కేంద్ర మంత్రి వర్గంలోకి జేడీయూ!
కేంద్ర మంత్రివర్గ విస్తరణ లేదా పునః వ్యవస్థీకరణ ఎప్పుడు ఉటుంది? ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఈ ప్రశ్న చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కొద్ది రోజుల క్రితం వరకు జోరుగు సాగిన ఊహాగానాలు కూడా కొంత సర్దు కున్నాయి. అదలా ఉంటే గతంలో పిలిచి బెర్తు ఇస్తామంటే అలిగి వద్దు పొమ్మన్న జనతాదళ్ (యు), ఇప్పుడు పిలిస్తే చాలు ఎగిరి గంతేసేందుకు సిద్ధంగా ఉంది. అంతే కాదు మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందా, అని వేయి కళ్ళతో ఎదురు చూస్తోంది. ఎన్డీఎ వరసగా రెండవ సారి, 2019లో ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలోనే, ప్రధాని మోడీ, మిత్రపక్షం జేడీ(యు)ను మంత్రివర్గంలోకి చేరమని కోరారు. అయితే, జనతాదళ్(యు) నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంటుందని స్పష్టం చేయడంతో బేరం బెడిసి కొట్టింది. ఒక్కటే బెర్త్ అయితే వద్దుపొమ్మని, జనతా దళ్(యు) అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి అలక పానుపు ఎక్కారు.
అయితే ఇప్పుడు దేశంలో, రాష్ట్రంలో శరవేగంగా మారుతున్నరాజకీయ సమీకరణల నేపధ్యంలో, జనతా దళ్(యు) కేంద్ర మంత్రివర్గంలో చేరేందుకు ఉత్సాహం చూపుతోంది. మరోవంక బీజేపీ కూడా, త్వరలో జరగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గ విస్తరణలో మిత్రపక్షాలకు పెద్ద పీట వేయాలని నిర్ణయానికి వచ్చింది. అందులోనూ, బీహార్’ను అనుకుని ఉన్న యూపీలోని పూర్వాంచల్ ప్రాంతంలో పటేల్ /కుర్మీ తెగలకు చెందిన ఓటర్లపై నితీష్ కుమార్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ దృష్టా కూడా బీజేపీ నితీష్ కుమార్ తో బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి వర్గంలో ఒకటి కంటే ఎక్కువ బెర్తులే సిద్దం చేస్తోందని అంటున్నారు.
కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉహాగానాలు షికార్లు చేస్తన్న సమయంలోనే, సోమవారం నితీష్ కుమార్ ఢిల్లీ వెళ్ళడంతో జనతాదళ్ (యు), కేంద్ర మంత్రివర్గంలో చేరడం ఖయమైపోయినట్లేనని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వినవస్తోంది. ఈ ఉహగానాలకు బలాన్నిచ్చే విధంగా, జనతాదళ్ (యు) జాతీయ అధ్యక్షుడు ఆర్సీపీ సింగ్, బీహార్ లో మా రెండు పార్టీలు (జనతాదళ్ (యు),బీజేపీ) అధికారాన్ని పంచుకుంటున్నాయి, కాబట్టి, కేంద్ర మంత్రి వర్గంలో జనతాదళ్ (యు), చేరినా ఆశ్చర్య పోనవసరం లేదని అన్నారు. అయితే నితీష్ కుమార్ ఢిల్లీ పర్యటనకు, మంత్రివర్గ విస్తరణపై జరుగుతున్న ఉహాగానాలకు సంబంధం లేదని అయన అన్నారనుకోండి, అది వేరే విషయం.ప్రస్తుతం జనతా దళ్ (యు)కు లోక్ సభలో 16మంది రాజ్య సభలో ఐదుగురు సభ్యులున్నారు.
ఇటేవల లోక్ జన శక్తి (ఎల్జీపీ) చిలీక వచ్చిన నేపధ్యంలో, చీలిక వర్గం నేత పశుపతి పరసకు మంత్రి వర్గంలో స్థానం లభించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే, బీహార్ నుంచి బీజేపీ కోటాలో, రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీకి అవకాశం ఉంటుందని అంటున్నారు.అదే విధంగా జనత దళ్ జాతీయ అద్యక్షుడు ఆర్సీపీ సింగ్ కూడా కేంద్ర మంత్రివర్గంలో బెర్త్ కన్ఫరం అయిందని అంటున్నారు. అయితే, 2017 నుంచి ఇదేమాట వింటున్నానని , సింగ్ అన్నారు. అయితే ఇంతకీ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడుంటుంది, అనేది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. అది అయితేనే గానీ, ఊహాగానాలు చల్లారావు.