కాపు వర్సెస్ గాలి.. సూసైడ్ అటెంప్ట్‌తో కలకలం..
posted on Jul 4, 2021 @ 1:44PM
అక్రమార్కులంతా ఒకటే బ్యాచ్. ఎక్కడున్నా అరాచకవాదులంతా మిలాఖత్. పార్టీలు వేరైనా.. ప్రాంతాలు వేరైనా.. ఫ్రెండ్‌ఫిప్ ఫ్రెండ్‌ఫిపే. అక్రమ ఐరన్ మైనింగ్ సామ్రాజ్యానికి రారాజు గాలి జనార్థన్‌రెడ్డి కుటుంబం అనే ఆరోపణ ఉంది. అక్రమ సంపాదనకు కేరాఫ్ వైఎస్ కుటుంబమనే విమర్శ ఉంది. యధారాజా తథా ప్రజా అన్నట్టు.. జగన్‌లానే వైసీపీ నేతలూ పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆ విషయం పక్కన పెడితే.. తాజాగా జరిగిన ఓ వివాదం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. బీజేపీ బళ్లారి ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి తనయుడికి.. వైసీపీ రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కుమారుడికి జరిగిన గొడవ.. సూసైడ్ అటెంప్ట్‌కు దారి తీయడం కలకలం రేపుతోంది.
రాష్ట్ర ప్రభుత్వ విప్, అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తనయుడు కాపు ప్రవీణ్‌కుమార్ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. గాలి కుటుంబంతో కాపు కుటుంబానికి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బళ్లారి సిటీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి తనయుడు శ్రవణ్‌కుమార్‌రెడ్డితో కలిసి కాపు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కియా కార్ల షోరూం నిర్వహిస్తున్నారు. ఆ బిజినెస్‌లో విభేదాలు వచ్చి.. పెద్ద గొడవ జరిగినట్టు తెలుస్తోంది. బళ్లారిలో జరిగిన ఈ వివాదం ప్రవీణ్ సూసైడ్ అటెంప్ట్‌తో వెలుగులోకి వచ్చింది.
ఉమ్మడిగా నడుపుతున్న కియా షోరూం ఆర్థిక లెక్కలు సరిచూసుకుందామంటూ గాలి సోమశేఖర్‌రెడ్డి కుమారులు రెండుమూడు నెలలుగా అడుగుతున్నా.. కాపు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కాలయాపన చేస్తూ వస్తున్నారని అంటున్నారు. ఎంతకీ ప్రవీణ్ లెక్కలు చూపించకపోవడంతో.. ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి ఆ విషయంలో జోక్యం చేసుకున్నారు. తన కుమారులను వెంటేసుకొని.. ఎమ్మెల్యే గాలి.. బళ్లారి సిటీలోని కియా కార్ల షోరూంకు చేరుకున్నారు. ప్రవీణ్ షోరూం దగ్గర లేకపోవడంతో ఫోన్ చేసి కాపు ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని పిలిపించారు. ప్రవీణ్‌ను ఎమ్మెల్యే గాలి, ఆయన కుమారులు ఆర్థిక లావాదేవీల లెక్కలు అడగ్గా.. వారి మధ్య వాగ్వాదం మొదలైంది. కాపు ప్రవీణ్‌కు ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ప్రవీణ్ తీవ్ర మనస్తాపం చెంది.. పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేశారు. షోరూం సిబ్బంది కాపు ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని అడ్డుకుని.. బళ్లారిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రవీణ్ ఆరోగ్యం నిలకడగానే ఉండటంతో వెంటనే డిశ్చార్జ్ చేశారు. ఇదీ జరిగింది.
కేసులు, వివాదాలకు నిలయమైన పక్కరాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే గాలి కుటుంబంతో.. వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి బిజినెస్ లావాదేవీలు ఉండటం.. అందులో గొడవ రావడం.. కాపు కుమారుడు ఆత్మహత్యాయత్నం చేయడం.. ఏపీలో చర్చనీయాంశమైంది.