ఇక్కడ కుస్తీ.. అక్కడ దోస్తీ.. ఎవరికి లాభం? ఇంకెవరికి నష్టం?
posted on Jul 5, 2021 @ 4:50PM
హైదరాబాద్‌లో బీజీపీ, ఎంఐఎం పార్టీలు ఉప్పు, నిప్పు. ఒకరి మీద ఒకరు కత్తులు దూస్తూనే ఉంటారు. నిప్పులు చెరుగుతూనే ఉంటారు. బీజేపీని ఓడించడమే ఏకైక లక్ష్యం అన్నట్లుగా ఎంఐఎం.. పుట్టిందే ఎంఐఎంను ఓడించేందుకు అన్నట్లుగా బీజేపీ పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తాయి. అయితే, అవే పార్టీలు యూపీలో లోపాయికారీ ఒప్పందానికి వచ్చాయి. వివరాలలోకి వెళితే ..
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం వేడెక్కుతోంది. నిజానికి, యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఎనిమిది, తొమ్మిది నెలల సమయముంది. అయినా, కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతో మొదలైన విపక్షాల విమర్శలు ఎన్నికల టర్న్ తీసుకుని కాక పుట్టిస్తున్నాయి. నిజానికి అధికార బీజీపీ కొవిడ్ కష్టాల్లో నిండా మునిగి కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఇంటాబయట సమస్యలతో సతమతమవుతున్నారు. ఒకవిధంగాచూస్తే, బీజేపీ ఓడించేందుకు కరోనా సువర్ణ అవకాశం కల్పించింది.
అయితే చిత్రంగా ప్రభుత్వాన్ని, అధికార బీజేపీని ఎండగట్టేందుకు బదులు ప్రతిపక్ష సమాజ వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ), కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు టన్నుల కొద్దీ విమర్శలు కుమ్మరించుకుంటున్నారు. ఒక విధంగా బీజేపీని మళ్ళీ గెలిపించే బాధ్యతను విపక్షాలు తీసుకున్నట్లుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారంటే, పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చును.
బీఎస్పీ అధినాయకురాలు మాయావతి ఆదివారం, కాంగ్రెస్ పార్టీ అంటేనే, ‘వంచన’ మోసం అంటూ మండిపడ్డారు. ఉత్తర ప్రదేశ్’లో ప్రాణవాయువు అందక కొట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, పాత వాసనలు వదులుకోలేదని వంచనకు మోసాని పాల్పడుతూనే ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేరులోని ‘సి’ అక్షరం, “కన్నింగ్” (వంచన)కు ప్రతిరూపంగా నిలుస్తుందని మాయావతి అన్నారు. అయితే, మాయావతి తమంతట తాముగా ఆ ఆరోపణ చేయలేదు. బీఎస్పీ అధికార బీజేపీతో లోపాయికారి, రహస్య ఒప్పందం కుదుర్చుకుందని, కాంగ్రెస్ చేసిన ఆరోపణకు సమాధానంగా ఆమె కాంగ్రెస్ వంచనకు మారు పేరని అన్నారు. మరో వంక రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిది, అశోక్ సింగ్, రాష్ట్రంలోని ప్రతి ఓటరు, బీఎస్పీ, బీజేపీ అధికార ప్రతినిధి అనుకుంతున్నారని ఈ నిజాన్ని మాయావతి అంగీకరించక తప్పదని అన్నారు. బీఎస్పీలోని బీ’ బహుజనులు:ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు ప్రతీక అని అంటూ మాయావతి ఈ వర్గాల ప్రజల్ అండతోనే రేపటి ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని అన్నారు.
