శివసేనతో మళ్ళీ పెళ్ళికి బీజేపీ సిద్ధం
రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు ఉండరు. శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. మహారాష్ట్రలో బీజీపీ, శివసేన సుదీర్ఘకాలం పాటు మిత్ర పక్షలుగా ఉన్నాయి.. అలాగే పంజాబ్’లో బీజేపీ, శిరోమణి అకాలీ దళ పార్టీలు రెండు దశాబ్దాలకు పైగా చెట్టాపట్టాలేసుకుని సహజీవనం చేశాయి. బీజేపీతో ఇంకా అనేక పార్టీలు చేతులు కలిపినా, శివసేన, అకాలీ దళ్ మాత్రమే కాషాయ దళం సహజ మిత్ర పక్షాలుగా గుర్తింపు పొందాయి. అందుకే చిన్నా చితక తగవులు వచ్చినా పెద్దల జోక్యంతో అన్నదమ్ముల్లా కలిసి పోతువచ్చాయి. కానీ, ప్రధాని మోడీ, అమిత్ షా జోడీ బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాత, సహజ మిత్ర పక్షాలు అనుకున్న ఆ రెండు పార్టీలు ఒక దాని తర్వాత ఒకటి కమలం చేయి వదిలి రాజకీయ ప్రత్యర్దులుగా కాలు దువ్వుతున్నాయి.
అయితే, ఇపుడు గత నెల రోజులుగా సాగుతున్న పరిణామాలను గమనిస్తే మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య ఏర్పడిన మబ్బులు తొలిగి పోతున్నసంకేతాలు స్పష్టమవుతున్నాయి. పాత బంధాలను మళ్ళీ పునరుధరించుకునేందుకు ఉభయ పార్టీలు ఉత్సాహం చూపుతున్నాయి. ఈ నేపధ్యంలోనే, గత నెలలలో, (జూన్ 8న) మహా రాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షడు ఉద్ధవ్ థాక్రే ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. 40 నిముషాలకు పైగా రాష్ట్రానికి సంబందించిన అంశాలను చర్చించారు.అధికార సమావేశానికి కొనసాగింపుగా కొద్ది సేపు ఏకాంత సమావేశం జరిపారు. ఆ పదినిముషాలలో వారు ఏమి చర్చించారో, ఏమో కానీ, ఈ సందర్భంగా ఉద్ధవ్ థాకరే చేసిన వ్యాఖ్యలు ఆ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యతను జోడించాయి. ఉద్ధవ్ థాకరే ముఖ్యంగా బీజేపీ, శివసేన సంబంధాల కోణంలో ప్రాధాన్యతగల వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తాము ఒకటి కాకపోయినా..తమ మధ్య బంధం బ్రేకవ్వలేదన్నారు. తానేమి నవాజ్ షరీఫ్‌ను కలిసేందుకు వెళ్లలేదని, తాను ప్రధానిని వ్యక్తిగతంగా కలిసిస్తే తప్పేమీ లేదని అన్నారు.
ఇక అక్కడి నుంచి ఓ వంక ఊహాగానాలు ఊపందుకుంటే మరో వంక, ఇరు వైపులా నుంచి అందుకు ఊతమిచ్చే వ్యాఖ్యలు, సంకేతాలు స్పష్టమవుతున్నాయి. బీజీపీ, శివసేన బంధాన్ని తుంచడంలో కీలక పాత్ర పోషించిన, శివసేన ఎంపీ, పార్టీ అధికార పత్రిక,’సామ్నా’ సంపాదకుడు సంజయ్ రౌతు, ఉద్ధవ్ థాకరే ప్రధానిని కలిసిన రెండు రోజులకే నరేంద్ర మోడీని మెచ్చుకుంటూ సంపాదకీయం రాశారు. దేశంలో ఆయనే టాప్ లీడర్ అని ప్రశంసించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఉద్దవ్ థాకరే, హిందుత్వం, హిందూ జాతీయ వాదం తమ పార్టీ విధానమని, ఈ విషయంలో వెనకడుగు వేసేది లేదని స్పష్తం చేశారు.
