అనుకున్న టైమ్‌కే మంత్రివర్గ మార్పులు.. నో వాయిదా..
posted on Jul 4, 2021 @ 9:45AM
ఇక మన టైమ్ వస్తోంది...ఇప్పుడు పదవి వస్తే వచ్చినట్లు.. లేదంటే ఇక అంతే సంగతులు.. అని ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్నారు రోజాలాంటి కొందరు. మన టైమ్ అయిపోతుంది.. తీసేస్తారేమో.. సజ్జలనో, విజయసాయినో పట్టుకుంటే ఏమైనా కంటిన్యూ చేస్తారేమో.. ఏం చేద్దాం అంటూ టెన్షన్ పడుతున్నారు వెల్లంపల్లి లాంటి కొందరు మంత్రులు. ఎవరి టైమ్ మారినా.. మన టైమ్ మారే సమస్య లేదు.. జగనన్న మనలను పక్కకు పెట్టడు అనే ధైర్యంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని వంటి వాళ్లు ఫీలవుతున్నారు. రెండున్నరేళ్లకు మంత్రివర్గాన్ని మారుస్తానన్న జగన్ అప్పటి ప్రకటన.. ఇప్పుడు ఆ టైమ్ దగ్గరికొస్తున్న కొద్దీ కాక పుట్టిస్తోంది. డిసెంబర్ తో ఆ గడువు పూర్తి కానున్నది.. దీంతో రకరకాల ఊహాగానాలతో వైసీపీలో నేతలు అల్లాడిపోతున్నారు.
వైసీపీని నెత్తికెత్తుకునే ఓ వెబ్ పోర్టల్ లో ఈ మంత్రివర్గ మార్పులు లేటు కావొచ్చని..ఎందుకంటే కోవిడ్ రావడంతో సంవత్సరం పాటు..మంత్రుల పనులకు ఆటంకాలు వచ్చాయని.. దీని వలన వారి పెర్ ఫార్మెన్స్ అంచనా వేయడంలో ఇబ్బందులొస్తాయని.. కాబట్టి ఈ గడువు పెంచే అవకాశముందని స్టోరీ ఇచ్చారు. అయితే ఇది కొందరు మంత్రులు రాయించుకున్న స్టోరీ అని.. వాస్తవానికి జగన్ డిసెంబర్ తర్వాత మంత్రివర్గ మార్పులకు ఫిక్స్ అయిపోయారని.. కోవిడ్ కారణంతో ఏ పనులు ఆపని..జగన్మోహన్ రెడ్డి ఇది మాత్రం ఎందుకు ఆపుతారని వైసీపీలోని కొందరు నేతలు వాదిస్తున్నారు.
కాదు.. టీడీపీ నుంచి వచ్చిన కొందరు..ఇంకా వస్తారని ప్రచారంలో ఉన్నవారు...వీరిలో కొందరికి మంత్రి పదవుల హామీ ఉందని.. అయితే టీడీపీలాగా పార్టీ మారినవారికి మంత్రి పదవి ఇవ్వడం కుదరదని.. వారితో రాజీనామా చేయించి.. ఎన్నికలు జరిగి.. వైసీపీ టిక్కెటుపై తిరిగి గెలిచేవారికే ఆ మంత్రి పదవి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచించారని.. కాని ఇప్పుడు ఆ ప్రక్రియ జరిగే అవకాశం లేదని..అందుకే వాయిదా వేయొచ్చని కొందరు వాదిస్తున్నారు.
స్థానిక ఎన్నికల్లో నయానో భయానో.. తమకున్న బలంతో గెలిచారు. దీంతో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయాయి. కాబట్టి ఇలాంటి ప్రక్రియలు..వాళ్లకు వీళ్లకు మంత్రి పదవులు ఇవ్వకపోతే ఎలా అనే డౌట్స్ జగన్ కు లేవని..అందుకే ఆయన అనుకున్నది అనుకున్నట్లు షెడ్యూల్ ప్రకారం ప్రొసీడ్ అయిపోవడం ఖాయమనే వాదన గట్టిగా వినపడుతుంది. కాబట్టి డిసెంబర్ చివరిలోనో..లేదా సంక్రాంతికో మంత్రివర్గ మార్పులు ఉంటాయని.. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని వైసీపీలో బలంగా వినపడుతోంది. అంతే కాదు.. ఎవరిని తీసేయాలి..ఎవరిని కొత్తగా తీసుకోవాలి.. ఎవరి శాఖలు మార్చాలి అనేవన్నీ జగన్ ఇప్పటికే డిసైడ్ అయిపోయారని.. జస్ట్ టైమ్ రావాలంతే అని కూడా చెబుతున్నారు.