోర్టు పెట్టవలసిన నాలుగు పెట్టిన తర్వాత, అమాత్యవర్యులు, ముఖం చిన్నబుచ్చుకుని, మంత్రసాని తనం ఒప్పుకున్నడకు తప్పదన్నట్లుగా పరీక్షలను రద్దు ప్రకటించారు.
ఎందుకు ఇలా జరుగుతోంది? ప్రతి విషయంలో కోర్టుల జోక్యం ఎందుకు అవసరం అవుతుంది? ఇందుకు ఇంకా చాలా కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ, ప్రధాన కారణం మాత్రం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన అహంకార ధోరణే ప్రధాన కారణమనేది అందరి మాట. నిజానికి, ఈ నిజం, ఆయన మంత్రివర్గంలోని మంత్రులకు, అధికారులకు, సలహాదారులకు అందరికీ తెలుసు. అయినా, మొండివాడు రాజుకంటే బలవంతుడు, రాజే మోడీ వాడైతే ... అనుకుంటారో ఏమో కానీ, ఆయన మాటకు ఎదురు చెప్పే సాహసం చేయరు. అయితే, ప్రైవేటుగా ఎవరిని పలకరించినా, ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడల వలన ప్రజాధనం దుర్వినియోగం కావడమే కాకుండా, అధికారులు అవమానాల గురవుతున్నారని, కోర్టుల ముందు తలవంచుకోక తప్పడం లేదని, అన్నిటినీ మించి ప్రజలు ఇప్పందులు పడుతున్నారని అంటారు.
సహజంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే ముందు, అనేక కోణాల్లో మంచి చెడులను అలోచించి నిర్ణయం తీసుకుంటుంది. కానీ, ఏపీలో అందుకు పూర్తి విరుద్ధంగా, ముందు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు, ఆ తర్వాత మంత్రులు అధికారులు, సలహాదారులు, రాజ్యాంగం ఒకటుందనే విషయాన్ని మరిచి పోయి, అడ్డదారులలో,ఆ నిర్ణయం అమలకు ప్రయత్నిస్తారు. చివరకు కోర్టుల చీవాట్లతో, కథ ముగుస్తుంది. అందుకే ప్రారంభంలోనే అనుకున్నట్లుగా, పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు కేసు మొదలు ప్రస్తుత పరీక్షల కేసు వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోర్టుల్లో ఓడిపోయిన కేసుల సంఖ్య, ఖచ్చితంగా ఎంతుంటుందో కానే, ఖాయంగా సెంచరీ దాటేసిందని మాత్రం చెప్పవచ్చును అంటున్నారు.
అయినా ముఖ్యమంత్రి మాత్రం అదే ధోరణిలో పోతున్నారు. నిప్పుతో చెలగాటం ఆడితే చెయ్యి కాలుతుంది, ఇది అందరికీ తెలుసు అయినా, నేనింతే ... అంటే ... వాతలు తప్పవు. ఏపీలో అదే జరుగుతోంది. ప్రస్తుత పరీక్షల విషయాన్నే తీసుకుంటే, సుమారు రెండు నెలలకు పైగా, ప్రతిపక్షాలే కాదు పిల్లల తల్లి తండ్రులు, విద్యావేత్తలు,మేధావులు పరీక్షలు రద్దు చేయమని కోరుతున్నారు. మరో వంక ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పాటుగా, 21 రాష్ట్రాలు 10+2 పరీక్షలను రద్దు చేశాయి. చివరకు సీబీఎస్సీ, ఐసీఎస్ఈ’లు కూడా అదే బాటలో నడిచాయి. అయినా, ఊరందరి దారిలో కాకుండా ఏపీ ప్రభుత్వం మరోదారిన పోయింది. దేశంలో మరే రాష్ట్రంలోని విద్యార్ధులకు జరగని తీరని నష్టం, ఒక్క ఏపీ విద్యార్దులకే జరుగుతుందన్న వితండవాదంతో విధ్యార్ధులను, విద్యార్ధుల తల్లి తండ్రులను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. ఎంసెట్ ర్యాంకుల నిర్ధారణలో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఉందని చెబుతూ వచ్చారు. అది నిజం. అయితే, ఇంటర్ మార్కులకు వెయిటేజీ ముందు నుంచి లేదు, ఈ మధ్య కాలంలో వచ్చింది. ప్రభుత్వం తలచుకుంటే, వెయిటేజీ వచ్చిన దారిలోనే వెనక్కి పోతుంది. అదేమంత పెద్ద పనికాదు. అయినా, మంత్రిగారు”‘పరీక్షలు రద్దు చేయడం నిమిషం పట్టదు. కానీ, ఇంటర్ పరీక్షలకు ఎంసెట్ పరీక్షలకు లింకు ఉంది’’ అని చెపుతూ వచ్చారు, చివరకు తప్పని సరి పరిస్థితిలో తూచ్’ అని తప్పుకున్నారు.
సాధారణ సాధారణ పరిస్థితులకు, అసాధారణ పరిస్థితులకు మధ్య వ్యత్యాసం ఉంటుంది .. అందుకే ప్రభుత్వం సాధారణ పరిస్థితులలో అయినా ఒక నిర్ణయం తీసుకునే ముందు ... 360 డిగ్రీలలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. పరిస్తితులు అనుకూలించక పోతే, ఏమి చేయాలి అనేది కూడా ముందే అలోచించి కంటిన్జెన్సీ ప్రణాళికను సిద్ధం చేసుకుంటుంది . అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి అన్నిటికీ అతీతం, కుందేటికి మూడే కాళ్ళని నమ్మే ప్రభుత్వం. అందుకే ఇన్ని ఎదురుదెబ్బలు...ఇన్ని చీవాట్లు .. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ... God resists the proud, but gives grace to the humble: అనే బైబిల్ సూక్తిని గుర్తు చేసుకుని అయినా అహం కొంచెం తగ్గిచుకుంటే.. మంచిది, అంటున్నారు...సామాన్య జనం.