తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్! ! వైఎస్సారే ఎందుకు టార్గెట్ ?
కృష్ణా జలాల వివాదం, రాజకీయ వివాదంగా మారుతోంది. ఉభయ తెలుగు రాష్రాల మది మరోమారు చిచ్చుపెట్టేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి వెంట ఒకరుగా తెలంగాణ మంత్రులు, ఆంధ్ర పాలకుల మీద ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుమారుడు ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి టార్గెట్’గా చాలా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తునారు. గతాన్ని గుర్తు చేసి మరీ అలానాటి ఆంధ్రా పాలకులను దొంగలు, గజ దొంగలు, రాక్షసులు అంటూ విమర్శల తూటాలు పేలుస్తున్నారు. రెండు మూడు రోజుల క్రితం, వైఎస్ దొంగ, జగన్ గజ దొంగ అంటూ రెచ్చిపోయి తూటాలు పేల్చిన మంత్రి వేముల ప్రశాంత రెడ్డి బాటలోనే మరో మంత్రి శ్రీనివాస గౌడ్ శుక్రవారం తెలంగాణకు అడ్డుపడిన రాజశేఖర్ రెడ్డి ముమ్మాటికీ రాక్షసుడేనని, కుండబద్దలు కొట్టారు.
అంతే కాదు, శ్రీనివాస్ మరోఅడుగు ముందుకేసి, అవును వైఎస్ దొంగ మాత్రమే కాదు, నరరూప రాక్షసుడు అంటూ భగ్గుమన్నారు. తెలంగాణ నీటిని దొంగతనంగా తీసుకుపోతుంటే దొంగ అనక ఏమంటారని,మంత్రి ప్రశ్నించారు. ఇప్పుడు ఆయన కొడుకు, ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా అలాగే నీటిని దోచుకుపోతున్నారని మంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. పీజేఆర్ మరణానికి వైఎస్సార్ కారణమని, సంచలన విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమకారులను జైలుకి పంపిన తెలంగాణ నరరూప రాక్షసుడు వైఎస్ అని మంత్రి మండిపడ్డారు.
తెలంగాణ నేతల విగ్రహాలు ఏపీలో ఉండవు కానీ.. వైఎస్ విగ్రహాలు తెలంగాణలోని ప్రతిజిల్లాలో పెట్టుకున్నారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నోట్లో చక్కెర.. కడుపులో కత్తెర అన్నట్లు ఏపీ నేతలు వ్యవహరిస్తున్నారని మంత్రి ఢిల్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వెనుకబాటు తనానికి, పాలమూరు ప్రజలు వలస పోవడానికి కూడా వైఎస్సారే కారణమని చెప్పారు. పోతిరెడ్డిపాడుకు నీటిని తరలించుకుపోయి.. పాలమూరు జిల్లా ప్రజలకు తాగడానికి గుక్కెడు నీళ్లు ఇవ్వలేని దుర్మార్గుడు వైఎస్సార్ అని మండిపడ్డారు.శ్రీనివాస గౌడ్ ఏపీ సీఎం జగన్ రెడ్డి మీద విమర్శలు గుప్పించారు. ఆయన్నుఊసరవేల్లితో పోల్చడమే కాకుండా, తండ్రికి భిన్నంగా, జగన్ ఉభయ తెలుగు రాష్ట్రాలను ఒకటిగా చూస్తారని అనుకున్నా, ఆయన మాత్రం తండ్రి వైఎస్సార్ దుర్మార్గపు అడుగుజాడల్లోనే నడుస్తున్నారని మండిపడ్డారు.
అయితే, ఒక్కసారిగా తెలంగాణ మంత్రులు కృష్ణా జలాల తాజా వివాదాన్ని, అడ్డు పెట్టుకుని ఇంతగా రెచ్చిపోవడానికి జలవివాదమే కాణమా లేక ఇంకేదైనా కారణం వుందా అంటే, హుజురాబాద్ ఉపఎన్నికలలో సెంటిమెంట్’ను పండించడం కోసమే, తెరాస మంత్రులు వైఎస్సార్, జగన్ రెడ్డి టార్గెట్’గా విమర్శలు చేస్తున్నారని ఇటు కాంగ్రెస్ నాయకులు, అటు వైసీపీ నాయకులు అంటున్నారు. నిజంగా కూడా, ఇంతవరాకు జరిగిన ఉపఎన్నికలకు హుజురాబాద్ ఉప ఎన్నికకు చాలా తేడా ఉందని, ఒకవిధంగా ఇది ఉద్యమ స్పూర్తికి ఉద్యమ అనుకూల వ్యతిరేక వర్గాల మధ్య పోరుగా భావిస్తున్న నేపధ్యంలో ఈ ఉఅప ఎన్నిక అత్యత కీలకం కానుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
వైఎస్ టార్గెట్ గా చేస్తున్న విమర్శలు, తెలంగాణలో పార్టీ రాజన్న రాజ్యం తెస్తానని, సందడి చేస్తున్న వైఎస్ షర్మిలకు మింగుడు పడడం లేదు. కరవ మంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఆమె, అటూ ఇటూ కాని సందిగ్దావస్థను ఎదుర్కుంటున్నారు. అందుకే, ప్రతి విషయంలోనూ స్పందించే షర్మిల తాజా జల వివాదం విషయంలో మౌనంగా ఉండి పోయారని, ఆమెతో కలిసి నడుస్తున్న నేతలు అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. గతంలో, జలవాదాలు విషయంలో, రాజీపడే ప్రశ్నే లేదని, అవసరం అయితే జగనన్నతో అయినా ఫైట్ కు సిద్దమని ప్రకటించిన ఆమె ఇప్పుడుఇలా ‘యు’ టర్న్ తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి కృష్ణా జలాల వివాదం రాజకీయ మంటలు రగల్చడంతో పాటుగా మళ్ళీ మరోమారు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా ఉందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.