ఏపీ మంత్రులు గాజులు తొడుక్కున్నారా..?
posted on Jul 5, 2021 @ 1:24PM
తెలంగాణ సర్కారు అంతలా ఓవరాక్షన్ చేస్తున్నా.. ఏపీ ప్రభుత్వం చేతగానట్టు చేతులెత్తేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ మంత్రులు సీఎం జగన్‌ను, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌నూ నోటికొచ్చినట్టు తిడుతున్నా.. ఏపీ మంత్రులు మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోంది. బూతుల మంత్రిగా పాపులర్ అయిన కొడాలి నాని సైతం చాలా సుతిమెత్తగా మాట్లాడటం ఆశ్చర్యం. అగ్రెసివ్ మినిస్టర్‌గా పేరున్న నీళ్ల మంత్రి అనిల్‌కుమార్ సైతం ఆ-ఊ అంటూ ఉత్తుత్తి మాటలు చెబుతుండటం అనుమానాస్పదం.
ఇక సీఎం జగన్‌ను గజదొంగ అని తిడుతుంటే.. ఏపీ మంత్రులకు రేషం రావట్లేదంటే తమ నేత గజదొంగేనని వాళ్లు పరోక్షంగా ఒప్పుకున్నట్టేనా? అని కొందరు నిలదీస్తున్నారు. అయితే, దివంగత మహానేతను సైతం నీళ్లదొంగ అంటున్నా వైసీపీ నాయకులు నోరు మూసుకొని కూర్చోవడం వారి చేతగానితనానికి నిదర్శనమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, తాజాగా వైఎస్సార్‌ను అన్నేసి మాటలు అంటున్నా.. ఏపీ మంత్రులు సైలెంట్‌గా ఉండటంపై ఒకప్పటి వైఎస్సార్ అనుచరుడైన జేసీ ప్రభాకర్‌రెడ్డి ఫైర్ అయ్యారు.
రాజశేఖర్‌రెడ్డి లాంటి పెద్ద మనిషిని బండ బూతులు తిడుతుంటే ఏం చేస్తున్నారని.. టీడీపీ నేతలను ఇష్టం వచ్చినట్టు తిట్టే ఏపీ మంత్రులు ఇప్పుడు గాజులు తొడుక్కున్నారా? అని మండిపడ్డారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. సీఎం జగన్ కామెంట్లపైనా కస్సుమన్నారు. హైదరాబాదులో సెటిలర్స్ ఎవరని నిలదీశారు. తమ పిల్లలు హైదరాబాద్‌లోనే పుట్టారని.. అక్కడే చదువుకున్నారని.. ఇక్కడ ప్రజలు తరుచూ హైదరాబాద్‌కి వెళ్తుంటారని.. అలాంటి వాళ్లు సెటిలర్స్ ఎలా అవుతారని జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.
పనిలో పనిగా.. తెలంగాణ మంత్రులపైనా విరుచుకుపడ్డారు. తెలంగాణకు ద్రోహం చేశారని.. వైఎస్సార్ రాక్షసుడు అని తెలంగాణ మంత్రులు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు జేసీ. రాజశేఖర్ రెడ్డి లాంటి పెద్ద మనుషిని రాక్షసుడు అంటారా? అంటూ జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్.. ఆఖరికి తన తండ్రిని తిడుతున్నా.. పడాల్సిన అవసరం ఏముందని ఆగ్రహంతో పాటు అనుమానమూ వ్యక్తం చేశారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.