ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు? లాభమెవరికో..?
posted on Jun 26, 2021 @ 6:49PM
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గత గురువారం, జమ్మూ కశ్మీర్ రాజకీయ పార్టీల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జమ్మూ కశ్మీర్’ కు రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆ రాష్ట్రంలో నియోజక వర్గాల పునర్విభజ అంశాన్ని ప్రధానంగా చర్చించారు. గత సంవత్సరం జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన సమయంలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి త్వరలోనే తిరిగి రాష్ట్ర ప్రతిపత్తిని కలిపిస్తామని ప్రకటించింది. అదీ గాక దేశ సరిహద్దులలో సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ రాజకీయ పార్టీల నాయకులను విశ్వాసంలోకి తీసుకుని సమావేశం నిర్వహించింది. ముఖ్యంగా, నియోజక వర్గాల పునర్విభజనకు కేంద్రం ఏర్పాటు చేసిన రంజన్ ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని డీలిమిటేషన్ కమిషన్ భేటీలకు కశ్మీర్ రాజకీయపక్షాలేవీ ఇంతకాలమూ హాజరుకాలేదు.ఈ నేపద్యంలో ప్రాంతీయ పార్టీలను ఒప్పించేందుకు ప్రదాని స్వయంగా సమావేశం ఏర్పాటు చేశారు.
నిజానికి, ఈ సమావేశం ప్రధానంగా జమ్మూ కశ్మీర్’ లో నియోజక వర్గాల పునర్విభజనకు సంబందించిన అంశాలను మాత్రమే చర్చించింది. అయితే, ఇప్పుడు తాజాగా, జమ్మూ కశ్మీర్’ తో పాటుగా, రాష్ట్ర విభజన నేపధ్యంగా, విభజనకు ముందు నుంచి వినిపిస్తున్న, తెలుగు రాష్ట్రాలలో నియోజక వర్గాల పునర్విభజన అంశం మరో మారు తెర మీదకు వచ్చింది. ఈ పాత ప్రతిపాదనని పరిగణలోకి తీసుకుని కేంద్ర జమ్మూ కశ్మీర్’ తో పాటుగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ నియోజక వర్గాల పునర్విభజన చేట్టాలని కేంద్ర ప్రభుత్వం అలోచిస్తునట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే, ఇందుకు సంబంధించి అధికారిక సమాచారం ఏదీ లేదు.రాష్ట్ర బీజేపీ నాయకులూ కూడా అలాంటిది ఏమీ ఉండదనే అంటున్నారు.
అదలా ఉంటే, నియోజక వర్గాల పునర్విజన కేవలం పరిపాలనా పరమైన నిర్ణయం మాత్రమే కాదు, రాజకీయ ప్రయోజనాల ఆధారంగా తీసుకునే రాజకీయ నిర్ణయం. అదీ గాక ఒకసారి తేనే తుట్టెను కదిలిస్తే, ఇక అది ఎక్కడికి వెళుతుందో తెలియదు. అందుకే గతంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలు, నియోజక వర్గాల పునర్విభజన డిమాండ్ చేసిన ప్రతి సందర్భంలోనూ, కేంద్ర ప్రభుత్వం పెద్దలు ఆ ప్రస్తావనే లేదని కుండబద్దలు కొట్టారు. నిజానికి, తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో నియోజక వర్గాల పునర్విభజన జరిగి, అసెంబ్లీ, లోక్ సభ స్థానాల సంఖ్య పెరిగితే, దాని వలన అధికార తెరాసకే ప్రయోజనం చేకూరుతుంది. గడచిన ఏడు సంవత్సరాలలో ఒక్క బీజేపీ, తెరాస మిత్ర పక్షం ఎంఐఎం మినహా మిగిలిన అన్ని పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు చాలా వరకు కారెక్కారు. ప్రస్తుత అసెంబ్లీలో తెలుగు దేశం పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతే, కాంగ్రెస్ టిక్కెట్ మీద గెలిచిన 19 మందిలో 12 మంది అధికార తెరాసలో చేరారు. సీఎల్పీనే తెరాస లో విలీనం చేశారు. రేపో మాపో మిగిలిన వారిలో మరి కొందరు తెరాస గూటికి చేరండ ఖాయంగా కలిపిస్తోంది సో .. కారు ఓవర్ లోడ్ అయింది. తెరాసలో సీట్ల పంపకం కష్టంగా మారింది. కాబట్టి,నియోజక వర్గాల సంఖ్య పెరిగితే తెరాసకు ప్రయోజనం చేకురుతుంది. అలాగే, ఏపీ లోనూ నియోజక వర్గాల పునర్విభజన వలన రాష్ట్ర రాజకీయాలలో ప్రధాన ప్రత్యర్ధులుగా ఉన్న తెలుగు దేశం, వైసీపీలకు ప్రయోజనం చేకూరుతుందే కానీ, ఆటలో అరటి పండు కూడా కాని బీజేపీకి వచ్చేది లేదు పోయేది లేదు.సో ..ఇలాంటి పరిస్థితిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలలో నియోజక వర్గాల పునర్విభజనకు ఎంతవరకు ఓకే అంటుందో .. అనుమానమే.
నిజానికి, జమ్మూ కశ్మీర్ లో నియోజక వర్గాల పునర్విభజనకు మోడీ ప్రభుత్వం మొగ్గు చూపడానికి కూడా రాజకీయ ప్రయోజనాలే కారణం. ప్రస్తుతం బీజేపీకి అనుకులంగా ఉండే జమ్మూ ప్రాంతంలో నియోజక వర్గాల సంఖ్య తక్కువగా, ప్రత్యర్ధి పార్టీల ప్రాబల్యం అధికంగా ఉన్న కశ్మీర్ ప్రాంతంలో ఎక్కువగా ఉంది. అందుకే, నియోజక వర్గాల పునర్విభజనకు బీజేపే తొందర పడుతోంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఆ పరిస్థితి లేదు . వ్రతం చెడ్డా ఫలితం దక్కే పరిస్థితి లేదు . సో.. ఎప్పటిలానే ఇప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్విభజన ...ఊహాగానం మాత్రమే కావచ్చును.