మమత కోసం అధీర్’కు ఉద్వాసన
posted on Jul 5, 2021 @ 6:03PM
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ, కథ కంచికి చేరింది. వామపక్ష కూటమితో కలిసి పోటీచేసినా హస్తం పార్టీకి ఒక్క సీటూ దక్కలేదు.అఫ్కోర్స్, కమ్యూనిస్టులు కూడా ఖాతా తెరవలేదనుకోండి. అది వేరే విషయం. ఇక ప్రస్తుతానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ బెంగాల్లో పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు మమతా బెనర్జీ శరణు వేడేందుకు సిద్దమైనట్లు సమాచరం. నిజానికి, అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే, కాంగ్రెస్ అధిష్టానం, దీదీతో పొత్తుకు సిద్దమైంది..ట. బీహార్’లో ఆర్జేడీతో చేతులు కలిపి అన్నో ఇన్నో సీట్లు గెలిచి రాష్ట్రంలో ఉనికిని కాపాడుకున్నవిధంగా బెంగాల్లో కూడా తృణమూల్’తో పొత్తు పెట్టుకుని, ఉన్నామని అనిపించుకుందామన్నఆలోచన చేసిందట. అయితే దీదీతో పొత్తును, పీసీసీ అధ్యక్షుడు, లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేతగా, డబుల్ రోల్ ప్లే చేస్తున్న అధీర్ రంజన్ పడనీయ లేదు.అంతే కాదు, మమతా దీదీతో ఆయనకు ఏవో పాత తగవులు ఉన్నాయి.అలాగే, తృణమూల్ ప్రభుత్వంపై అధీర్ తరుచుగా విమర్శలు చేస్తుంటారు. బెంగాల్ ఎన్నికల సమయంలోనూ తృణమూల్‌పై అధీర్ తీవ్రమైన విమర్శలే చేశారు. ఈ నేపధ్యంలో భవిష్యత్తులో బీజేపీని నిలువరించడానికి మమత సహకారం తీసుకోవాలని బావిస్తున్న సోనియా గాంధీకి, అధీర్ రంజన్, అడ్డుగా మారారు. అందుకే, మమతతో స్నేహం కోసం అధీర్ రంజన్ చౌదరిని, లోక్ సభలో కాంగ్రెస్ పక్షనేత పోస్ట్ నుంచి తప్పించాలని సోనియా గాంధీ నిర్ణయించుకున్నారు. అధీర్ స్థానంలో ఎవర్ని నియమిస్తారన్నది ఇదమిత్థంగా తెలియడం లేదు. శశి థరూర్, మనీశ్ తీవారి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
అదలా ఉంటే, బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ ముఖర్జీ సోమవారంనాడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోల్‌కతాలోని టీఎంసీ కార్యాలయంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ అయిన అభిజిత్ టీఎంసీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, టీఎంసీ సభ్యుడిగా ఆ పార్టీలో చేరినట్టు తెలిపారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి టీఎంసీలో చేరానని అన్నారు. కాంగ్రెస్‌లో తనకు ఎలాంటి హోదా ఇవ్వనందున టీఎంసీలో చేరానని, తనకు టీఎంసీ ఏ పదవి ఇచ్చినా ఒక సైనికుడిలా బాధ్యతతో పనిచేస్తానని చెప్పారు. బెంగాల్‌లో బీజేపీ ప్రవేశాన్ని అడ్డుకున్న వారి నాయకత్వంలో పనిచేయడం ఒక విశేషాధికారంగా తాను భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ''ఇటీవల చోటుచేసుకున్న బీజేపీ మతతత్వ ప్రభంజనాన్ని మమతా బెనర్జీ ఎలా అదుపు చేయగలిగారో, అదే విధంగా భవిష్యత్తులోనూ అందరి సహకారంతో యావద్దేశంలోనూ మతతత్వ వేవ్‌ను ఆమె నియంత్రించగలరని నేను నమ్ముతున్నాను'' అని అభిజిత్ ముఖర్జీ అన్నారు.