12 మంది ఎమ్మెల్యేలపై వేటు.. రాజకీయంగా దిమ్మ తిరిగే షాక్..
posted on Jul 5, 2021 @ 5:29PM
స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంతకు ముందెప్పుడూ లేనంత షాకింగ్ డెసిషన్. ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలపై వేటు.. ఒక రోజు, రెండు రోజులు కాదు.. ఏకంగా ఏడాది పాటు బహిష్కరణ.. ఇదేమీ మామూలు న్యూస్ కాదు.. అందుకే ఈ బ్రేకింగ్ న్యూస్ పొలిటికల్‌గా షేక్ చేస్తోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ నిర్ణయం ఇప్పుడు దుమారం రేపుతోంది. బీజేపీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతోంది.
మహారాష్ట్ర తాత్కాలిక స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేశారు. ఆ 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తాత్కాలిక స్పీకర్‌ను దూషించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సస్పెండ్ చేస్తూ తాత్కాలిక స్పీకర్ నిర్ణయం తీసుకోవడం మరాఠా పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. స్పీకర్ నిర్ణయంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎపిసోడ్‌తో మహారాష్ట్ర పాలిటిక్స్ కీలక టర్న్ తీసుకున్నట్టైంది.
రెండు రోజులుగా మహారాష్ట్రలో నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. బీజేపీ-శివసేన శత్రువులు కారంటూ మహరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ-కాంగ్రెస్-ఎన్సీపీ సర్కారును ఎప్పుడెప్పుడు పడగొట్టాలా అని గోతికాడ నక్కలా కాచుకు కూర్చొన్న కమలనాథులు.. సరైన ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో శరద్‌పవార్ మేనల్లుడితో పార్టీని చీల్చాలనే ఎత్తుగడ ఘోరంగా తిప్పికొట్టడంతో అప్పటి నుంచి కాస్త జాగ్రత్తగా ఉంటోంది. మహా అఘాడి కుటమిలో చిచ్చు పెట్టేందుకే అన్నట్టు.. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్.. విభేదాలు ఉన్నంత మాత్రాన బీజేపీ-శివసేనలు శత్రువులు కాదంటూ కాక రేపారని అంటున్నారు. రాజకీయాల్లో "అయితే", "కానీ" వంటి పదాలు ఉండవని.. పరిస్థితులను బట్టే నిర్ణయాలు ఉంటాయని.. బీజేపీ కలిసే శివసేన పోటీ చేసిందని.. ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్‌సీపీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపిందంటూ ఫడ్నవిస్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేలా కామెంట్స్ చేశారు.
బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ మాటలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మరింత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ-శివసేనల మధ్య సంబంధాన్ని అమీర్‌ఖాన్-కిరణ్‌రావులతో పోల్చారు. ఇటీవలే ఈ బాలీవుడ్ జంట విడిపోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. వారిద్దరి రిలేషన్‌తో పొల్చడంతో.. ఇక బీజేపీ-శివసేనల మధ్య ఎలాంటి బంధం లేదన్నట్టు సంజయ్ రౌత్ తేల్చి చెప్పేశారు.
మరోవైపు.. సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై మరో రకమైన విశ్లేషణ కూడా చేస్తున్నారు. మహారాష్ట్రలోని అధికార మహా అఘాడి సర్కార్‌లో విభేదాలు వచ్చాయని.. శివసేనకు బీజేపీ దగ్గరవుతోందని ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో రౌత్ తాజా వ్యాఖ్యలు చేశారు. ''మేమేమీ ఇండియా, పాకిస్థాన్ కాదు. అమీర్ ఖాన్, కిరణ్ రావులను చూడండి. మా సంబంధం అలాంటిదే. ఎవరి రాజకీయ మార్గాలు వారివి. కానీ మిత్రత్వం ఎప్పటిలాగే ఉంటుంది'' అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పడం రెండు రకాల అర్థాలను ధ్వనిస్తోంది.
ఇలా, రాజకీయంగా శివసేన-బీజేపీల మధ్య ఏదో జరుగుతోందనే చర్చ పీక్స్‌కు చేరిన సమయాన.. తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీలో తాత్కాలిక స్పీకర్‌గా ఉన్న ఎన్సీపీకి చెందిన నర్హరి సీతారం.. ఏకంగా 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాది పాటు సస్పెండ్ చేయడం కలకలం రేపుతోంది. బీజేపీ సభ్యులపై వేటు.. ఆ పార్టీని శివసేనకు దగ్గర కాకుండా రెచ్చగొట్టడానికా? లేక, మా కూటమి అంతా ఒక్కటేనని బీజేపీకి స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడానికా? అనేది ఆసక్తికరంగా మారింది.