వీరి వీరి గుమ్మడిపండు.. వీరి పేరేంటి?
posted on Jul 5, 2021 @ 3:54PM
రెడ్ కలర్ టీ షర్ట్.. బ్లాక్ ప్యాంట్.. తలకు హెల్మెట్ పెట్టుకొని.. సండే మార్నింగ్ సైకిల్‌పై వెళ్తున్న అతన్ని చూసి మొదట అక్కడి వారు లైట్ తీసుకున్నారు. ఎవరో సైకిలిస్ట్ అనుకొని పెద్దగా పట్టించుకోలేదు. అయితే, అంతలోనే ఆయన వెనుక వస్తున్న మందీమార్బలాన్ని చూసి.. ఈయన ఎవరై ఉంటారబ్బా అని కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు. ఫోకస్ చేశాక ఆయనెవరో తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. వెంటనే పరుగెత్తుకు వెళ్లి సెల్ఫీలు దిగారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. నిమిషాల వ్యవధిలోనే వందలాది లైకులు, కామెంట్లు, ఎమోజీలు. మీరు ఆయనతో ఎలా సెల్ఫీ దిగారు? మీకంత ఛాన్స్ ఎలా వచ్చిందంటూ వ్యూయర్స్ అంతా గగ్గోలు. ఇంతకీ ఆయనెవరు? ఈ ఫోటోలో ఉన్నదెవరు? సెలబ్రెటీ కాదు.. సినిమా స్టార్‌లా కూడా లేరు.. ఇంకెవరై ఉంటారబ్బా? ఇంతకీ మనోడేనా..?
తెలుగువాడు కాకున్నా.. మనందరికీ తెలిసి వాడే. ఈ ఫోటోలో ఉన్న సైకిలిస్ట్ మరెవరో కాదు.. తమిళనాడు సీఎం స్టాలిన్. అవును, స్టాలినే. ఇదిప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్‌గా మారింది. ముఖ్యమంత్రి అయ్యాక స్టాలిన్ ఫిజికల్ ఫిట్‌నెస్‌పై మరింత ఫోకస్ పెంచారు. డైలీ మార్నింగ్ యోగా, వ్యాయామం చేస్తున్నారు. సండేస్‌లో ఇలా సైక్లింగ్ కూడా చేస్తుంటారు. క్రమం తప్పకుండా ఆదివారాల్లో ఈసీఆర్ రోడ్డులో సైక్లింగ్ చేస్తూ కనిపిస్తుంటారు స్టాలిన్.
మన ముఖ్యమంత్రిలా కాకుండా.. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కరోనా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు స్టాలిన్. ఆయనే స్వయంగా కరోనా జాగ్రత్తలు చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. జిల్లాల పర్యటన నిర్వహిస్తూ.. కొవిడ్ కట్టడిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇక, మన ముఖ్యమంత్రీ ఉన్నారు.. రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంటే.. ఒక్కసారైనా ప్రజల్లోకి వచ్చారా? కరోనా చర్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారా? ఆసుపత్రిలో బెడ్స్, మందుల కొరత వేధించినా ఏనాడైనా పట్టించుకున్నారా? తమిళనాడు సీఎం స్టాలిన్ మన ముఖ్యమంత్రిలా అలా కాదు. అన్నీ తానై పర్యవేక్షిస్తున్నారు.
బిజీ షెడ్యూల్ కారణంగా రెండు నెలల గ్యాప్ తర్వాత.. ఈ సండే ఇలా.. ఈసీఆర్ రోడ్డులోని కోవలం నుంచి మహాబలిపురం దాకా సైక్లింగ్ చేశారు సీఎం స్టాలిన్. ఆ మార్గంలో సైక్లింగ్ చేసే యువకులతో స్టాలిన్ చిట్‌చాట్ చేస్తూ ముందుకు సాగారు. దారిలో ప్రజలను సీఎం పలుకరించారు. సీఎం అలా రోడ్డుపై సైకిల్ తొక్కుకుంటూ వెళుతుంటే ప్రజలు ఆశ్చర్యంగా చూశారు. మహాబలిపురం చేరుకున్న తర్వాత అక్కడి టీ షాపులో టీ తాగారు. అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. స్టాలిన్ సైకిల్ నడిపిన మార్గం పొడవునా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సైక్లింగ్ చేస్తున్న సీఎం స్టాలిన్‌తో కొందరు సెల్ఫీలు దిగగా.. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. సీఎం అంటే ఇలా ప్రజలతో కలిసిపోవాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మన ముఖ్యమంత్రీ ఉన్నారు ఎందుకు..? రాజకోట వదలి బయటకు వస్తేగా..? జనాలను అప్పుడప్పుడైనా పలకరిస్తేగా..? స్టాలిన్‌ను చూసైనా కాస్త మారండి సీఎం గారు....