థియేటర్స్‌కు గ్రీన్ సిగ్నల్.. మరిన్ని ఆంక్షలు సడలింపు..
posted on Jul 5, 2021 @ 3:00PM
కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయి. షాపులు, మాల్స్ యధావిధిగా ఓపెన్ చేస్తున్నారు. వైన్స్ అయితే ఎప్పుడో షెట్టర్ తెరిచేశారు. ఇలా ఎన్ని ఓపెన్ అయినా.. సినిమా థియేటర్లు ఎప్పుడెప్పుడు తెరుస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చేసింది. ఈ నెల 8 నుంచి 50శాతం పరిమితితో.. సీట్ల మధ్య ఖాళీ ఉండేలా చర్యలు తీసుకుంటూ.. సినిమా హాల్స్ తెరుచుకోవచ్చని ఏపీ సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. ఈ న్యూస్ సినీ లవర్స్‌కు పండగే అయినా.. సరైన కొత్త సినిమాల రిలీజ్‌లు ఇప్పట్లో లేకపోవడం అభిమానుల ఉత్సాహంపై నీళ్లు చల్లుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ సడలింపు సమయాల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గోదావరి జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 7 వరకు సడలింపులు ఉంటాయని తెలిపింది. సాయంత్రం ఆరు గంటలకే షాపులు మూసేయాలని ఆదేశించింది. మిగతా జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు సడలింపులు ఉంటాయి. గోదావరి జిల్లాలు మినహా మిగతా చోట్ల రాత్రి 9 గంటలకే దుకాణాలు క్లోజ్ చేయాల్సి ఉంటుంది. వైద్యఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఉభయ గోదావరిలో పాజిటివిటీ రేటు 5 శాతం లోపు వచ్చే వరకు అక్కడ కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగనున్నాయి. కొత్త సడలింపులు ఈ నెల 8 నుంచి అమల్లోకి రానున్నాయి. 50 శాతం పరిమితితో.. కొవిడ్ నిబంధనల మేరకు తగు చర్యలతో.. రెస్టారెంట్లు, జిమ్‌లు, కల్యాణ మండపాలకు సైతం ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.