యూపీలో నాలుగు స్తంభాలాట..
భారతీయ జనతా పార్టీ, బీజేపీ సారధ్యంలోని ఎన్డీఎ 2024 ఎన్నికల్లో విజయం సాధిస్తుందా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముచ్చటగా మూడవసారి, ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారా? కొవిడ్ సృష్టించిన కల్లోలం నేపధ్యంలో ఈ ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్స్’లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఎప్పుడో మూడేళ్ళ తర్వాత జరిగే ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో, అప్పటి ఏన్నికలపై ఇప్పటి కొవిడ్ ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడే ఊహించడం కొంచెం చాలా కష్టం, రిస్కీ వ్యవహారం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే, మరో ఎనిమిది నెలల్లో జరిగే, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించగలిగితే, 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఒక అంచనాకు రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.అందుకే ఇప్పుడు అందరి దృష్టి యూపీ ఎన్నికలపై ఫోకస్ అయింది.
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, ఇంటా బయటా కూడా సవాళ్ళను ఎదుర్కుంటున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ ప్రభుత్వ ఇమేజిని బాగా డ్యామేజి చేసింది. ముఖ్యమంత్రి ఇమేజి కూడా మసక బారిపోయింది. కొవిడ్ కట్టడిలో ప్రభుత్వ వైఫల్యం, గంగలో తేలిన శవాలు చెప్పకనే చెప్పాయి. అలాగే పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు రేపటి ఎన్నికలపై కొవిడ్ ప్రభావం ఏ మేరకు ఉంటుందో కూడా రుచి చూపించాయి. ఈ నేపధ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) దిద్దుబాటు చర్యలు తీసుకున్నా,అవి ఎంతవరకు పనిచేశాయి, ఫలితాలు ఎలా ఉంటాయి అనేది, ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు.
సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అతివిశ్వాసం, విపక్షాల అనైక్యత బీజేపీకి కలిసిరావచ్చని స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పంచాయతీ ఎన్నికలలో వచ్చిన ఫలితాల ఆధారంగా అఖిలేష్ యాదవ్ ఒక్క సారిగా గుర్రం ఎక్కి కూర్చున్నారు. కాంగ్రెస్, బీస్పీ సహా ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే ఎస్పీ పోటీ చేస్తుందని ప్రకటించారు. బీఎస్పీ బహిష్కృత ఎమ్మెల్యేలు ఇతర నాయకులను తమ పార్టీలో చేర్చుకున్నారు. దీంతో, వచ్చే సంవత్సరం మొదట్లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలలో త్రిముఖ/ చతుర్ముఖ పోటీ తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ప్రతిపక్షాల మధ్య నెలకొన్న అనైక్యత కారణంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో బీజేపీ మరోమారు ఆ రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేస్కోవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గత (2019) లోక్ సభ ఎన్నికలలో ఎస్పీ, బీస్పీ కూటమిగా పోటీచేశాయి. అయితే, రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉండదని ఎస్పీ చీఫ్ అఖిలేష్, బీఎస్పీ అధినాయకురాలు మాయావతి, ప్రకటించారు. అలాగే, 2017 అసెంబ్లీ ఎన్నికలలో కలసి పోటీ చేసిన సమాజవాద్ పార్టీ, కాంగ్రెస్ కూడా తాజాగా తలాక్ చెప్పేసుకున్నాయి.
నిజానికి లోక్ సభ ఎన్నికలలో పరాజయం అనంతరం ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ డీలాపడిపోయాయి. అయితే, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు విపక్షాలలో, ముఖ్యంగా సమాజ్ వాదీ పార్టీలో కొత్త ఆశలు నింపాయి. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి ప్రాంతంలో, యోగి ఆదిత్యనాథ్ స్వస్థలమైన గోరఖపూర్ ప్రాంతంలో బిజెపి వెనుకబడి ఉండడంతో ఫస్ట్ ప్లేసులో నిలిచిన ఎస్పీ రాష్ట్రంలో ఇక అధికారం తమదే అన్న ధీమాతో ఉంది. ఈ నేపధ్యంగానే అఖిలేష్ యాదవ్, సింహం సింగిల్ గానే వస్తుందన్న స్టైల్లో ఒంటరి పోరుకు సిద్దమవున్నారు.
కరోనా సెకండ్ వేవ్ ఉధృతం కావడంపై బీజేపీలోని కొన్ని వర్గాలే ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం, నాయకత్వం మార్పు అనే ఊహాగానాలు షికార్లు చేయడం, బిజెపి అధిష్ఠానం కూడా రాష్ట్రంలోని పరిస్తితులపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో `ప్రభుత్వ వ్యతిరేకత’తో ఆదిత్యనాథ్ ప్రభుత్వంను ఓడించవచ్చని అఖిలేష్ భావిస్తున్నారు. అయితే, దిద్దుబాటు చర్యల్లో భాగంగా అంతర్గత విబేధాలను ప్రిష్కరించుకుంది. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ నాయకత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్నామని ప్రతి అగ్ర నేతలు నిర్ణయించారు. పార్టీలోని వారంతా ఇప్పుడు ఒకే మాటతో ఆయన నాయకత్వంలో ఎన్నికలకు కసరత్తు చేస్తున్నారు. బిజెపి నాయకత్వంలో కనిపిస్తున్న ధీమాతో పాటు, ప్రతిపక్షాలలో ఏర్పడిన చీలిక కారణంగా ఆదిత్యనాథ్ మరోమారు గెలుపొందడం తధ్యం అనే అంచనాలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. మాయావతి మరో గత్యంతరం లేక ఒంటరిగా పోటీ చేస్తున్నా ఆమె ప్రధానంగా ముస్లిం ఓట్లపై కన్నేశారు. వారు మద్దతు ఇస్తే బిజెపిని ఓడిస్తామని బహిరంగంగా ఆమె ప్రకటించారు.
మరో వంక కాంగ్రెస్, ఎస్పీ, బీస్పీ పార్టీల మధ్య ముస్లిం ఓటు చీలిపోతే అది అల్టిమేట్’గా బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందాని పరిశీలకులు పేర్కొన్నారు. అయితే, ఆ ముగ్గురే కాకుండా నాలుగో భాగస్వామి, ముస్లిం ఓటు హక్కు దారు ఎంఐఎం 100 సీట్లలో పోటీకి సిద్దమవుతోంది. అదే జరిగితే, బీజేపీ మరో మారు అధికారంలోకి వస్తుందని ఒక అంచనాకు రావచ్చని రాజకీయ పండితులు చెపుతున్నారు. అలాగే యూపీలో గెలిస్తే, ఆ ప్రభావంతో ఆ తర్వాత రెండేళ్లకు జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ హట్రిక్ సాధ్యమవుతుందని అంటున్నారు. అయితే, ఇందులో చాలా అయితే గియితే (ఇఫ్స్ అండ్ బట్స్) ఉన్నాయి. ఇప్పటికైతే, యూపీలో చతుర్ముఖ పోరు తధ్యంగా కనిపిస్తోంది. ఫలితం ఎలా ఉంటుందో.. అప్పుడే చెప్పేలా లేదు.