ఏడేళ్ళైనా ఇంకా అదే ఏడుపు.. ఓట్ల కోసం చిల్లర ఎత్తులు!
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి న్యాయమే జరిగిందో, అన్యాయమే జరిగిందో, అది ఇప్పుడు అప్రస్తుతం.ఆ చర్చ ఇప్పుడు అనవసరం. రాష్ట్రం విడిపోయి ఏడేళ్ళు గడిచి పోయాయి. ఈ ఏడేళ్ళుగానూ, తెరాసనే అధికారంలో వుంది. కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఏడేళ్ళలో అద్భుతాలు సృష్టించామని, రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తోందని, ఆయనే స్వయంగా చాటింపు వేసుకున్నారు. ఇదీ అదీ అని కాదు, అన్ని రంగాలలో అభివృద్ధి పరుగులు తీస్తోందని ఆయనే చెప్పుకుంటారు. ముఖ్యంగా సాగునీటి రంగంలో, కాళేశ్వరం సహా అనేక ప్రాజెక్టులు కట్టేశాం, సాగు నీటి సమస్య తీరిపోయింది, ఇప్పుడు దేశంలోనే ధాన్యం పంటలో పంజాబ్, ఏపీని దాటేసే నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాం,అంటారు.అలాంటప్పుడు,ఇంకా ఈ జల వివాదాలు, ఎక్కువ తక్కువ మాటలు ఎందుకని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కోసం ఎన్ని వేసాహాలు అయిన వేసేందుకు తండ్రీ కొడుకులు సిద్ధమని జనం ఛీ కొడుతున్నారు.
ఆంధ్ర పాలకులను తలచుకోకుండా ఆయనకు పూట గడవదు. ఆంధ్ర ప్రజల ప్రస్తావన లేకుండా, తెలంగాణ సెంటిమెంట్’ను జత చేయకుండా ఆయన ఎన్నికల నావ అంగుళం కదలదు. ఎంత సేపు ఆంద్రోళ్ళు, ఆంధ్రపాలకులు అన్యాయం, దోపిడీ అంటూ గొంతు చించుకుని చిందులేయడం ద్వారా తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టి ప్రయోజనం పొందే ప్రయత్నమే చేస్తున్నారు. ఒక రకమైన భావదారిద్ర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే ఏ ఎండకా గొడుగు, అన్నట్లుగా ఎన్నిక ఎన్నికకు తెరాస స్వరం సిగ్గు విడిచి మారిపోతుంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంద్రోళ్ళు మంచోళ్ళు, వారి కాల్లో ముల్లు గుచ్చుకుంటే, ఈయన గారు తమ పంటితో తీస్తారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ఇస్తారు అవసరం అయితే, శ్రీ కేటీఆర్ స్వయంగా విశాఖ వెళ్లి దీక్ష చేస్తారు. ఇదంతా ఎంతవరకంటే, జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసే వరకు. ఆ తర్వాత, ఆంద్రోడు ఆంద్రోడే, లంకలో నివసించే వాళ్ళంతా రాక్షసులే అంటూ విద్వేషం, విషం షరా మాములుగా తెరపి కొస్తుంది. ఇక ఆ నోటికి హద్దు అదుపు ఉండదని, హైదరాబాద్ ఆంద్రోళ్ళు అంటున్నారు. ఇదీ అందరికీ తెలిసిన తెరాస, కేసీఆర్ నైజం . సెంటిమెంట్’ను అడ్డుపెట్టుకుని తెలంగాణ ప్రజలను మోసం చేయడమే ఆయన నైజం. ఇప్పుడు కాదు, ఉద్యమ కాలంలోనో ఇదే తీరు. సెంటిమెంట్’ను ఏటీఎం కార్డులా ఉపయోగించుకోవడంలో కేసీఆర్ సిద్ధహస్తులు. అందుకే ఇప్పుడు, హుజురాబాద్ ఉపఎన్నిక కోసం తెరాస మంత్రులు రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరున సెంటిమెంట్స్’ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, అన్ని సందర్భాలలో అందరినీ మోసం చేయడం ఎంతటి వారికైనామ చివరకు ఆ విద్యలో ఆరితేరిన మహా మాయగాడు కేసీఆర్’కే అయినా సాధ్యం కాదని తెలంగాణ ప్రజలే అంటున్నారు.
నిజానికి, తెలంగాణా సెంటిమెంట్’ను కేసీఆర్, తెరాస ఇప్పటికే చాలా ఎక్కువగా, చివరకు ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్’ను కూడా దాటి ఉపయోగించుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్’ను అడ్డుపెట్టుకునే, రాజకీయ పునరేకీకరణ పేరిట ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకున్నారు. కారెక్కించి, సంతలో పశువులను తోలుకు పోయినట్లు తోలుకు పోయారు. ప్రతి ఎన్నికల్లోనో సెంటిమెంట్’ను ఉపయోగించుకుంటున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్’తో పొత్తు పెట్టుకుని పోటీచేసిన తెలుగు దేశం పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును బూచిగా చూపించి, సెంటిమెంట్ పండించారు.
ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికల కోసం కృష్ణా జలాల వివాదాన్ని తెచ్చి సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ప్రపంచంలో ఎక్కడైనా ఎగువ రాష్ట్రాలు జల దోపిడీకి పాల్పడతాయి, దిగువ రాష్ట్రాలు అన్యాయయానికి గురవుతాయి. కానీ, ఇక్కడ అందుకు విరుద్ధంగా దిగువ రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ జల దోపిడీకి పాల్పడుతోందనే అర్థం లేని వితండ వాదాన్ని వినిపిస్తున్నారు. ఒక విధంగా కేసీఆర్,తనను తానూ మోసం చేసుకుంటూ, ఉభయ తెలుగు రాష్ట్త్రాల ప్రజలను ఫూల్స్ చేస్తున్నాను అనుకుంటున్నారు. అయితే, అది అన్ని సందర్భాలలో సాధ్యం కాదని, సామాన్య జనం కూడా గుర్తించారు.
ఇవ్వన్నీ ఒకెత్తు అయితే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎపిసోడ్ లో చంద్రబాబు పేరు తీసుకుని,ఆయనే రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించారని మోకాలుకు బోడిగుండుకు ముడివేసి,మళ్ళీ మరో సారి తెలుగు దేశం పార్టీని, చంద్రబాబు నాయుడును బూచిగా చూపించే ఎత్తుగడ నడిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి తెలుగు దేశం పార్టీ నుంచి వచ్చారు కాబట్టి, ఆయనకు చంద్రబాబుతో సంబంధాలు, ఆంధ్రా వాసనలు ఉన్నాయని అనుకుంటే, కేసీఆర్ తో సహా ఆయన మంత్రి వర్గంలో మూడొంతుల మంది వాళ్ళే కదా ... ఎన్టీఅర్, చంద్రబాబు పుణ్యానే కదా ఈరోజు .. ఈ స్థితిలో ఉన్నారు. ఏమైనా ... రాష్ట్రం విడిపోయి ఏడేళ్ళు అయినా ఇంకా అదే ఏడుపు ఏడవడం ... కేసీఆర్ దివాలా కోరు రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తుందనేది నేటి జనవాక్యం.