కేసీఆర్ డ్రామాలో పావుగా జగన్! జల వివాదంలో ట్విస్టులు..
posted on Jun 26, 2021 @ 3:29PM
తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న జల వివాదంలో రోజుకో కీలక పరిణామం వెలుగు చూస్తోంది. ప్రాజెక్టులు అపాలని ఏపీ ప్రభుత్వానికి కృష్ణా రివర్జ్ బోర్డు లేఖ రాసినా.. వివాదం చల్లారడం లేదు. తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నేతలు దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాల అజయ్ కుమార్ తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కృష్ణా నీళ్లను అక్రమంగా తరలించుకుపోయిన దొంగ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటూ మళ్లీ కాక రేపారు. అయితే గులాబీ నేతలు వైఎస్సార్ టార్గెట్ గా విరుచుకుపడుతున్నా వైసీపీ నేతలు కూల్ గానే ఉండటం, సీఎం జగన్ శిబిరం నుంచి వేగంగా యాక్షన్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నీళ్ల పేరుతో సెంటిమెంట్ రగిలిస్తూ.. రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
తెలంగాణలో జనాగ్రహం ఎదుర్కొంటున్న సీఎం కేసీఆర్.. రాజకీయంగా లబ్ది పొందటానికే కృష్ణ జలాలపై వివాదం చేస్తున్నారని ఏపీ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీని అడ్డుకోవడం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ డ్రామా ఆడుతున్నారని ఏపీ బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఆడుతున్న డ్రామాలో ఏపీ సీఎం పావుగా మారారన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు.కృష్ణా జలాల వాటాల విషయంలో వివాదమే లేదన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషిస్తూ అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించిందని, కేంద్రమే చొరవ తీసుకుందని ఆయన గుర్తుచేశారు. ఈ విషయాన్ని ట్రిబ్యూనల్ తీర్పు స్పష్టంగా చెప్పిందన్నారు.
తెలంగాణ మంత్రులు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డిఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ మంత్రులు ఉపయోగించే భాష సరిగా లేదన్నారు. రాయలసీమ ప్రజలకు సాగు నీరే కాదు.. తాగు నీరు కూడా లేదని స్వయంగా కేసీఆరే అన్నారని, అలాంటి ప్రాంతానికి నీటినిచ్చే ప్రాజెక్టులను ఇప్పుడు అడ్డుకోవడం కేవలం రాజకీయం కోసమేనని ఆరోపించారు. తెలంగాణ ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఈ కుట్రలో సూత్రధారులు, పాత్రధారులుగా తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఐకమత్యంగా, క్షేమంగా ఉండాలన్నదే బీజేపీ వైఖరి అని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ నిర్మించే ప్రాజెక్టులను అక్రమ ప్రాజెక్టులు అని మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్‌కు, తెలంగాణ మంత్రులకు లేదన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. పాలమూరు లిఫ్ట్, డిండి ప్రాజెక్టులు అక్రమంగా నిర్మించలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో పాలమూరు జిల్లా కూడా వెనుకబడింది కదా అని ఏపీ నేతలు వీటిపై పెద్దగా మాట్లాడలేదని పేర్కొన్నారు. సమస్యను రెండు రాష్ట్రాల జలవివాదంగా చూడకుండా రాయలసీమ ప్రజల నీటికష్టాలుగా చూడాలని హితవుచెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టులో రాయలసీమ రైతులు భూములు కోల్పోయారని, కానీ ప్రాజెక్టు తెలంగాణకే ఎక్కువ ఉపయోగపడుతోందన్నారు విష్ణువర్ధన్ రెడ్డి.