మోదీ ఎలక్షన్ కేబినెట్.. దక్షిణాదికి మొండిచేయేనా?
కేంద్ర మంత్రి వర్గం విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇక ముహూర్త నిర్ణయం మాత్రమే మిగిలింది. అది కూడా ఒకటి రెండు రోజుల్లో తేలిపోతుందని ఢిల్లీ రాజకీయ వర్గాల సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన నాటి నుంచి, ఇంకా ముందు నుంచి కూడా మంత్రివర్గ విస్తరణపై ఇటు రాజకీయ వర్గాల్లో, అటు మీడియాలో చర్చ జరుగుతూనే వుంది. అందుకు తగినట్లుగానే ఢిల్లీ, నాగపూర్లలో కదలికలు చోటు చేసుకున్నాయి.
గత నెలరోజులకు పైగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వివిధ మంత్రిత్వశాఖల పనితీరును సమీక్షిస్తున్నారు. ఇప్పుడు ఆ సమీక్షలు ముగింపుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమీక్షలకు సమాంతరంగా పీఎం మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ కీలక నేతలు ముఖ్యంగా రాష్ట్రాల సంస్థాగత వ్యవహారాల కార్యదర్శులు, ఇతర ముఖ్యులతో సంప్రదింపులు సాగిస్తున్నారు. అలాగే, మరో ఏడెనిమిది నెలల్లో ఎన్నికలు జరగనున్న ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల నుంచి గౌండ్ రిపోర్టులు కూడా సేకరించారని సమాచారం.
బీజేపీ, మోడీ రాజకీయ భవిష్యత్కు అత్యంత కీలకంగా భావిస్తున్న ఉత్తర ప్రదేశ్కు విస్తరణలో అధిక ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. అంతే కాదు, మంత్రివర్గ విస్తరణకు నెల రోజులకు పైగా సాగుతున్న భారీ కసరత్తు పూర్తిగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే, మూల బిందువుగా సాగిందని పార్టీ వర్గాల సమాచారం. అదే విధంగా ప్రస్తుత మంత్రివర్గ విస్తరణకు రాజకీయంగానూ చాలా చాలా ప్రాధాన్యత ఉందని, రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ మిత్ర పక్షాలు శివసేన, అకాలీ దళ్ ఎన్డీఎ నుంచి తప్పుకోవడంతో మంత్రి వర్గంలో మిత్ర పక్షాల ప్రాతినిధ్యం తగ్గిపోయింది. ఈ నేపధ్యంలో ప్రస్తుతం మంత్రి వర్గంలో స్థానం లేని జనతా దళ్ (యు), అప్నాదళ్, ఎల్జీపీ వంటి పార్టీలకు ప్రాతినిధ్యం కలిపిస్తారని తెలుస్తోంది.
2019 సాధారణ ఎన్నికల అనంతరం ఏర్పడిన మంత్రివర్గంలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చేయలేదు. కనీసం వివిధ కరణాల చేత ఏర్పడిన ఖాళీలను కూడా భర్తీ చేయలేదు. కేంద్ర మంత్రివర్గం సంఖ్య 81. అయితే ప్రస్తుతం ప్రధాని మోడీ మంత్రివర్గంలో 53 మంది మాత్రమే ఉన్నారు. ఈ విస్తరణలో మొత్తం ఖాళీలను భర్తీ చేయడంతో పాటుగా, మరికొన్ని మార్పులు చేర్పులు ఉంటాయని తెలుస్తోంది. వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ప్రస్తుత మంత్రులలో కొందరి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని, ఇందుకు సంబంధించి ఆర్ఎస్ఎస్ కొన్ని సూచనలు చేసిందని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో, మంత్రివర్గ విస్తరణ చాలా భారీగా ఉంటుందని అంటున్నారు.
మంత్రివర్గంలో మధ్య ప్రదేశ్ నుంచి జ్యోతిరాదిత్య సింథియాకు, అస్సాం నుంచి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌కు, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీకి మంత్రి వర్గంలో స్థానం ఖరారైందని తెలుస్తోంది. అలాగే, మహారాష్ట్ర నుంచి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. వచ్చే సంవత్సరం ఎన్నికలు జరిగే ఉత్తర ప్రదేశ్ నుంచి జీవీఎల్ నరసింహ రావుతో సహా నలుగురు లేదా ఐదుగురికి ఇదుగురికి మంత్రి వర్గంలో స్థానం దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యూపీ నుంచి బెర్త్ దక్కే పేర్లలో వరుణ్ గాంధీ పేరు కూడా ప్రముఖంగా వినవస్తోంది.అలాగే, బీజేపీ మిత్ర పక్షం అప్నాదళ్ నుంచి ఆ పార్టీ అధ్యక్షురాలు అనుప్రియ్ పటేల్ పేరు ఖరారైన జాబితాలో ఉందని తెలుస్తోంది.
బీహార్ నుంచి బీజేపీ కోటాలో మాజీ ఉపముఖ్యంత్రి సుశీల్ కుమార్ మోడీతో పాటుగా, ఎల్‌జేపీ నుంచి రాంవిలాస్ తమ్ముడు పశుపతి పారస్‌కు, జేడీ(యు)నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆర్పీ సింగ్, సంతోష్ కుమార్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గుజరాత్, పశ్చిమ బెంగాల్ నుంచి కూడా ఒకరిద్దరికి మంత్రి వర్గంలో బెర్త్ దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విస్తరణలో దక్షిణాదికి పెద్దగా ప్రాధాన్యత దక్కపోవచ్చని తెలుస్తోంది. అయితే, అదే జరిగితే, దక్షిణాది రాష్ట్రాలలో విస్తరణ కలలు కంటున్న కమల దళానికి కష్టాలు తప్పవని అంటున్నారు. ఇప్పటికే దక్షిణాది పట్ల వివక్ష చూపుతోందన్న ఆరోపణ ఎదుర్కుంటున్న బీజీపీ ఇంట భారీ విస్తరణలో దక్షణాది రాష్ట్రాలకు మోడీ చేయి చూపిస్తే, ఇక ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా దక్షిణాది రాష్ట్రాలపై అసలు వదులుకోవడం మంచిదని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ విషయంలో ఆఖరి క్షణంలో పునరాలోచించే అవకాశం లేక పోలేదని తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నాయకులు ఆశాభావంతో ఉన్నారు. అయితే, ఆ ఆశ ఎంతవరకు నెరవేరుతుందనేది ప్రస్తుతానికి ఓ మిలియన్ డాలర్ల ప్రశ్న.