నోట్లకు ఓట్లు.. జగన్న స్కీములు! ఏపీకి గుది బండలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురవారం (జులై22) మళ్ళీ మరో బటన్ నొక్కారు. వైఎస్సార్ కాపు నేస్తం సెకండ్ ఇయర్, అమౌంట్’ను రిలీజ్ చేశారు. కాపు,బలిజ,తెలగ, ఒంటరి కులాలకు చెందిన 3లక్షల 27వేల 244 మంది మహిళా లబ్దిదారుల ఖాతాలలోకి రూ.490.86 కోట్లు జమయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి,తమ ప్రభుత్వ గొప్పతనాన్ని చెప్పుకొచ్చారు. ఒక్క కాపు నేస్తం పథకం కిందనే, రెండేళ్లలో మొత్తం రూ. 981.88 కోట్లు (మొదటి సంవత్సరంలో 3లక్షల 27వేల 349 మందికి రూ.491.02 కోట్లు, రెండవ సంవత్సరం 3లక్షల 27 వేల 244 మంది లబ్దిదారులకు రూ.490.86 కోట్లు) నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని సగౌరవంగా ప్రకటించుకున్నారు. అంతే,కాదు, తమ ప్రభుత్వం ఇతవరకు వివిధ పథకాల కింద మొత్తం 59 లక్షల 63 వేల 308 మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ.12 వేల 126.78 కోట్లు జమ చేసిందని జబ్బలు చరుచుకున్నారు.
అయితే, గత సంవత్సర కాలంలో వివిధ పథకాల కింద, నగదు బదిలీ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారుల ఖాతాల్లో జమచేసిన మొత్తంలో, తక్కువలో తక్కువ రూ.700 కోట్లు, చేరకూడని చేతులకు చేరిందని, ఎవరో కాదు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులే లెక్క తేల్చారు. ఆ వివరాలలోకి వెళితే, జగన్ రెడ్డి ప్రభుత్వం అప్పులు చేసి మరీ చేస్తున్న పందారాలు,నిజంగా ఎవరి చేతుల్లోకి వెళుతున్నాయో, ఎంతలా దుర్వినియోగం అవుతున్నాయో వేరే చెప్పనక్కర లేదని అధికారులే విస్మయం వ్యక్తపరుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 జూన్ నుంచి, 2021 జూన్ వరకు, లక్ష కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని, వేర్వేరు ఉచిత పథకాల కింద పేద ప్రజలకు పంచి ఇచ్చామని పలక పక్షం నాయకులే పేర్కొంటున్నారు. ప్రభుత్వం కూడా అదే అంటోంది.
ఇటీవల రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో, నగదు రాకపోకల పరిస్థితిని, వివిధ పథకాల కింద ప్రయోజనం పొందుతున్నలబ్దిదారుల డేటాను సమీక్షించారు. అదికూడా మొత్తంగా కాదు, పైపైన ఇలా పట్టి చూశారు. అక్కడికే దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు. పీటీఐ వార్త సంస్థ కథనం ప్రకారం, గడచిన రెండు సంవత్సరాల కాలంలో సుమరుగా రూ.3,000 కోట్లు అనర్హుల బ్యాంక్ ఖాతాల్లోకి వెళ్ళిపోయాయి. ఇందులో ప్రధానంగా లక్షలాది మంది లబ్దిదారులున్న అమ్మఒడి(ప్రతి తల్లికి రూ. 15,000), పీఎం కిసాన్ రైతు భరోసా (ఒక్కొక్క రైతుకు రూ. 13,50),చేయూత(45 సంవత్సరాలు నిండిన బీసీ,ఎస్సీ ఎస్టీ, మైనారిటీ మహిళలకు ప్రతి సంవత్సరం రూ. 18,750), వాహన మిత్ర (ప్రతి కాబ్ /ఆటో డ్రైవర్’కు రూ.10,000), మత్సకార భరోసా (ప్రతి బెస్తవానికి రూ.10,000) వంటి వార్షిక పథకాలున్నాయి. ఈ పథకాల లబ్దిదారులలో బోగస్ లబ్దిదారులు ఎక్కువగా బయట పడ్డారు. ఈ నేపద్యంలోనే, జూన్ 22 న ముఖ్యమంత్రి చేయూత పధకం కింద 23, 41, 827 మంది లబ్దిదారులు ఒక్కొక్కరికి రూ.18,750 చొప్పున బటన్ నొక్కివిడుదల చేశారు. అయితే ఆతర్వాత ఆ ఒక్క స్కీమ్’లో 89,694 మంది బోగస్ లబ్దిదారులు ఉన్నట్లు గుర్తించి రూ.168.17కోట్ల పేమెంట్ ఆపేసినట్లు ఆర్థిక శాఖ అధికారుల సమాచారం.
ఇతర పధకాల విషయంలోనూ ప్రజల సొమ్ము పక్కదారులు పట్టి పోతున్నదని, అమ్మఒడి లాంటి పథకాల విషయంలో అయితే,అసలు ఒక పద్దతి పాడు లేదని అధికారులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. ఈపథకం 2020 జనవరిలో ప్రారంభించారు, ఆ తర్వాత స్కూల్స్ పట్టుమని రెండు నెలలు కూడా పనిచేయలేదు. కొవిడ్ కారణంగా మూతపడ్డాయి. దీంతో తలాతోకా లేకుండా అమ్మ ఒడి పథకం అమలవుతోంది.ఒక విధంగా ఈ పధకం దోపిడీకి మరు పేరుగా మారిందని, ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు చెపుతున్నారు. ఒక వంక అప్పులు తెచ్చి అమలు చేస్తున్న పథకాలు ఇలాగే సాగితే, రాష్ట్రం దివాలా తీయడమే కాదు ..ప్రజలు కూడా దివాలా తీయడం ఖాయంగా కనిపిస్తోందని ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు. అయితే, అధికారాన్ని నిలుపుకునేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం ఉచిత వరాల విషయంలో విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తోందని,దీని దుష్పరిణామాలు ముందు ముందు భయంకరంగా ఉంటాయని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.