‘రా’ఏజెంట్ @ టెర్రరిస్ట్.. ఉగ్ర కథా చిత్రమ్..
posted on Jul 4, 2021 @ 12:34PM
నేను ‘రా’ఏజెంట్.. ఇప్పుడే మేడమ్‌కు రిపోర్టు చేశా.. దేశం కోసం పని చేస్తున్నా.. ‘రా’ కీలక ఆపరేషన్ అప్పగించింది.. ఆ టాస్క్ మీదే ఉన్నా.. ఇలా దేశ అత్యున్నత సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్-రా పేరును ఇష్టం వచ్చినట్టు వాడేసుకున్నాడు ఆ ఉగ్రవాది. భార్యకు, మాజీ సైనికాధికారి అయిన తండ్రికి ఇలా సొల్లు కబుర్లు చెప్పి.. తాను ‘రా’ ఏజెంట్‌నని నమ్మించాడు. పాపం.. ఆ కుటుంబ సభ్యులు సైతం తమవాడు ‘రా’ ఏజెంట్ అనే నమ్మారు. అందుకే, తరుచూ అర్థరాత్రి గంటల తరబడి ఫోన్లో మాట్లాడినా అనుమానించలేదు. అనుమానాస్పద వస్తువులు ఇంట్లో కనిపించినా ప్రశ్నించలేదు. పైగా తమ వాడు దేశంకోసం పని చేస్తున్నాడంటూ గర్వంగా ఫీల్ అయింది ఆ ఫ్యామిలీ.
కట్ చేస్తే, ‘రా’ఏజెంట్ డ్రామా టెర్రరిస్ట్ టర్న్ తీసుకుంది. సంచలనం సృష్టించిన దర్భంగా రైల్వేస్టేషన్ పార్సిల్ బాంబు పేలుళ్ల కేసుల నిందితుడిగా తేలాడు మహమ్మద్ నాసర్ ఖాన్. నలుగురు నిందితుల్లో వాడూ ఒకడు. నాసర్ ఖాన్ తాను ‘రా’ ఏజెంట్ అని ఇంట్లో బిల్డప్ కొట్టి.. బయట బాంబులు పేల్చిన టెర్రరిస్ట్. ఎన్ఐఏ విచారణలో ఈ విషయాలు వెలుగుచూశాయి. ‘రా’ ముసుగులో ఇంటినే టెర్రరిస్ట్ డెన్‌గా మార్చిన ఆ కేటుగాడి ఉదంతం దర్యాప్తులో బయటపడింది.
జూన్ 17న బిహార్‌లో చోటుచేసుకున్న దర్భంగా పేలుళ్ల కేసులో ఇటీవల హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లోని అన్నాదమ్ములు ఇమ్రాన్‌ఖాన్, నాసిర్ ఖాన్‌లను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. వీరి అరెస్టుతో వారి ఫ్యామిలీ షాక్ అయింది. అదేంటి.. తన కొడుకు భారత గూఢచారి.. తననెందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ.. మాజీ సోల్జర్ అయిన నాసిర్ తండ్రి ఎన్ఐఏను ప్రశ్నించాడంటే.. ఆ ఉగ్రవాది ఇంట్లో వాళ్లను ఏ రేంజ్‌లో మేనేజ్ చేశాడో తెలుస్తోంది.
ఇంట్లో ‘రా’ఏజెంట్ అనే డ్రామాను మహమ్మద్ నాసర్ ఖాన్ కొన్నేళ్లుగా రక్తి కట్టిస్తున్నాడు. క్రమక్రమంగా కరుడుగట్టిన ఉగ్రవాదిగా మారాడు. 2012లో ఓ బంధువును కలుసుకోవడం కోసం అంటూ అధికారిక పత్రాలతో నాసిర్ పాకిస్థాన్ వెళ్లాడు. ఆ సమయంలో తనకు ‘రా’ ఓ కీలక టాస్క్ అప్పజెప్పిందని భార్యను, మాజీ సైనికుడైన తండ్రిని నమ్మించాడు. ఆ తర్వాత అనధికారికంగా వేర్వేరు మార్గాల్లో పాకిస్థాన్‌కు రెండు,మూడు సార్లు వెళ్లివచ్చాడు. ఆ క్రమంలో 4 నెలల పాటు పాక్-అఫ్గానిస్థాన్ బోర్డర్‌లో లష్కరే శిబిరంలో బాంబుల తయారీలో శిక్షణ పొందాడు. టైమర్ పరికరాలు వాడటం, ఐఈడీ బ్లాస్టింగ్స్ చేయడంలో ఎక్స్‌పర్ట్‌గా మారాడు.
పాక్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు.. ఇటీవల బాంబు పేలుడు జరపడం.. ఎన్ఐఏ దర్యాప్తులో నాసిర్ దొరికిపోవడం.. విచారణలో ‘రా’ఏజెంట్ అని ఇంట్లో వారిని బురిడీ కొట్టించిన విషయం వెలుగుచూడటం.. తదితర విషయాలన్నీ జరిగాయి. ఈ నెల 17న బిహార్‌లోని దర్భంగా రైల్వే స్టేషన్‌లో పార్సిళ్లు దింపుతుండగా పేలుడు సంభవించింది. దుస్తుల మధ్యలో ఉంచిన చిన్న సీసా నుంచి పొగలు వచ్చి పేలుడు జరిగింది. దర్యాప్తు జరపగా.. ఆ పార్సిల్ సికింద్రాబాద్‌లో బుక్ చేసినట్లు గుర్తించడం.. ఉగ్ర కోణంపై అనుమానం రావడంతో.. కేసు ఎన్ఐఏకు బదిలీ అయింది. ఈ కేసులో యూపీలో ఇద్దరు, హైదరాబాద్‌లో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లో అద్దెకు ఉంటూ రెడీమేడ్ డ్రెసెస్ అమ్ముతున్న ఇమ్రాన్, నాసిర్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. ఈ విచారణలో భాగంగానే టెర్రరిస్ట్ నాసిర్ ఖాన్ ఆడిన.. ‘రా’ఏజెంట్ డ్రామా బయటకు వచ్చింది.