పేరు గొప్ప.. పనితీరు చెత్త.. ఏపీ I&PRపై విమర్శలు..
posted on Jul 3, 2021 @ 9:52PM
ఏపీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ I&PR. ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్. అత్యంత కీలకమైన విభాగం. ప్రభుత్వాన్ని ప్రజలకు అనుసంధానించే బృహత్తర కార్యక్రమం. ప్రభుత్వం ఏం చేసింది.. ఏం చేస్తోంది.. ఏం చేయబోతోంది.. అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయడమే ఈ శాఖ పని. కానీ ఏపీ ప్రభుత్వ I&PR శాఖ పని తీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. చెయ్యాల్సిన పనులను పక్కనపెట్టేసి.. కులాసాగా అధికారులు సేదతీరుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఏ ప్రభుత్వానికైనా I&PR డిపార్ట్‌మెంట్ చాలా కీలకం. కమిషనర్ ఆధ్వర్యంలో అనేక మంది అధికారులు, సిబ్బంది, ఇతర వనరులతో ఏపీ I&PR కు ఘనమైన నెట్‌వర్క్ ఉంది. అయినా, పనితీరు మాత్రం పేలవంగా ఉందనే విమర్శ వినిపిస్తోంది. ఇక, ఏపీ I&PR చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు 18 లక్షల వరకూ ఉన్నాయని తెలుస్తోంది. చాలా కాలంగా బిల్లులు కట్టకపోవడంతో.. I&PRకు ఇంటర్నెట్ కనెక్షన్ కట్ చేశారట. టెలిఫోన్ బిల్లులూ చెల్లించకపోవడంతో.. అవుట్‌గోయింగ్ కట్ అయిందట. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా?
ఇక, ఏకంగా I&PR కమిషనర్ పనితీరు మీదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌లో ఓ చిన్న స్కూల్ నడిపే.. కమిషనర్ గారి మామ ఇటీవల చనిపోతే.. గొప్ప విద్యావేత్త మరణించినట్టుగా.. తన పరపతి ఉపయోగించి మీడియాలో తెగ ప్రచారం ఇప్పించుకున్నారంటూ ఆయనపై విమర్శలు వస్తున్నాయి. జర్నలిస్టుల అక్రిడేషన్లు ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టడం.. చెత్త రూల్స్ పెట్టి జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు రాకుండా చేయడం.. ఆయన ఘనకార్యమేనంటూ ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వ పథకాల ప్రచార బాధ్యత I&PR నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వ విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించడం.. అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల చెంతకు చేర్చడం I&PR ముఖ్య కర్తవ్యం. మీడియా కో-ఆర్డినేషన్‌తో ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. చేయాల్సిన పనులు చాలానే ఉన్నా.. చేస్తున్న పనులు మాత్రం నామమాత్రం. ఏపీలో నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. వాటి ప్రచార బాధ్యతలను సాక్షి మీడియానే తమ భుజాల మీద వేసుకుంది కానీ.. ప్రభుత్వ విభాగమైన I&PR అసలేమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. సీఎం జగన్ ప్రసంగాలను I&PR పోర్టల్‌లో ప్రచారం చేయడం మినహా.. తమవంతుగా పథకాల ప్రమోషన్‌కు ఎలాంటి ప్రత్యేక కథనాలు క్రియేట్ చేయడం లేదని చెబుతున్నారు. అదే, సాక్షి మీడియాలోనైతే.. ఉన్నది లేనట్టుగా.. విషయాన్ని హైప్ చేసి చూపిస్తుంటే.. I&PR మాత్రం ఉన్న విషయాన్నే సరిగ్గా ప్రమోట్ చేయడం లేదని ఆ శాఖ పనితీరుపై ప్రభుత్వ వర్గాలే పెదవి విరుస్తున్నారు.
I&PRకు పెద్ద నెట్‌వర్కే ఉంది. ముఖ్యమంత్రితో సహా మంత్రులందరికీ ఈ శాఖ తరఫున పీఆర్వోలు ఉన్నారు. మంత్రుల నిర్ణయాలను, కార్యక్రమాలు ఎప్పటికప్పుడు మీడియాకు, ప్రజలకు తెలియ చేయాల్సి బాధ్యత పీఆర్వోలదే. కానీ, ప్రజలు ఎవరికైనా తెలుసా ఏ మంత్రి ఏ సమీక్ష నిర్వహించారో? ఏ మంత్రి ఛాంబర్ నుంచి ఎలాంటి ఉత్తర్వులు రిలీజ్ అయ్యాయో? మంత్రుల పనితీరుపై ఎలాంటి సమాచారం బయటకు రానేరాకపోవడానికి కారణం.. ఆ మంత్రులు పని చేయడం లేదనా? లేక, I&PR విభాగం పనితీరు బాగాలేదనా? అనే అనుమానం కలగక మానదు.
ఇక, ప్రతీ ప్రభుత్వ విభాగంలోనూ I&PR తరఫున పీఆర్వోలు ఉంటారు. వాళ్లు ఆయా శాఖల పనితీరును, పాలసీలను ప్రచారం చేయాలి. మరి, ప్రభుత్వ శాఖల అప్‌డేట్స్ ఏవైనా పబ్లిక్‌కు తెలుస్తున్నాయా? ఏ డిపార్ట్‌మెంట్ నుంచి ఏ జీవో వచ్చిందనే సమాచారం ప్రజలకు చేరుతుందా? ఏ శాఖ ఎన్ని నిధులు ఖర్చు చేసిందో.. ఏ విభాగం నుంచి ఏయే పనులు అయ్యాయనే దానిపై.. ఏపీ ప్రజలకు సమాచారం ఇవ్వడంలో I&PR దారుణంగా విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి. పనంతా సాక్షి మీడియా మీద తోసేసి.. ఈ ప్రభుత్వ శాఖ చేతులు ముడుచుకు కూర్చుందనే విమర్శలు ఉన్నాయి. ఇలా ఏపీ I&PR ను భ్రష్టుపట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి.