కేసీఆర్ కేండిడేట్ ఎవరు? హుజురాబాద్ అభ్యర్థి ఆయనేనా?
అన్ని పార్టీలు, మరీ ముఖ్యంగా అధికార తెరాస, అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నికలో ఆ పార్టీ అభ్యర్ధి ఎవరు? ఇప్పుడు ఈ ప్రశ్న రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినవస్తోంది. ఈస్థానం నుంచి వరసగా గెలుస్తూ వచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. బీజేపీలో చేరిన ఈటల ఆ పార్టీ అభ్యర్ధిగా బరిలో దిగుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగాపోటీ చేసిన కౌశిక్ రెడ్డికే మళ్ళీ పార్టీ టికెట్ లభించే అవకాశం లేక పోలేదని అంటున్నారు. అయితే, టీపీసీసీ పగ్గాలు చేతుల మారిన నేపధ్యంలో, పీసీసీ కొత్త చీఫ్ రేవంత్ రెడ్డి కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
కౌశిక్ రెడ్డి గత ఎన్నికల్లో ఈటలకు గట్టి పోటీ ఇచ్చారు. ఈటలకు, ఒక లక్షా 4 వేల 840 (59.34 శాతం) ఓట్లు వస్తే, కౌశిక్ రెడ్డికి 61 వేల 121 (35 శాతం) ఓట్లు వచ్చాయి. ఈటల 43,719 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ద్విముఖ పోటీలో తెరాస అభ్యర్ధిగా పోటీ చేసిన ఈటలకు గట్టి పోటీ ఇచ్చిన కౌశిక్ రెడ్డి రేపటి త్రిముఖ పోటీలో కాంగ్రెస్ పార్టీకి మంచి అభ్యర్ధి అవుతారు. ఆయన గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అయితే, రాజకీయ లెక్కలు, ఎప్పుడు ఒకలా ఉండవు. అన్ని సందర్భాలలో వన్ ప్లస్ వన్ రెండు కాదు, అలాగే, వన్ బై టూ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ కాదు. ఎన్నికల ఇష్యూస్ ‘ను బట్టి ఓటింగ్ సరళీ, స్వభావం మారుతూ ఉంటుంది . ఓటర్ల ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయి. అందుకే ఏ ఎన్నికకు ఆ ఎన్నిక ప్రత్యేకంగా ఉంటుంది. ఫలితాలు అంతే ..
అదలా ఉంటే, కౌశిక్ రెడ్డికి మాజీ పీసీసీ చీఫ్’తో ఉన్న చుట్టరికం, అలాగే, ఇటీవల ఓ వేడుకల్లో ఆయన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్’ను కలవడంతో ఆయన టికెట్ చుట్టూ అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. నిజానికి కౌశిక్ రెడ్డి, మంత్రి కేటీఆర్’ను ఉద్దేసపూర్వకంగానే కలిశారో లేక యాదృచ్చికంగా అలా జరిగిందో ఏమో గానీ,ఆయన తెరాసలో చేరుతున్నారు, హుజూరాబాద్ నుంచి తెరాస అభ్యర్ధిగా పోటీ చేస్తారు అనే పుకార్లు వినిపించాయి. దీంతో, ఆయన విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారిందని అంటున్నారు.నిజానికి ఒక దశలో కౌశిక్ రెడ్డి కూడా గోడదూకే ఆలోచన చేసినట్లు సమాచారం. అయితే, రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఆయన ఆలోచన మారింది. అందుకే, ఆయన రేవంత్’నుకలిసి తమ మనసులోని మాటను అయన ముందు ఉంచినట్లు వార్తలొచ్చాయి. నిజానికి, ఇప్పడు పరిస్థితులో ఉప ఎన్నికల్లో గెలుపు కంటే, గెలిచిన ఎమ్మెల్యే చేజారి పోకుండా చూసుకోవడం పీసీసి అధ్యక్షుడి ముందున్న, ప్రధాన సవాల్’గా పార్టీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన 19 మందోలో 12 మంది పార్టీకి జెల్లకొట్టి కారెక్కి తుర్రుమన్నారు. కాబట్టి, కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్ పొడ కూడా గిట్టని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్’ను బరిలో దింపే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక అసలు విషయంలోకి వస్తే, అధికార తెరాసకు అభ్యర్ధి దొరకడం లేదని అంటున్నారు. ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు పోసీ, సొంత పార్టీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులను కొనుకున్నారన్న అపవాదును/అవమానాన్ని మోస్తున్న తెరాస, ఈటలకు ధీటుగా నిలిచే సామర్ధ్యం కోసం దిక్కులు చూడవలసి రావడం మరింత అవమానకరంగా మారిందని అంటున్నారు. అయితే, వ్యూహాత్మకంగా దుగులు వేయడంలో ఆయనకు ఆయనే పోటీగా నిలిచే కేసీఆర్, ఎలాంటి వ్యూహంలో ఉన్నారో ఎవరికీ తెలియదని అంటున్నారు. ఇటీవల జరిగిన హైదరబాద్ –రంగారెడ్డి – మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో, చివరి వరకు మౌనంగా ఉంటూ వచ్చిన కేసీఆర్ ఆఖరి క్షణంలో పీవీ కుమార్తె వాణీ కుమారిని పార్టీ అభ్యర్ధిగా ప్రకటించి, ప్రత్యర్ధులను చిత్తు చేశారు. ఇప్పడు కూడా అదే వ్యూహంతో ఉన్నారని, ఎవరూ ఉహించని బ్లాక్ హార్స్, పార్టీ అభ్యర్ధి అయినా ఆశ్చర్య పోనవసరం లేదని పార్టీ వర్గాల్లోనే కాదు, తెలంగాణ భవన్ వేలుపుల రాజకీయ వర్గాల్లో వినవస్తోంది.
అయితే, ప్రస్తుతానికి అయితే, మాజీ ఎంపీ వినోద్ మొదలు మంత్రి హరీష్ వరకు చాలా మంది పేర్లే షికారు చేస్తున్నాయి. అలాగే, సామాజిక సమీకరణాలను కూడా బేరీజు వేస్తున్నట్లు తెలుస్తోంది.ఈటలకు సొంత ముదిరాజ్ వర్గంతో పాటుగా, రెడ్డి సామాజిక వర్గం (ఆయన భార్య రెడ్డి సామాజిక వర్గానికి చెందినా వారు), అగ్ర కులాలు ( బీజేపీ అనుకూల ఓటు) కాకుండా .. ఇతర సామాజిక వర్గాలకు, ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధిని కేసీఆర్ బరిలో డింప వచ్చని అంటున్నారు. ఇటీవల వరంగల్ పర్యటనలో, అంత వరకు కూరలో కరివేపాకులా పక్కన పెట్టిన కడియం ఇంటికి వెళ్లి విందు ఆరగించడం, అలాగే, ఎస్సీ సాధికారిత పేరున, కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీలలోని ఎస్సీ నేతలను దగ్గర చేయడం, ఎస్సీ సాధికారిత ప్రకటన.. ఈ వ్యూహ రచనలో భాగమేనా అన్న మాట కూడా పార్టీ వర్గాల్లో వినవస్తోంది. ఈమధ్య కాలంలో ప్రభుత్వం దళిత సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. దళితులకు ప్రత్యేక నిధుల కేటాయింపు మొదలుకొని ఇటీవల దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్ విషయంలో సీఎం స్పందన, ఇతర పరిణామాలు హుజూరాబాద్‌లో కొత్త రాజకీయ సమీకరణాలపై ఆసక్తిని రేపుతోంది. ఈ నేపధ్యంలో తెలుగుదేశం సీనియర్ నేత, దివంగత మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి సతీమణి ముద్దసాని మాలతి పేరు ప్రముఖంగా వినవస్తోంది. అయితే, చివరకు, అందరి ఉహాలను తల్లకిందులు చేయడం, కేసీఆర్ మార్క్ రాజకీయం. సో.. చివరకు, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా హరీష్ రావు అయినా పార్టీ అభ్యర్ధి కావచ్చునని అంటున్నారు. ఏమో.. కేసీఆర్ మనసులో ఏముందో.. ఆయనకే తెలియదు. సో .. ఏదైనా జరగ వచ్చును.