హుజురాబాద్ లో హరీష్ స్కెచ్? విపక్షాలకు చుక్కలేనా..?
హుజురాబాద్ నియోజక వర్గం ఉప ఎన్నికలో గెలుపు తెరాసకు, అవసరం. ఒక్క తెరాసకు మాత్రమే కాదు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కూడా కీలకం. అయితే, తెరాసకు కొంచెం ఎక్కువ అవసరం.ఇది ముఖ్యమంత్రి కేసీఆర్’కి ఇజ్జద్ కి సవాల్.అందుకే,గులాబీ బాస్, హుజురాబాద్ బాధ్యతలను, హరీష్ రావుకు అప్పగించారు. హరీష్ రావుకు బాధ్యత అప్పగిస్తే, ఇక తిరిగి చూసుకోవలసిన అవసరం ఉండదు అనేది, కేసీఆర్ మొదలు తెరాస సాధారణ కార్యకర్త వరకు అందరికీ ఉన్న విశ్వాసం. మొన్నటి దుబ్బాక ఎన్నికల ప్రచారంలో అయితే, అదే మాట హరీష్ రావు స్వయంగా చెప్పుకున్నారు. “నేను ఎక్కడికి వెళ్ళినా, అక్కడి నుంచి గెలుపునే పట్టుకెళతాను” అని చాలా విశ్వాసంతో ప్రకటించుకున్నారు. ఫలితం ఏమిటో వేరే చెప్ప నక్కరలేదు. అయితే, అంత మాత్రం చేత, దుబ్బాక నుంచి ఆయన ఓటమిని పట్టుకెళ్ళారు, కాబట్టి, హరీష్ ఆట అయిపోయిందని అనుకోలేము. ఆ తర్వాత హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. ఆఖరి నిముషంలో పీవీ కుమార్తె వాణీదేవిని అభ్యర్ధిగా ప్రకటించినా, హరీష్ మరోసారి తన సత్తా నిరుపించుకున్నారు. ఆమెను గెలిపించారు. అందుకే రాజకీయాల్లో అట అయిపోవడం ఉండదు, 24X 7 మ్యాచ్ నడుస్తూనే ఉంటుంది.
అందుకే మళ్ళీ అత్యంత కీలకమైన హుజురాబాద్ ఉప ఎన్నిక బాధ్యతను కేసీఆర్, అల్లుడు హరీష్’కు అప్పగించారు. నిజమే, బాధ్యత హరీష్ మీద ఉంచినా, కీసీఆర్ మొదలు చిన్నాపెద్ద నాయకులు అందరూ, హుజురాబాద్ గెలుపు కోసం, మేము సైతం’ అంటూ నడుం బిగించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నాయకులంతా ఇప్పటికే అక్కడకు చేరుకున్నారు. ప్రచారం ప్రారంభించారు. ఎవరికి అప్పగించిన పనిని వారు ఇంచక్కా చక్క బెట్టేస్తున్నారు. గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, బాల్క సుమన్ సహా పలువురు టీఆర్ఎస్ నేతలందరూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మధ్య మద్యలో మంత్రులు వెళ్లి వస్తున్నారు. అన్నిటినీ మించి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదో ఒక పేరున జనంలోకి వెళ్లి ‘లైవ్ ‘ లో ప్రచారం చేస్తున్నారు.
ఇక హుజురాబాద్ ఉప ఏన్నిక ఎపిసోడ్’ ప్రధాన పాత్రదారి, మాజీమంత్రి ఈటల రాజేందర్, ఆయన వెంట బీజేపీ సేనలు, ప్రచారం సాగిస్తున్నారు. ఈటల తమ మాజీ బాస్’కు ఏ మాత్రం తీసిపోకుడా ఆయన భాషలో సమాధానం చెపుతున్నారు. ఇరువర్గాల నాయకులు మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు జోరుగా సాగుతున్నాయి. నిజానికి, ఉపఎన్నిక తేదీ ఇంకా ఖరారు కాకపోయినా, ఇప్పటికే హుజురాబాద్’ లో ఎన్నికల సందడి మొదలైంది. అదలా, ఇంతవరకు కాస్త స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలోనూ రేవంత్ రెడ్డి రాకతో జోష్ పెరిగింది. రేపు జులై 7 పీసీసీ ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత రంగంలోకి దిగితే, ఇక అసలు కథ అప్పుడుమొదలవుతుంది.
ఇంత జరుగుతున్నా హరీష్ మాత్రం ఇంతవరకు అటుగా వెళ్ళలేదు. హుజురాబాద్ వైపు కన్నెత్తి చూడలేదు. హుజురాబాద్ గడప తొక్కలేదు. కథ మొత్తం హైదరాబాద్, సిద్దపేట నుంచే నడిపిస్తున్నారు.అంతా బానే వుంది, అయితే, హరీష్ ఎందుకు దూరంగా ఉంటున్నారు? దుబ్బాకలో, ‘ఒరేయ్ బండి సంజయ్ ...’ అంటూ గర్జించిన హరీష్ హుజురాబాద్ విషయంలో తెరవెనక పాత్రకే ఎందుకు పరిమితం అవుతున్నారు, అనే అనుమానాలు పార్టీ వర్గాల్లో కూడా వినిపిస్తున్నాయి. అలాగే ఏవేవో వ్యుహాగానాలు కూడా వినిపిస్తునాయి. అయితే, హరీష్ తెర మీద కనిపించక పోయినా, ఆయన స్కెచ్ ప్రకారమే కథ నడుస్తోందని పార్టీ వర్గాలు అంటున్నాయి. హుజురాబాద్, వ్యవహారం అంతా ఆయన కనుసన్నల్లోనే జరుగుతోందని, ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత హరీష్ రియల్ ఎంట్రీ ఉంటుందని పార్టీ వర్గాలు చెపుతున్నాయి.
ప్రస్తుతం హరీష్ పార్టీలో చేరికలు, సమాలోచనలు కూడా హైదరాబాద్, సిద్దిపేట నుంచే నడిపిస్తున్నారు. నిన్న గాక మొన్న, కొందరు చోటామోటా బీజేపే నాయకులు కూడా హైదాబాద్ వచ్చి అయన చేతుల మీదుగా గులాబీ కండువా కప్పుకున్నారు. ఒక విధంగా హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని హరీష్ అధికార నివాసం, హుజురాబాద్ తెరాస ఎన్నికల కార్యాలయంలాగా మారిపోయింది. ఏమైనా హరీష్, మామూలోడు కాదు, మామకు తగ్గ అల్లుడు. కేసీఆర్ పదవులకు ఆయన వారసుడు అయినా కాకపోయినా, ఆయన రాజకీయ ఎత్తులు,వ్యూహ ప్రతివ్యుహాల చతురతకు మాత్రం ఆయనే నిజమైన వారసుడు అంటారు.గతంలో, ఉద్యమ కాలం నుంచి అనేక సందర్భాలాలో అది రుజువైంది. ఇక ముందు కూడా అదే నిజం అవుతుందా లేదా అనేది హుజురాబాద్ ఫలితంతో తెలుస్తుంది.