పాదయాత్రగా బీజేపీ బండి.. రాజకీయాల్ని నడిపిస్తున్న రేవంత్‌రెడ్డి..
posted on Jul 4, 2021 @ 9:22PM
వన్‌షాట్ మెనీ బర్డ్స్. కాంగ్రెస్ తన అమ్ములపొదిలో ఉన్న బ్రహ్మాస్త్రాన్ని వదిలింది. చిచ్చరపిడుగు రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌ని చేసింది. ఇలా ఢిల్లీలో ప్రకటన రాగానే.. అలా తెలంగాణలో ప్రకంపణలు మొదలయ్యాయి. సునామీలాంటి రేవంత్‌రెడ్డి రాకతో.. ఇటు గులాబీ వనం.. అటు కమలం పూదోట.. చిగురుటాకులా వణికిపోతున్నాయి. గులాబీ బాస్‌కు గులాబీ ముల్లులా గుండెల్లో గుచ్చుకుంది ఆ న్యూస్. అటు కమల దళపతిలోనూ కలవరం చెలరేగింది. ఇన్నాళ్లూ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉన్న పొలిటికల్ సినారియో.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి వర్సెస్ అదర్స్‌గా టర్న్ తీసుకుంది. ఇప్పుడు.. ఒక్క రేవంత్ ఒకవైపు.. కేసీఆర్, బండి సంజయ్ బ్యాచ్ అంతా మరోవైపు.
ఇంకా బాధ్యతలైనా తీసుకోలేదు అప్పుడే రేవంత్‌రెడ్డి.. వార్ వన్‌సైడ్ అన్నట్టు దూసుకుపోతున్నారు. కేసీఆర్‌పై ఎంతగా అటాక్ చేస్తున్నారో.. బీజేపీపైనా అంతే దూకుడు ప్రదర్శిస్తున్నారు. బండి, గుండు, పగటివేషగాళ్లు అంటూ కాషాయం నేతలను కుళ్లబొడుస్తున్నారు. రేవంత్ మాటల దెబ్బకి.. బీజేపీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతోంది. అందుకే కాబోలు.. రేవంత్ అంతగా తిడుతున్నా.. కమలనాథుల నుంచి కనీస కౌంటర్ కూడా పడటం లేదు. రేవంత్ దాడి నుంచి తట్టుకొని నిలబడటానికి.. యాక్షన్‌లోకి దిగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్.
హైటెన్షన్ తీగలాంటోడైన రేవంత్‌రెడ్డిని టచ్ చేస్తే కాలి బూడిదై పోతామనుకున్నారో ఏమో.. ఆ ట్రాన్ష్‌ఫార్మర్ జోలికి పోకుండా తన దారిన తాను రాజకీయ యాత్ర చేపట్టారు. ఆగస్ట్ 9 నుంచి పాదయాత్రకు శంఖారావం ఊదారు బండి సంజయ్. ఆ రోజు మంచి సమయాన.. హైదరాబాద్‌లో తనకు బాగా కలిసొస్తున్న భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి పాదయాత్ర ప్రారంభించనుంది ఈ బీజేపీ బండి. డెస్టినేషన్-హుజురాబాద్.
బండి ప్రజెంట్ టార్గెట్--హుజురాబాద్. అందుకే, హైదరాబాద్ నుంచి హుజురాబాద్‌కు పాదయాత్రగా రాజకీయ యాత్ర ఆరంభించనున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను గెలిపించుకొని.. అధ్యక్షుడిగా తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని తహతహలాడుతున్నారు. ఇంతకు ముందైతే.. హుజురాబాద్‌లో తాము ఈజీగా గెలిచేస్తామని భావించారు కమలనాథులు. కానీ, పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ఎంట్రీతో.. తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్స్ అమాంతం మారిపోతున్నాయి. రేవంత్ నాయకత్వంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోంది. సబ్బండ వర్ణాలు రేవంత్‌రెడ్డికే మద్దతుగా కదలివస్తున్నాయి. ఆ జోరు.. ఆ జోష్ చూసి టీఆర్ఎస్‌తో పాటు బీజేపీలోనూ కలవరపాటు పెరిగింది. అందుకే, ఆలసించినా ఆశాభంగమంటూ.. బీజేపీ బాస్ బండి సంజయ్.. పాదయాత్రకు శ్రీకారం చుట్టారని అంటున్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసమే పాదయాత్ర అనేది బండి ట్యాగ్‌లైన్.
బండి సంజయ్ లాంగ్‌టర్మ్ పాలిటిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని మారథాన్ వాకింగ్ చేయబోతున్నారు. మొదటి దశలో హైదరాబాద్ టూ హుజురాబాద్ వరకు. ఉప ఎన్నిక ముగిశాక తెలంగాణ వ్యాప్తంగా మహా పాదయాత్ర చేపట్టనున్నారు. ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా రెడీ అయిపోయింది. ఆగస్ట్ 9న చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. వైఎస్ఆర్ పాదయాత్ర దారిలోనే బండి సంజయ్ కూడా రాజకీయ యాత్ర కొనసాగించనున్నారు. రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో మొదట విడత పాదయాత్ర జరగనుంది. మొదట విడతలో 55రోజుల పాటు 750కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. రోజుకు 15నుంచి 20కిలోమీటర్లు నడిచేలా ప్లాన్ చేస్తున్నారు. పాతబస్తీ, ఆర్యమైసమ్మ, మొయినాబాద్, చేవెళ్ల, వికారాబాద్ మీదుగా పాదయాత్ర జరగనుంది. మొదటి విడత పాదయాత్ర హుజురాబాద్‌లో ముగుస్తుంది. నాలుగైదు విడతల్లో తెలంగాణను చుట్టేయాలనేది బండి ప్రణాళిక. అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకూ జనం నోళ్లలో నానేలా.. ప్రజలను పలకరించేలా.. పాదయాత్ర షెడ్యూల్ ప్రిపేర్ చేశారు కమలనాథులు. అటు, రేవంత్‌రెడ్డి సైతం పాదయాత్రకు సిద్ధమవుతున్న తరుణంలో మరి, బీజేపీ బండి.. రేవంత్ దూకుడు ఏమాత్రం బ్రేకులు వేయగలదో చూడాలి...