తెలంగాణలో కుండపోత వానలు.. జనాలు ఇండ్ల నుంచి రావొద్దన్న కేసీఆర్
posted on Jul 22, 2021 @ 12:50PM
తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు తెలంగాణలో కుండపోత వానలు పడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం 25 సెంటిమీటర్ల వర్షం నమోదైంది. గురువారం కూడా కుండపోతగా వాన పడుతూనే ఉంది. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులన్ని నిండిపోవడంతో గేట్లు ఎత్తి దిగువకు వదిలేశారు. దీంతో తూర్పు తెలంగాణలో వరద బీభత్సం కొనసాగుతోంది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి పొంగిపొర్లుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ నుంచి 1 లక్షా 93వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదలడంతో జిల్లాలోని గోదావరీ పరివాహక ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురిలోనూ గోదావరి ఉధృతి పెరుగుతుండగా.. మురో పుణ్యక్షేత్రమైన కోటిలింగాలలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వెల్గటూరు మండలం కోటిలింగాలను ధర్మపురి సీఐ. ఇతర అధికారులతో కలిసి సందర్శించారు. జాలర్లు, గొర్లకాపరులు, రజకులు, భక్తులు ఇలా ఎవ్వరూ కూడా గోదావరీ పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లకూడదని... హెచ్చరించారు. ధర్మపురి, వెల్గటూర్ మండలాల్లో రెవెన్యూ అధికారులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తమై ప్రమాద హెచ్చరికలను జారీచేస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. నిర్మల్ పట్టణంలో భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు నీటమునగడంతో అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తక్షణమే పంపాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.ఎస్సారెస్పీ ఎగువ నుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద పెరుగుతున్నందున వెంటనే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలందరూ ఇళ్లలోంచి బయటకు రాకూడదని సీఎం కేసీఆర్ సూచించారు.ఆయా ప్రాంతాల టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పరిస్థితులను సమీక్షిస్తుండాలన్నారు.
గోదావరితో పాటు కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో... మన రాష్ట్రంతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆయా రాష్ట్రాల వాల్లు కూడా అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తుతున్నారని, ఈ నేపథ్యంలో తెలంగాణలోకి వరద ఉదృతి పెరగనున్నదని గోదావరి కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లోని తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ తమ జిల్లాల్లో, తమ తమ నియోజకవర్గాల్లో వుంటూ ఎప్పటికప్పుడు వరద పరిస్థిని సమీక్షిస్తూ వుండాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఈ ప్రాంతాల అన్నిస్థాయిల లోని టిఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు తెలంగాణ భవన్ కు అందుబాటులో ఉంటూ పరిస్థితులను సమీక్షిస్తుండాలన్నారు. గోదావరి కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోని అధికారులతో పాటు మొత్తం టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి మంత్రుల దాకా, పార్టీ కార్యకర్తలు నేతలంతా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సిఎం ఆదేశించారు. రానున్న రెండు రోజులు అత్యంత భారీ స్థాయిలో వర్షాలు కురిసే పరిస్థితిల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా వుంటూ ఎవరి జాగ్రత్తలు వాల్లు తీసుకోవాలని సిఎం పిలుపునిచ్చారు.