వైవీ మంత్రి పదవి ఆశలు ఆవిరేనా ? కారణం ఆయనేనా..?
జీవితంలో ఒక్కసారి అయినా మంత్రి పదవి దక్కితే చాలనే కోరిక ఒక స్థాయికి చేరిన రాజకీయ నాయకులు అందరిలో సహజంగా ఉంటుంది. అలాంటిది, ముఖ్యమంత్రి బాబాయ్, మాజీ ఎంపీ, టీటీడీ చైర్మన్ అయిన వైవీ సుబ్బారెడ్డికి ఆ కోరిక ఉండడంలో తప్పు లేదు. ఆయనకు కోరిక ఉంటే ఉండవచ్చును కానీ, అందరి కోరికలు, అన్ని సందర్భాలలో తీరాలనే రూలేమీ లేదు. అందులోనూ జగన్ రెడ్డి పాలనలో లెక్కలు తప్పడం కొత్తేమి కాదు. తొలి మంత్రి వర్గం కూర్పులోనే ఆయన చాలా మంది ఆశల మీద నీళ్లు చల్లారు, కన్నీళ్లు మిగిల్చారు. అందులో కొందరి కోరికలు ఒక జీవితకాలం లేటు అయినా అవ్వచ్చును. గతంలో, సీనియర్ రాజకీయ నాయకుడు రాయపాటి, ప్రస్తుతం వైవీకి దక్కిన టీటీడీ చైర్మన్ పదవి కోసం పరితపించి పోయారు. ఆ ఒక్కటి చాలని, అనేక మొక్కులు మొక్కుకున్నారు. ఆ ఒక్కటి ఇస్తే ఇంకేదీ కోరనని నేరుగా దేవదేవునికే మొర పెట్టుకున్నారు. అయినా ఫలితం లేక పోయింది.
ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరుకున్న మంత్రి పదవి కాదని.. మరోసారి టీటీడీ చైర్మన్’ గా కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే వైవీకి మాత్రం రాష్ట్రంలో మంత్రి పదవి కాదంటే, రాజ్యసభ ఎంపీగా ఢిల్లీలో చక్రం తిప్పాలనే కోరిక చాలా బలంగా ఉందని ఆయన సన్నిహితుల సమాచారం. ఆయన తమ కోరికను జగన్ రెడ్డికి అనేక మార్లు నివేదించుకున్నారు. చివరకు ప్రస్తుత టీటీడీ పాలక మండలి చివరి సమావేశానికి వెళ్తున్నసమయంలో కూడా వైవీ, తన పరిస్థితి ఏమిటని ముఖ్యమంత్రిని కోరినట్లు సమాచారం. ముఖ్యంగా, వైవీ టీటీడీ అధ్యక్ష పదవీకాలం ముగింపుకు సమయానికే, రెండున్నర ఏళ్ల తర్వాత ఉన్నవారిని తొలిగించి కొత్తవారికి అవకాశం ఇస్తామని, అప్పట్లోనే ముఖ్యమంత్రి మంత్రులకు డెడ్లైన్ విధించిన నేపధ్యంగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కసరత్తు మొదలు కావడంతో, ఆయన తమ కోరికను మరోమారు అబ్బాయి చెవిలో వేశారని సమాచారం.
జగన్ రెడ్డి కూడా బాబాయ్ రిక్వెస్ట్’ను పరిశీలించ సారీ చెప్పినట్లు తెలుస్తోంది. మరో మారు టీటీడీ చైర్మన్ గా కొనసాగక తప్పదని తేల్చివేశారని పార్టీ వర్గాలలో వినవస్తోంది. ఒక దశలో వైవీ అభ్యర్ధనకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, ఎందుకు మనసు మార్చుకున్నారు, ఎందుకు మరోసారి, సారీ చెప్పారు అంటే, అందుకు రెండు మూడు కారణాలు కనిపిస్తున్నాయని, రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఒంగోలు జిల్లా నుంచి ముఖ్యమంత్రి సమీప బంధువైన బాలినేనికి మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు వైవీకి ఇస్తే బాలినేనిని తొలిగించవలసి వస్తుంది.కారణాలు ఏవైనా ఇది జగన్ రెడ్డికి ముఖ్యంగా ఆయన కుటుంబ కోటరీకి ఇష్టంలేదు. అందుకే ముఖ్యమంత్రి,ఇటు పార్టీలోని ఒకరిద్దరు కీలక నేతలతో, అటు కుటుంబ సభ్యులతో చర్చించి, వైవీని తిరిగి మరోమారు టీటీడీ ఛైర్మన్‌గా, బాలినేని మంత్రిగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
అదొక కారణం అయితే జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగాబాధ్యతలు చేపట్టినప్పతి నుంచి, టీటీడీ ఆస్తులపై కన్నేశారు అనేది, రాజకీయ పార్టీలే కాదు, ఆధ్యాత్మిక, ధార్మిక సంస్థలు మొదలు సామాన్య భక్తుల వరకు అందరూ చేస్తున్న ఆరోపణ. నిజానికి ఇది ఆరోపణ కాదు, దేశ వ్యాప్తంగా ఉన్న వెంకన్న దేవుని స్థిరాస్తులను విక్రయించేందుకు ఆమోదం తెలుపుతూ టీటీడీ పాలక మండలి తీర్మానం చేసింది. అయితే, అ విషయంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నారు. అయితే, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి రోజు రోజుకు దిగజారి దివాలా స్థితికి చేరుకున్న నేపధ్యంలో ఇప్పుడు కాకపోయినా, రేపు ఎప్పుడైనా పూట గడిచేందుకు వెంకన్న ఆస్తులే దిక్కయ్యే పరిస్థితి వస్తే, కాగల కార్యం కానిచ్చేందుకు సొంత మనిషి టీటీడీ చైర్మన్’గా ఉండడం మంచిది అన్న ఆలోచనతో కూడా వైవీ కోరికను కాదన్నట్లు తెలుస్తోంది.
ఒంగోలు జిల్లానుంచి వైవీకి ఆవకాశం ఇస్తే, రెండున్నర సంవత్సరాల డెడ్లైన్’ కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఆశావహుల ఆందోళన చెందడం, మరో వంక కుల సమీకరణల లెక్క తప్పడం కూడా ఆయన మంత్రి పదవి ఆశలపై నీళ్ళు చల్లిందని అంటున్నారు.ఏమైనా, జీవితకాలం అని అనలేము కానీ, ప్రస్తుతానికి అయితే, వైవీ మంత్రిపదవి ఆశ కొండెక్కి కూర్చుంది.