కేసీఆర్ జలక్రీడ!.. లొల్లి ఎక్కువ.. పనులు తక్కువ..!
posted on Jul 5, 2021 @ 11:08AM
కేసీఆర్ మాయల మరాఠీ. తిమ్మినిబమ్మి చేయడంలో నెంబర్ వన్. ఏపీ-తెలంగాణ మధ్య మరోసారి జల వివాదం తలెత్తడంతో.. సీఎం కేసీఆర్ తీరుపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ కావాలనే కిరికిరి పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నారు. 2015లో కృష్ణా జలాల్లో 34శాతం వాటా చాలంటూ.. 299 టీఎంసీలకు ఒప్పందంపై సంతకాలు పెట్టారని విపక్ష నేతలు చరిత్ర తవ్విపోస్తున్నారు. అప్పుడు సరేనని.. ఇప్పుడు తిరకాసు పెడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని మండిపడుతున్నారు.
ఏపీ సీఎం జగన్ శాసనసభలో మాట్లాడిన తర్వాత.. ప్రగతి భవన్‌కు వచ్చి కేసీఆర్ అనుమతి తీసుకున్నాకే 203 జీవోను విడుదల చేశారని రేవంత్‌రెడ్డిలాంటి నేతలు మండిపడుతున్నారు. ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టి, నిధులు కేటాయించి, ఏడాదిగా పనులు చేస్తున్నా.. కిమ్మనకుండా నోరు మూసుకున్న ముఖ్యమంత్రి.. ఇప్పుడు తెలంగాణలో ఆయన గ్రాఫ్ దారుణంగా పడిపోవడంతో సడెన్‌గా మళ్లీ కిరికిరి స్టార్ట్ చేశారంటున్నారు. అసలు తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టిందే కేసీఆర్ అంటూ.. ఇటు రేవంత్‌రెడ్డి.. అటు బండి సంజయ్‌లు మాటలతో కుమ్మేస్తున్నారు. ఇంత సూటిగా ప్రశ్నిస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి మాత్రం సమాధానం లేదు.
నీళ్ల కోసం పోరాడుతున్నానంటూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడే కేసీఆర్ తెలంగాణ ప్రాజెక్టు కోసమూ పెద్దగా చేసిందేమీ లేదనే విమర్శలు ఉన్నాయి. అందుకు, పక్కా లెక్కలతో సహా ఆధారాలు ముందేస్తున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకూ తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేసిందని.. అయినా ఇప్పటి వరకూ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని సాక్షాలు చూపిస్తున్నారు. ఇప్పటి వరకూ గోదావరి బేసిన్ ప్రాజెక్టులపై 80వేల కోట్లు ఖర్చు చేస్తే.. కృష్ణా ప్రాజెక్టులపై కేవలం 30వేల కోట్లను మించలేదు. నిధుల ఖర్చులో మెజార్టీ వాటా కాళేశ్వరంకే పోయింది. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే 68 వేల కోట్లు ఖర్చు చేసినా.. ఇంత వరకూ అదనంగా ఒక్క ఎకరా భూమి కూడా తడపలేదనే విమర్శ ఉంది. నిర్వాసితులు పరిహారం కోసం ఇంకా కన్నీళ్లు ఇంకిన కళ్లతో ఎదురుచూస్తూనే ఉన్నారు. ముంపు పేరుతో తన ఇంటిని సర్కారు గుంజుకోగా.. వేరే చోట ఇల్లు ఇవ్వకపోవడంతో ఇటీవల ఓ రైతు తన ఇంట్లో తానే చితిని పేర్చుకొని ఆత్మహత్య చేసుకోవడం ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం చేస్తున్న దారుణాలకు నిదర్శనం.
ప్రస్తుత గొడవంతా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కోసమే. కాళేశ్వరం కంటే ముందే ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో ఇప్పటి వరకూ ఎలాంటి ఎదుగూబొదుగూ లేదు. అంచనాలైతే 35 వేల కోట్ల నుంచి 52 వేల కోట్లకు పెరిగాయి కానీ.. ఖర్చు మాత్రం 11 వేల కోట్ల దగ్గరే ఆగిపోయింది. భీమా ప్రాజెక్టుపై ఇప్పటి వరకూ 2,600 కోట్లు ఖర్చు చేస్తే.. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నిధులు మాత్రం కేవలం 700 కోట్లు మాత్రమే. ఇలా.. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఏ ప్రాజెక్టు తీసుకున్నా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఇక పెండింగ్ బిల్లులు రాక కాంట్రాక్టర్లు మొత్తుకుంటున్నారు.
కేసీఆర్ చేస్తున్న పనులు తక్కువ.. నిధుల కేటాయింపు ఇంకాతక్కువ.. మాటలు, బిల్డప్ మాత్రం చాలా చాలా ఎక్కువ అంటున్నారు. కేసీఆర్‌కు నీళ్ల కంటే తనకొచ్చే నిధులే ముఖ్యమని.. ప్రాజెక్టుల పేరుతో ఏపీతో గొడవ క్రియేట్ చేసి.. ఆ మేరకు రాజకీయ లబ్ది పొందటమే ఆయన టార్గెట్ అని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇదంతా కేసీఆర్-జగన్ కలిసి ఆడుతున్న జలక్రీడ అని మండిపడుతున్నారు. సీఎం కేసీఆర్‌కే కృష్ణా జలాలపై అంత ప్రేమ ఉంటే.. ముందు పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి.. పూర్తి చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు తెలంగాణవాదులు.