రఘురామకు ఆర్ఎస్ఎస్ సపోర్ట్.. ఇక జగన్ జైలుకేనా..?
posted on Jul 22, 2021 @ 5:12PM
కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వం. ఆ కూటమికి బిగ్‌బాస్ బీజేపీ. మరి, కమలం పార్టీకి గాడ్‌ఫాదర్ ఆర్ఎస్ఎస్. సంఘ్ అనుమతి లేకుండా బీజేపీ ప్రభుత్వం ఒక్క అడుగు అయినా ముందుకు వేయదు. ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లోనే కేంద్ర నడుస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. సంఘ్ పెద్దల కనుసన్నల్లోనే కేంద్ర పెద్దలు పరిపాలిస్తుంటారని అంటారు. అలాంటిది, బీజేపీని తోలుబొమ్మలా ఆటాడించే ఆర్ఎస్ఎస్‌యే ఇప్పుడు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సపోర్ట్‌గా నిలవడం కీలక పరిణామంగా మారుతోంది. ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉందంటే, బీజేపీ సపోర్ట్ కూడా ఉన్నట్టే.. బీజేపీ సపోర్ట్ ఉందంటే, కేంద్రం సపోర్ట్ కూడా ఉన్నట్టే. ఆ లెక్కన రఘురామపై అనర్హత వేటు వేయాలనే వైసీపీ ప్రయత్నాలకు గండిపడినట్టే. మరోవైపు, జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ స్టాండ్ ఎలా ఉండబోతోందో కూడా గెస్ చేయవచ్చని అంటున్నారు.
ఆర్ఎస్ఎస్ పత్రిక "ది ఆర్గనైజర్"లో ఈ నెల 17న ప్రచురితమైన ప్రత్యేక కథనం ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు, కూల్చివేత.. ఎంపీ రఘురామ కృష్ణరాజును అంతమొందించేందుకు జగన్ కుట్ర పన్నారంటూ ఆయన భార్య బాహాటంగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ కథనం రాయాల్సి వస్తోందంటూ "ది ఆర్గనైజర్" వెల్లడించడం కలకలం రేపుతోంది.
ఒకప్పుడు వలస పాలనలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేసినట్టుగా ఇప్పుడు ఏపీలో అలాంటి విధ్వంస రచన జరుగుతోందనే ప్రచారం జరుగుతోందంటూ కథనం రాశారు. జగన్ పాలనలో హిందూ వ్యతిరేక విధానాలు, అవినీతి, కులతత్వంపై వరుసగా విమర్శలు చేయడం వల్లే రఘురామరాజును అరెస్ట్ చేయించారని ‘ది ఆర్గనైజర్’ కథనంలో పేర్కొంది. రఘురామ కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, కోర్టు జోక్యంతో ఆయనకు ఊరట కలిగిందని తెలిపింది. ఎమర్జెన్సీ విధించినపుడు కూడా ప్రతిపక్ష నాయకులపై ఇలాంటి వేధింపులు జరగలేదంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. అక్రమాస్తుల కేసులో జగన్ 16 నెలలు జైలులో ఉన్నారని, ఆ కాలంలో ఆయన పట్ల అనుచితంగా వ్యవహరించినట్టు ఆరోపణలు రాలేదని గుర్తు చేస్తూ.. రఘురామపై సీఐడీ కస్టడీలో జరిగిన దాడిని పరోక్షంగా ప్రస్తావించింది "ది ఆర్గనైజర్".
ఆర్ఎస్ఎస్ పత్రిక కథనం ఆసాంతం జగన్‌కు వ్యతిరేకంగా.. రఘురామకు సపోర్ట్‌గా సాగింది. ఎంపీ రఘురామపై జగన్ సర్కారు కక్ష్య సాధింపు చర్యలను తీవ్ర స్థాయిలో దుయ్యబట్టింది. ఎమర్జెన్సీ వేధింపులతో పోల్చడాన్ని బట్టి చూస్తే.. రఘురామను జగన్ ప్రభుత్వం ఎంతలా టార్చర్ చేసిందో ఆర్ఎస్ఎస్ గుర్తించినట్టే అనిపిస్తోంది. హిందూ వ్యతిరేకం,, అవినీతి, కులతత్వం లాంటి విమర్శలు చేయడం చూస్తుంటే.. జగన్‌పై సంఘ్ కన్నెర్న జేసిందని ఈజీగా అర్థమైపోతోంది. రఘురామ కృష్ణం రాజు అరెస్ట్ అంశాన్ని ప్రస్తావిస్తూ ఓ సిట్టింగ్ ఎంపీనే టార్గెట్ చేసినపుడు.. రేపు జగన్ అజెండాను విమర్శిస్తే ప్రధాని, హోం మంత్రి, సుప్రీం కోర్టు/హైకోర్టు న్యాయమూర్తులను కూడా టార్గెట్ చేయరా అనే సందేహాలు కలుగుతున్నాయని పత్రిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో చట్టబద్ద పాలన జరగడం లేదని,, జగన్‌ను ఎవరైనా విమర్శిస్తే 24 గంటల్లో అరెస్ట్ చేస్తారని చాలామంది చెబుతున్నారని వ్యాఖ్యానించింది.
ఆర్ఎస్ఎస్ కథనంలో రఘురామకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టైంది. కేంద్రాన్నే శాసించే సంఘ్ పరివారే తనకు మద్దతుగా నిలవడంతో రఘురామలో ఉత్సాహం మరింత పెరిగింది. ఇక, ఆయనపై వేటు పడే అవకాశమే లేదని అంటున్నారు. జగన్ అవినీతిపై సైతం ఆర్ఎస్ఎస్ గుర్రుగా ఉందని స్పష్టం కావడంతో.. ఇక, జగన్ బెయిల్ రద్దుపై సీబీఐ కోర్టు తీర్పు ఎలా ఉంటుందనే ఉత్కంఠ వైసీపీని వేధిస్తోంది.