‘కప్పట్రాళ్ల’ ఖైదీ మెడలో పూలమాల.. మంత్రితో పాటే మర్యాద..
posted on Jul 5, 2021 @ 12:52PM
ఫ్యాక్షన్ పేరు వినగానే వెంటనే గుర్తొచ్చేది రాయలసీమ. ఆ సీమలోకే పేరుగాంచిన ఫ్యాక్షనిస్ట్ కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన వెంకటప్ప నాయుడు. ఒకప్పుడు ఫ్యాక్షనిస్టే అయినా.. ఆ తర్వాత ప్రశాంతత కోరుకున్నారు. టీడీపీ నాయకునిగా శాంతి కోసం ప్రయత్నించారు. తాను మారినా.. తన ప్రత్యర్థులు మాత్రం మారలేదు. కప్పట్రాళ్లపై పలుమార్లు హత్యాప్రయత్నం చేశారు. ఓ దాడిలో 18 కత్తి పోట్లు పడినా.. బతికి బట్టకట్టిన గట్టిపిండం కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు. అలాంటిది.. వైఎస్సార్ సీఎంగా ఉన్న హయాంలో.. కప్పట్రాళ్లను వెంటాడి.. వేటాడి.. దారుణంగా చంపేశారు ప్రత్యర్థులు. నిందితులకు జీవిత ఖైదు పడినా.. చట్టంలోని లొసుగులు సాకుగా చూపించి.. జైలు నుంచి బయటకొచ్చి.. వైసీపీ నేతలతో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. తాజాగా, ఓ కార్యక్రమంలో మంత్రి జయరాంతో కలిసి రాచమర్యాదలు అనుభవించిన కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు హత్య కేసులో ప్రధాన హంతకుడు మద్దిలేటి నాయుడు వ్యవహారం కలకలం రేపుతోంది. నేరగాళ్లు, హంతకులతో వైసీపీ నాయకులు అంటకాగుతున్న ఉదంతాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి.
ఆనాడు వైఎస్సార్.. నేడు వైఎస్ జగన్.. అధికారంలోకి రాగానే టీడీపీ నాయకులపై దాడులకు తెగబడుతూ అరాచక పాలనకు తెరదీశారు. పాత పగలను మళ్లీ పురిగొల్పుతూ.. గ్రామాల్లో దాడులతో భయకంపితులను చేస్తున్నారు. అధికారం చేతిలో ఉందనే అహంతో.. టీడీపీ వర్గీయులపై విచ్చలవిడిగా దాడులకు దిగుతున్నారు. జగన్ సీఎం అయ్యాక.. పదుల సంఖ్యలో టీడీపీ నాయకులు హత్య గావించబడటమే ఇందుకు నిదర్శనమని నారా లోకేశ్ పదే పదే విమర్శిస్తున్నారు. ఇప్పటి జగన్‌లానే.. అప్పటి వైఎస్సార్ హయాంలో సైతం ఇలాంటి హత్యాకాండే కొనసాగింది. పరిటాల రవి లాంటి ప్రధాన నేతలను సైతం తెలుగుదేశం పార్టీ కోల్పోయింది. ఆ కోవలోనే.. 2008లో టీడీపీ నాయకుడు కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడి హత్య జరగడం అప్పట్లో పెను సంచలనం. ఆ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఐదుగురు ఆదివారం విడుదలవడం మరింత కలకలం.
రాష్ట్రంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడును 2008 మే 17న అతని ప్రత్యర్థులు పక్కా ప్రణాళిక ప్రకారం కాపుకాసి మట్టుబెట్టారు. కోడుమూరు సమీపంలోని మాచాపురం కాల్వ సమీపంలో జీపులో వెళ్తున్న వెంకటప్ప నాయుడును.. లారీతో ఢీకొట్టి.. బాంబులు వేసి.. వేటకొడవళ్లతో నరికి.. దారుణంగా చంపేశారు. ఆ ఘటనలో వెంకటప్పనాయుడుతో పాటు మరో 8 మంది అనుచరులు స్పాట్‌లోనే చనిపోగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఆ హత్య కేసులో ప్రధాన నిందితుడు మద్దిలేటి నాయుడు. ఆయనతో పాటు మొత్తం 48 మందిపై కేసు నమోదు చేసి విచారణ జరిపారు. 2014 డిసెంబరు 8న 21 మంది నిందితులపై నేరం రుజువు కావడంతో కోర్టు వారికి జీవిత ఖైదు విధించింది. దోషులు కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. అయితే, ఆదివారం హత్య కేసులో ప్రధాన వ్యక్తి అయిన మద్దిలేటి నాయుడుతో పాటు మరో నలుగురు విడుదలయ్యారు. సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు వీరికి అనుకూలంగా మారాయి. బెయిల్ రాకుండా ఐదేళ్ల పాటు మగ్గిపోతున్న ఖైదీలను బెయిల్‌పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు నెల రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కరోనా నేపథ్యంలో జైళ్లలో సంఖ్య తగ్గించాలని కూడా సూచించింది. దీంతో ఐదేళ్ల పాటు బెయిల్ రాకుండా ఉన్న వారిని బెయిల్‌పై విడుదల చేస్తున్నారు. ఈ రూల్‌ను ఆధారంగా చేసుకొని.. తమకు కావలసిన వారికి అనుకూలంగా మార్చి.. మద్దిలేటి నాయుడును జైలు నుంచి రిలీజ్ చేశారని అంటున్నారు. ఆదివారం కర్నూలు జిల్లా ఈదుల దేవరబండ గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ముఖ్య అతిథిగా హాజరు కాగా, మద్దిలేటి నాయుడు సైతం మంత్రితో కలిసి పాల్గొనడంతో అంతా అవాక్కయ్యారు. పాలకులు, హంతకులు ఒకేచోట, ఒకే విధంగా మర్యాదలు పొందటంపై చెవులు కొరుక్కుంటున్నారు.