అలాగే, 2017 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్’తో 2019 లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీతో పుట్టు పెట్టుకున్న ఎస్పీ, ఈసారి వ్యూహాన్ని మార్చి, పెద్ద పార్టీలను పక్క పెట్టి, నిర్దిష్ట ఓటు బ్యాంక్ ఉన్న చిన్న చిన్న పార్టీలతో కూటమి కట్టే ప్రయత్నాలు సాగిస్తోంది.అయితే. ఎస్పీ ప్రయత్నాలను మాయావతి హేళన చేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీలలు ఎస్పీతో వద్దనుకోవడం వల్లనే ఆ పార్టీ దిక్కులేక చిన్నా చితక పార్టీలతో కూటమి కట్టే ప్రయత్నాలు చేస్తోందని ఆమె ఎద్దేవా చేశారు.
ఇదలా ఉంటే, ఏఐఎమ్‌ఐఎమ్ నేత మన హైదరాబాద్ ఎంపీ, అసదుద్దీన్ ఒవైసీ యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్’కు సవాల్ విసిరారు. నెక్స్ట్ ఇయర్ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి రాకుండా అడ్డుకుంటానని ఒవైసీ ఛాలెంజ్ విసిరారు. ఓమ్ ప్రకాశ్ రాజ్‌భర్ నేతృత్వంలోని సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్‌బీఎస్‌పీ)తో పాటుగా మరో 9 చిన్న పార్టీలతో కలసి ‘భాగీదారీ సంకల్ప్ మోర్చా’ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ ఈ కూటమి అభ్యర్థులు పోటీ చేస్తారని ఒవైసీ ప్రకటించారు. ఈ సందర్భంగానే ఒవైసీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్’కు సవాల్ విసిరారు.
అంతకంటే కావలసిందేముందని యోగీ ఓకే అన్నారు. ఒవైసీ సవాలును స్వీకరిస్తున్నానని ఆదివారం వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. రాష్ట్రంలో 300 పైగా అసెంబ్లీ స్థానాలను కమలదళం కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిజమే, విపక్షాలలో ఇదే అనైక్యత ఎన్నికల వరకు ఇలాగేకొనాసాగితే, ఆదిత్యనాథ్ మళ్ళీ ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్య పోనవసరం లేదని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు.
కాగా, ఉత్తర ప్రదేశ్’లో గత 15 ఏళ్ల ఎన్నికల చరిత్రను చూస్తే, 2014,2019లోక్ సభ ఎన్నికలలో, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటు షేర్ పెరిగిందని, ఎన్నికల విశ్లేషకులు పెర్కొంటున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికలలో 40 శాతం ఓట్లు సాధించిన బీజేపీ 2019 నాటికి 50 శాతానికి పెంచుకుంది. ఎస్పీ, బీఎస్పీలు కలిసి పోటీచేసినా, ఆ రెండు పార్టీల వోట్ షేర్ 22 శాతం దాటలేదు. ఇక రేపటి ఎన్నికలలో పంచముఖ పోటీ అనివార్యంగా కనిపిస్తున్న నేపధ్యంలో యూపీ పీఠం మళ్ళీ యోగీదే అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఇదలా ఉంటే, యూపీ ఎన్నికల బరిలోకి ఎంఐఎం ఎంట్రీ ఇవ్వడం యూపీలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చకు తెరతీసింది. బీజేపీతో అసలు సిసలు లోపాయికారీ ఒప్పందం ఉన్నది ఎంఐఎంకే అని, ఒవైసీ , అధిత్యనాథ్’కు సవాలు చేసింది కూడా ఆయన్ని గెలిపించడం కోసమే అని స్థానిక రాజకీయ వర్గాల్లో వినవస్తోంది. బీజేపీ, ఎంఐఎం పార్టీల తీరు హైదరాబాద్’లో కుస్తీ యూపీలో దోస్తీ అన్నట్లుగా ఉందని అంటున్నారు. ముస్లిం ఓట్లను చీల్చి పరోక్షంగా బీజేపీని గెలిపించెందుకే ఒవైసీ యూపీ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారని, నిజానికి బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్య ఈ ఒప్పందం ఒక్క యూపీకే పరిమితం కాదని కూడా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏదైనా విపక్షాల అనైక్యత అధికార పార్టీకి మేలు చేస్తుంది, అది యూపీలోనే కాదు, ఏపీ, తెలంగాణాలలో అయినా అంతే..