కొత్త పింఛన్లొచ్చే.. థాంక్యూ ఈటల.. మిగతా హామీల సంగతేంది కేసీఆర్?
posted on Jul 5, 2021 @ 11:58AM
సీఎం కేసీఆర్ ఏది చేసినా.. ఏమి మాట్లాడినా.. దానికో అర్థం.. దాని వెనకో పరమార్థం ఉంటుందంటారు. మాటలు చెప్పడం.. అర చేతిలో స్వర్గం చూపించి జనాల్ని నమ్మించడం మినహా.. ఆయన చేసేదేమీ ఉండదని విమర్శిస్తుంటారు. ఏడేళ్ల క్రితం ఇచ్చిన ఎన్నికల హామీ అయినా.. దళితులకు మూడెకరాల భూమి నుంచి మొన్నటి ఎలక్షన్‌లో ఇచ్చిన నిరుద్యోగ భృతి వరకూ.. అనేక హామీలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. అందుకే, ప్రజల్లో కేసీఆర్ గ్రాఫ్ దారుణంగా పడిపోతోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులతో కుమ్మేస్తున్నారు. ప్రగతి భవన్ వీడి బయటకు రారని.. ఫామ్‌హౌజ్‌లో పడుకుంటారంటూ.. కేసీఆర్ ఇజ్జత్ మొత్తం తీసేస్తున్నారు. దుబ్బాక, జీహెచ్ఎమ్‌సీ ఎన్నికల్లో కర్రకాల్చి వాత కూడా పెట్టారు. ఆ తర్వాత నాగార్జునసాగర్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో నయానో భయానో గెలిచినా.. ప్రజల్లో తన పరపతి పడిపోయిందనే విషయాన్ని ముఖ్యమంత్రి గ్రహించారు.
ఆలోగా ఈటల రాజేందర్ ఎపిసోడ్ తెరపైకి రావడం.. కేసీఆర్ తీరును నిలదీస్తు పార్టీని వీడటంతో గులాబీ బాస్ ఇమేజ్‌కు మరింత డ్యామేజ్ జరిగింది. ఈటల మాట్లాడిన ఒక్కో మాట.. కేసీఆర్‌ను ఈటెల్లా గుచ్చుకున్నాయి. ఆయన ప్రస్తావించిన అంశాలపై ప్రజల్లో విస్తృత చర్చ జరిగింది. తెలంగాణ వచ్చాక.. ఏడేళ్లుగా ఒక్క కొత్త రేషన్‌కార్డు అయినా ఇచ్చారా? ఏడేళ్లుగా ఒక్క కొత్త పింఛన్ అయినా ఇచ్చారా? అంటూ ఈటల నిగ్గదీసి అడగడంతో.. నిజమే కదా.. అంటూ జనాలంతా కేసీఆర్‌ను దోషిగా చూడటం మొదలుపెట్టారు. ఈటల మాటలతో కేసీఆర్ సైతం ఉలిక్కిపడ్డారని అంటున్నారు. ఇదేదో కొంపముంచే యవ్వారంగా ఉందేనని వెంటనే రియలైజ్ అయినట్టున్నారు. ఆ వెంటనే యాక్షన్‌లోకి దిగిపోయారు. ఎవరూ అడగకముందే.. ఈటల ప్రస్తావించినందుకే.. కేబినెట్ మీటింగ్ పెట్టి మరీ.. పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డులను ఆగమేఘాల మీద క్లియర్ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు సీఎం కేసీఆర్. అదంతా ఈటల వల్లేనని ఆయనతో పాటు అందరికీ తెలిసిన విషయమే.
ఇక.. ఈటల లేవనెత్తిన మరో ఇంపార్టెంట్ విషయంపైనా కేసీఆర్ దిగొచ్చారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. 57 ఏళ్లు నిండిన అర్హులందరికీ వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం 60 ఏళ్లు నిండిన వారికే ఆసరా పింఛన్లు ఇస్తుండగా.. తాజాగా కేసీఆర్ నిర్ణయంతో 57 ఏళ్లు నిండిన వారికి కూడా వృద్ధాప్య పింఛన్లు రానున్నాయి. అది కూడా వచ్చే నెల నుంచే పెన్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారట. అంటే, హుజురాబాద్ ఎలక్షన్స్ రాకముందే.. ఈటల రాజేందర్ ప్రశ్నించిన సమస్యలన్నిటినీ సాల్వ్ చేసే పనిలో సీఎం కేసీఆర్ ఉన్నారన్న మాట.
అయినా, ఒకటా రెండా.. కేసీఆర్ నెరవేర్చని హామీలు ఎన్నో ఉన్నాయ్. వాటినన్నిటినీ ఆయన తీర్చగలరా? ఏది ఏమైనా.. ఈటల పుణ్యాన.. ఇక ఎప్పటికీ రావనుకున్న కొత్త రేషన్‌కార్డులు, కొత్త పెన్షన్లు రాబోతుండటంతో తెలంగాణ ప్రజలు తెగ ఖుషీ అవుతున్నారు. ఇవి రెండూ ఇస్తున్నందుకు కేసీఆర్‌కు కంటే.. ఈటలకే ఎక్కువ థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు తెలంగాణ ప్రజలు.