మీడియా ట్రైల్స్ ప్రామాణికం కాదు :జస్టిస్ ఎన్వీ రమణ
ఏది సత్యం, ఏది అసత్యం?అసలు ఏది, నకిలీ ఏది?ఏది తప్పు, ఏది ఒప్పు?ఏది మంచి, ఏది చెడు? ...అన్ని విషయాల్లో, అన్ని సందర్భాలలో కాకపోవచ్చును, అందరికీ కాకపోవచును కానీ, చాలా వరకు విషయాల్లో, చాలా సందర్భాల్లో చాలా మందికి ఇలాంటి మీమాంస ఎదురు కావడం సహజం. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే వార్తల్లో ఏది నిజమో, ఏది కాదో తేల్చుకోవడం, చాలా చాలా కష్టం. చివరకు ఎంపీ స్థాయి వ్యక్తులు, రాజకీయ ప్రముఖులు, సత్యాన్ని అసత్యంగా,అసత్యాన్ని సత్యంగా చూపేందుకు, సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్న సందర్భాలు అనేక చూస్తున్నాం.మంచి చెడులు, సత్యం అసత్యం మధ్య ఉన్న చిన్న సన్నని పొర సోషల్ మీడియాలో చెరిగి పోతోంది. చెదిరి పోతోంది. ఈ మాటలు ఇలాగే, కాకపోయిన ఇదే అర్థం వచ్చేలా అన్నది, ఎవరో కాదు, భారత ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ ఎన్వీ రమణ.
నిజానికి ప్రధాన న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి, మరో టిప్పణి, వ్యాఖ్యానం అవసరం లేదు. ఎందుకంటే, స్వేఛ్చ గీత దాటితే, ఏమవుతుందో, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. కాబట్టి, దాని గురించి మరింతగా మాట్లాడుకోవలసిన అవసరం లేదు. కానీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బుధవారం ‘రూల్ అఫ్ లా’అనే అంశంపై చేసిన జస్టిస్ పీడీ దేశాయ్ 17వ స్మారకోపన్యాసంలోతైన చర్చకు మాత్రమే కాదు, ఆత్మ పరిశీలనకు అవకాశం కలిపించేలా ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఈసంధర్భంగా, జస్టిస్ రమణ ఇతర విషయాలతో పాటుగా,, సోషల్ మీడియా ప్రమాణికతను గురించి విశాలంగా చర్చించారు. విలువైన వ్యాఖ్యలు చేశారు.సోషల్ మీడియాలో విస్తృతంగా వచ్చే ప్రజాభిప్రాయాలను జడ్జీలు ప్రామాణికంగా తీసుకోరాదని సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు.
సోషల్ మీడియా ద్వారా ప్రజలు వ్యక్తం చేసే భావోద్వేగమైన అభిప్రాయాలకు న్యాయమూర్తులు ప్రభావితం కాకూడదని ఆయన హెచ్చరించారు. అరుపులు, ఆర్తనాదాలు, బిగ్గరగా చేసే నినాదాలు, నిజాలకుమెజారిటీ ప్రజల అభిప్రాయాలకు ప్రతిబింబం కాకపోవచ్చన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.సోషల్ మీడియాకు తాజా సమాచాన్ని అందించే సౌలబ్యం ఉంటుంది, అయితే, ఏది సత్యం, ఏది అసత్యం?అసలు ఏది, నకిలీ ఏది?ఏది తప్పు, ఏది ఒప్పు?ఏది మంచి, ఏది చెడు? అనేది విడమర్చి విశ్లేషించే సామర్ధ్యం ఉండదని ఆయన అభిప్రాయ పడ్డారు. అంటే మీడియా ట్రయల్స్ అన్న దాన్ని న్యాయమూర్తులు తమ కేసులను నిర్ణయించేటప్పుడు ప్రామాణిక, మార్గదర్శకాలుగా తీసుకోరాదని ఆయన సూచించారు. కానీ అంతమాత్రాన జరుగుతున్న వాస్తవాలపై న్యాయవ్యవస్థ పూర్తిగా విస్మరించరాదని జస్టిస్ రమణ పేర్కొన్నారు.
న్యాయ, శాసన వ్యవస్థ తదితరాలపై న్యాయమూర్తులకు పూర్తి అవగాహన ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. తీర్పుల ప్రభావాన్ని కూడా వీరు అంచనా వేయగలిగి ఉండాలన్నారు. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జుడీషియరీ ..ఈ మూడింటికీ రాజ్యాంగంలో సమాన పాత్ర ఉందని పేర్కొన్నారు. కానీ ఇదే సమయంలో జుడీషియరీకి పూర్తి స్వేచ్ఛ ఉండాలని..దీనిపై ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ మరొకరి నియంత్రణ ఉండరాదని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించే ప్రధాన బాధ్యత కేవలం కోర్టుల మీదే కాకుండా శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలపైనా ఉందని, న్యాయ వ్యవస్థ పాత్రకు పరిమితులున్నాయని తెలిపారు. తన ముందుకొచ్చిన విషయాలను మాత్రమే అది పరిశీలించగలదని, ఈ పరిమితే రాజ్యాంగ విలువలను కాపాడే బాధ్యతలను మిగతా వ్యవస్థలకు అప్పగిస్తోందని జస్టిస్ రమణ పేర్కొన్నారు.
నిజానికి జస్టిస్ ఎన్వీ రమణ తమ ప్రసంగంలో సోషల్ మీడియాను మాత్రమే ప్రస్తావించినా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఇదే ధోరణి కనిపిస్తోందని, మీడియా ట్రైల్స్ ప్రభావం న్యాయ వ్యవస్థ మీద ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అదే విధంగా ప్రత్యక్ష్యంగా గానీ, పరోక్షంగా గానీ, న్యాయ వ్యవస్థపై రాజకీయ భావజాలం ప్రభావం చూపుతోందనే ఆందోళన కూడా లేక పోలేదని , న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే, న్యాయవ్యవస్థతో పాటుగా, మారుతున్నపరిస్థితులు, సాంకేతికంగా ఇతరత్రా వస్తున్న మార్పలను దృష్టిలో ఉంచుకుని, అన్ని వ్యవస్థలో మార్పులు అవసరం అన్న మాట అన్ని వర్గాల నుంచి వినవస్తోంది.