ఇక ఇప్పుడు తాజాగా గడచిన రెండు మూడు రోజులుగా ఉభయ పార్టీల నుంచి మరింతగా ప్రేమ పొంగులు, సంకేతాలు కొంచెం చాల ఎక్కువగా కనిపిస్తున్నాయి.వినిపిస్తున్నాయి.శివసేనకు ముఖ్యమంత్రి పదవి వదులుకునేందుకు ససేమిరా అని భీష్మించుకుని కూర్చున్న, బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ స్వరంలో మార్పు వచ్చింది. శివసేన తమకు శత్రువు కాదని ఆయన అన్నారు. మరో వంక ఫద్నవీస్ ప్రేమ సందేశానికి సంజయ్ రౌత్ పాజిటివ్’గా స్పందించారు.
“మేమేమీ భారత్, పాకిస్థాన్‌లు కాదు. అమీర్ ఖాన్, కిరణ్ రావులను చూడండి. మా సంబంధం అలాంటిదే. ఎవరి రాజకీయ మార్గాలు వారివి. కానీ మిత్రత్వం ఎప్పటిలాగే ఉంటుంది’’ అని రౌత్ స్పష్టం చేశారు. అంతే కాదు థాకరే ఫ్యామిలీతో ప్రధాని మోడీకి, రాజకీయాలకు అతీతమైన ప్రత్యేక బంధం ఉందని అన్నారు.
ఇదలా ఉంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు, బీజేఎల్పీ నేత, మాజీ సీఎం ఫడణవీ్‌సకు మధ్య రాజీ కుదిర్చేందుకు పెద్దల స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఫడ్నవీస్’కు చోటు కల్పిస్తారని పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది.
అదలా ఉంటే, రాజకీయ పోత్తులకు ఉభయుల ప్రయోజనాలే ప్రమాణికం అన్న సూక్తిని గుర్తు చేస్తూ రాజకీయ పరిశీలకులు మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహావికాస్ అఘాడీ( ఏమ్వీఎ)లో అంతర్గత విబేధాలు ముదురుతున్న నేపధ్యంలో శివసేన, జాతీయ స్థాయిలో బీజేపీ, మోడీ గ్రాఫ్’కు గండి పడుతున్న నేపధ్యంలో బీజేపీ, మళ్ళీ పెళ్లి (పొత్తు)కు సిద్ధమవుతున్న సంకేతాలు ఇస్తున్నాయని అంటున్నారు. ఇద్దరికీ ఇప్పుడు ఒకరి అవసరం ఒకరికుంది. అందుకే మళ్ళీ పెళ్ళికి అడ్డుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ఫడ్నవీస్’ ను కేంద్రానికి పంపేసి, ఆ తర్వాత మహారాష్ట్రలో బీజేపీ-శివసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. ఉద్ధవ్ థాకరేను ముఖ్యమంత్రిగా కొనసాగిస్తారని, బీజేపీ నుంచి ఇద్దరికి ఉపముఖ్యమంత్రి పదవులు కల్పిస్తారని అంటున్నారు. అయితే, ఫడణవీస్ దీనిని కొట్టిపారేస్తున్నారు. తాను రాష్ట్రంలోనే ఉంటానని అంటూనే తుది నిర్ణయం మాత్రం ప్రధాని మోడీదేనని అన్నారు. ఏమైనా,పాత ప్రేమలు ఫ్రెష్ ‘గా మళ్ళీ చిగిరిస్తున్నాయి,అంతవరకు అయితే ఎవరికీ అనుమానం లేదు ..ఆ తర్వాత కథ ఏ మలుపులు తిరుగుతుందో .. ఎక్కడ ముగుస్తుందో బుల్లితెర మీద చూడవలసిందే, అంతవరకు సెలవు అంటున్నారు మహా విశ్లేషకులు