మమతకు కరోనా ముప్పు.. సీఎం పదవికి ఎసరు..?
posted on Jul 5, 2021 9:11AM
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో పుష్కర్ సింగ్ రావత్ ప్రమాణ స్వీకారం చేశారు. తీరథ్ సింగ్ ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు నెలలకే ఎందుకు రాజీనామా చేశారు? ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చింది? అంటే, అందుకు ఇంకా ఇతర కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ, అటు భారతీయ జనతా పార్టీ, ఇటు నాలుగు నెలలు తిరగకుండానే రాజీనామా చేసిన తీరథ్ సింగ్ చెపుతున్న, ఆరు నెలల నిబంధన కారణం మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు వేదిక అయింది.
ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో రాజకీయాల్లో అయితే ప్రకంపనలే సృష్టిస్తోంది. తీరథ్ సింగ్ ఎమ్మెల్యే కాకుండానే, గత మార్చిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కానీ వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే, అక్కడి నుంచి 6 నెలల్లోగా శాసన సభ్యునిగా ఎన్నిక కావాలనేది రాజ్యాంగ నిబంధన. ఆవిధంగా ఆయన సెప్టెంబరు 10లోగా శాసన సభకు ఎన్నిక కావలసి ఉంటుంది. ఆయన పోటీ చేసేందుకు వీలుగా గంగోత్రి, హల్ద్వానీ నియోజక వర్గాలు సిద్దంగా ఉన్నాయి. ఈ రెండు నియోజకవర్గాలు ఖాళీగా, రెడీ టూ ఆక్యుపై అన్నట్లుగా ఉన్నాయి. అయితే, కొవిడ్ సెకండ్ వేవ్ కొనసాగడంతో పాటుగా థర్డ్ వేవ్ హెచ్చరికలు వస్తున్న కారణంగా ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధంగా లేదు. అందుకే, రాజ్యాంగ సంక్షోభం, వివాదం ఎదురుకాకుండా, ముందుగానే, ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో పుష్కర్ సింగ్ రావత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలా మూడో కృష్ణుడు ఎంట్రీతో ఉత్తరాఖండ్ కథ ముగిసింది.
అయితే, ఇక్కడే పశ్చిమబెంగాల్ కథ మొదలైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీని, ఒంటి కాలు మీద గెలిపించారు. అయితే, మమతా బెనర్జీ మాత్రం ఓడిపోయారు. నందిగ్రామ్ నియోజవర్గంలో బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఆమె ఓటమి చవిచూశారు. అయినా, ఆరు నెలల్లోగా అసెంబ్లీకి ఎన్నికయ్యేదుకు రాజ్యాంగం కల్పించిన వెసులు బాటును ఉపయోగించుకుని, ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోయినా మమతా బెనర్జీ మరోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఆరు నెలలలోగా ఆమె అసెంబ్లీకి ఎన్నికయ్యేందుకు వీలుగా భవానీపూర్ ఎమ్మెల్యే రాజీనామా చేశారు.నామినేషన్ వేస్తే ఆమె గెలిచేస్తారు. అందులో ఎవరికీ సందేహం లేదు. అయితే, కొవిడ్ కారణంగా ఆరు నెలల గడువు ముగిసే లోగా ఉపఎన్నిక జరిగే అవకాశం కనిపించడం లేదు. గతంలో శాసన సభ్యులు కాకుండానే మంత్రులు, ముఖ్యమంత్రులు అయిన వారు, ఆరునెల గడవుకు ముందు రాజీనామా చేసి, మళ్ళీ మరో మారు మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా కొనసాగిన ఉదంతాలున్నాయి. అయితే, 1995లో సుప్రీం కోర్టు, ఆరు నెలలు అంటే ఆరే నెలలు, బ్రేక్ తీసుకుని మళ్ళీ మరో ఆరు నెలలు పదవులలో కొనసాగేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. ఇక అప్పటి నుంచి, సభ్యులు కానీ వారు ఒక్క ఆరునెలలు మాత్రమే మంత్రులుగా కొనసాగుతున్నారు.
మమతా బెనర్జీ ముచ్చటగా మూడవ సారి, మే 5న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ లెక్కన నవంబరు 4 లోగా ఆమె ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలి. కానీ పశ్చిమ బెంగాల్‌లో మండలి లేనందున ఎమ్మెల్సీ అయ్యే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా ఎమ్మెల్యేగానే గెలవాలి. ఐతే రాబోయే రోజుల్లో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఎన్నిక సంఘం ముందుకు రావడం లేదు. ఇదే కారణంగా, ఇదే పరిస్థితిలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి రాజీనామా చేశారు. సో , మమతా బెనర్జీకి కూడా రాజీనామా చేయక తప్పదని రాజకీయ, రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు, కొవిడ్ సెకండ్ వేవ్ ఉదృతికి బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక సభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించడమే కారణమని న్యాయ స్థానాలు ఎన్నికల సంఘాన్ని తప్పు పట్టిన నేపధ్యంలో ఎన్నికల సంఘం, కొవిడ్ థర్డ్ వేవ్ తలుపులు తడుతున్న సమయంలో మరోమారు అదే తప్పు చేయక పోవచ్చని అంటున్నారు. సో.. రాజీనామా చేయడం మినహా మమత ముందు మరో ఆప్షన్ లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
నిజంగా అదే పరిస్థితి వస్తే, మమతా బెనర్జీ ఏమి చేస్తారు? ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తారు? అనేది బెంగాల్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది . మేనల్లుడు అభిషేక్ బెనర్జీని లేదా ఇటీవలనే సొంతగూటికి తిరిగి వచ్చిన ముకుల్ రాయ్‌ను తాత్కాలికంగా ముఖ్యమంత్రిని చేసి, రిమోట్ కంట్రోల్ పాలన చేస్తారని అంటున్నారు. అయితే, అభిషేక్‌ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోట్ చేసిన సమయంలో మమతా బెనర్జీ కుటుంబ పాలనకు బాటలు వేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే, అందుకు జవాబుగా అన్నట్లుగా అభిషేక్ ఈ మధ్యనే తాను మరో 20 ఏళ్ల వరకు అధికార పదవులను ముట్టనని బహిరంగ ప్రకటన చేశారు. ఈ నేపధ్యంలో మమతా దీదీకి నిర్ణయం తీసుకోవడం కొంచెం చాలా కష్టంగానే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.