మళ్ళీ రాజుకున్న సీట్ల పంచాయతి!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 లో ఇచ్చిన అనేక హామీల్లో, నియోజక వర్గాల పునర్విభజన కూడా ఒకటి. అయితే, రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్ళు పూర్తయినా, కేంద్రం ఆ ఊసే ఎత్తలేదు సరికదా, 2026 వరకు దేశంలో ఎక్కడా నియోజక వర్గాల పునర్విభజన చేపట్టే అవకాశమే లేదని తేల్చేసింది. అయితే, జమ్మూ కశ్మీర్’కు రద్దయిన రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించి ఎన్నికలు నిర్వహించే ప్రక్రియలో భాగంగా ఆ రాష్ట్రంలో నియోజక నియోజక వర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందుకోసంగా రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీని ఏర్పాటు చేసింది. చివరకు గత గురువారం, జమ్మూ కశ్మీర్ రాజకీయ నేతలతో నిర్వహించిన సమావేశంలో, స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నియోజక వర్గాల పునర్విభజన ప్రక్రియ ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. అంటే, ఆయన తమ నోటితో చెప్పక పోయినా, రాజకీయ పార్టీలు కోరుకుంటున్న, రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరణ జరగాలంటే నియోజక వర్గాల పునర్విభజనకు రాజకీయ పార్టీలు సహకరించి తీరాలని, మెడ మీద కత్తి పెట్టారు. జమ్మూ కశ్మీర్ పార్టీలు, నియోజక వర్గాల పునర్విభజనను కోరుకోవడం లేదు, కాదు, వ్యతిరేకిస్తున్నాయి. అందుకే,దేశాయ్ కమిటీ ఏర్పడి ఇంచుమించుగా సంవత్సరం అయినా, ప్రాంతీయ పార్టీల సహాయ నిరాకరణతో, కమిటీ పని కదలడం లేదు. ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయింది. అందుకే, ప్రధాని స్వయంగా రంగంలోకి దిగి నియోజక వర్గాల పునర్విభజనకు ప్రాంతీయ పార్టీలను ఒప్పించారు.
కానీ, అదే సమయంలో ప్రధాన మంత్రి ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్నవిధంగా నియోజకవర్గాల విభజన చేపట్టాలని కోరుతున్న ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వం, రాజకీయ పార్టీలు కోరుతున్నా ససేమిరా అటున్నారు. ఎందుకీ ద్వంద వైఖరి అంటే, జమ్మూ కశ్మీర్’లో నియోజక వర్గాల పునర్విభజన వలన బీజేపీకి ప్రయోజనం, తెలుగు రాష్ట్రాలలో ఇక్కడి పాలక పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు ప్రయోజనం, అందుకే అక్కడో నీతి, ఇక్కడో నీతి పాటిస్తున్నారు, అనుకోవలసి వస్తుంది.
అయితే, ఇప్పుడు ఈ ద్వంద నీతి కారణంగానే తెలుగు రాష్ట్రాలలో మరోమారు, సీట్ల పంచాయతీ రాజుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్’ కేంద్ర ప్రభుత్వ ద్వంద నీతిని ప్రశ్నిస్తూ, జమ్మూ కశ్మీర్ సూత్రాన్నే తెలుగు రాష్ట్రాలకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం వెంటనే అసెంబ్లీ సీట్లు పెంచాలని వినోద్ శనివారం డిమాండ్ చేశారు.రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను తక్షణం పెంచాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పెంచాలనీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరితే 2026 వరకు అసెంబ్లీ సీట్ల పెంపు కుదరదని, అందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జవాబిచ్చారని ఆయన పేర్కొన్నారు.
మరి ఈ సూత్రం జమ్మూ, కాశ్మీర్ ము ఎందుకు వర్తించదని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నించారు. జమ్మూకాశ్మీర్ లో రాజకీయ కోణంలో అక్కడ అసెంబ్లీ సీట్లు పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు. జమ్మూ,కాశ్మీర్ లో అఖిలపక్ష సమావేశంతో ఈ విషయం తేలిపోయిందని ఆయన తెలిపారు. జమ్మూ,కాశ్మీర్ లో డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారానే అసెంబ్లీ సీట్లు పెంచేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందని వినోద్ కుమార్ అన్నారు. ఒకే దేశం, ఒకే చట్టం అంటే ఇదేనా..? అని ఆయన ప్రశ్నించారు. ఇదెక్కడి న్యాయం అని విమర్శించారు. రాజకీయ కుయుక్తులు పక్కన పెట్టి తెలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ సీట్లు తక్షణమే పెంచాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ సీట్లు 119 నుంచి 153 కు పెంచాలని వినోద్ కుమార్ కేంద్రానికి డిమాండ్ చేశారు. అయితే, నియోజక వర్గాల పునర్విభజన వలన తెలంగాణలో తెరాస కు, ఏపీలో వైసీపీ, తెలుగు దేశం పార్టీలకు ప్రయోజనం చేకురుతుందే తప్ప బీజేపీకి ఒరిగే ప్రయోజనం ఉండదు. అందుకే ఇంతవరకు , కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల డిమాండ్’ను పట్టించుకోలేదు. ఇప్పుడైనా పట్టించుకుంటుందా,అంటే, డౌటే అంటున్నారు.