వలస నేతలు ఇమడలేరా? కమలం గూడు ఖాళీ అవుతోందా?
posted on Jul 22, 2021 @ 3:49PM
ప్రపంచంలో కమ్యూనిస్టుల కంటే మాజీ కమ్యూనిస్టులే ఎక్కువ అంటారు. అది కొంతవరకు నిజమే. రాను రాను బీజేపీ పరిస్థితి కూడా అలాగే మారుతోందా, అంటే అవుననే,అని పిస్తోంది. దేశ వ్యాప్తంగా 2014 నుంచి అన్ని రాష్ట్రాలలోలానే ఉభయ తెలుగు రాష్ట్రలలోనూ అన్ని పార్టీలలోని అసంతృప్తులకు, బీజేపీ వేదికగా నిలిచింది. కాంగ్రెస్, టీడీపీ తెరాస పార్టీల నుంచి కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సిట్టింగ్ రాజ్యసభ సభ్యులు ఇంకా ఎందరో ప్రముఖ నాయకులు కమలం గూటికి చేరారు. అయితే, అందులో ఏ కొద్దిమందో తప్పించి మెజారిటీ నేతలు ఆ పార్టీలో ఇమడలేక బయటకు వెళ్లి పోయారు, పోలేని కొందరు ఉక్కపోతకు గురవుతున్నారు.
తెలుగు దేశం పార్టీ నుంచి నలుగురు సిట్టింగ్ రాజ్య సభ సభ్యులు, అందులో ఒకరు కేంద్ర మాజీ మంత్రి, మరొకాయన పదవీకాలం ఈ మధ్యనే ముగిసింది బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆ నలుగురు ఏమి ఆశించారో ఏమో కానీ, బీజేపీ గూటికి చేరారు. కనీ ఇంతవరకు కేంద్ర మంత్రి పదవి కాదు కదా, అంతో ఇంతో గుర్తింపు, గౌరవం ఉన్న పదవి ఏదీ ఏ ఒక్కరికీ దక్కలేదు. మంత్రి వర్గ విస్తరణ సమయంలో ఒకటి రెండు పేర్లు వినిపించినా , ఫైనల్ లిస్టులో ఒక్క పేరు కనిపించ లేదు.పార్టీలో చేరిన సిట్టింగ్ ఎంపీల పరిస్థితే ఇలా ఉంటే ఇక మాజీల గురించి చెప్పేదేముంటుంది. అందుకే మెల్లమెల్లగా కమలం గూటికి చేరిన ఇతర పార్టీల నాయకులు, వచ్చిన దారినే వెనక్కి వెళ్ళే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
ముఖ్యంగా రేవంత్ రెడ్డి టీపీసీసీ పగ్గాలుచేపట్టిన తర్వాత తెరాస వ్యతిరేక శక్తులకు ఒక ప్రత్యాన్మాయ వేదిక లభించినట్లైంది. అందుకే ఇప్పటికే బీజేపీ గూటికి చేరిన కొందరు ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. ఈ మధ్యనే, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్, భూపాలపల్లికి చెందిన మరో సీనియర్ నాయకుడు గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్దమయ్యారు.
ఇప్పుడు ఇంకొందరు ముఖ్యంగా బీజేపీలో చేరిన మాజీ టీడీపీ నాయకులు కూడా రేవంత్ రెడ్డిటి ఉన్న పాత సంబంధాల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టిడిపి నుంచి కమలం తీర్థం పుచ్చుకున్న నేతల్లో అసంతృప్తి కాస్త ఎక్కువే ఉందని సమాచారం. పదవుల విషయంలో తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదనే ఆవేదన రోజురోజుకు పెరుగుతోంది. చివరకు పార్టీ కార్యక్రమాల సమాచారం కూడా ఇవ్వక పోతే,ఇక పార్టీలో ఉండేమిటి, లేకేమిటి? అని, మాజీ టీడీపీ నేతలు తమను తాము ప్రశ్నించుకుంటున్నారు. మదన పడుతున్నారు.
ఇటీవలనే ఈటల రాజేందర్’ను పార్టీలోకి తీసుకునే విషయం జిల్లా నాయకులకు చెప్పక పోవడం ఏమిటని, మాజీ మంత్రి పెద్ది రెడ్డి తీవ్ర అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే, కొన్ని వ్యక్తిగత కారణాల వలన ఆయన ఇంకా పార్టీలో కొనసాగుతున్నా, కన్నుగీటితే చాలు కారెక్కెందుకు పెద్ది రెడ్డి సిద్ధంగా ఉన్నారని సమాచారం. అలాగే, మోత్కుపల్లి కూడా గులాబీ బాస్ కాల్ కోసం వెయిటింగ్’ లో ఉన్నారని అంటున్నారు. ఈ మధ్య ముఖ్యమంత్రి ఏర్పాటుచేసిన దళిత నేతల సమావేశాన్ని పార్టీ బహిష్కరించినా, మోత్కుపల్లి ఆ సమావేశానికి వెళ్ళడమే కాకుండా ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు. . ఇప్పటికే కొంత కాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ బీజేపీ లోనే ఉన్నా… ఆయన ఇంటికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మధు యాష్కీ గౌడ్ వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది. మాజీ ఎంపీ గరిక పాటి కూడా వ్యక్తిగత కారణాలతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇలా ఒకరొకరు వచ్చిన దారిలో వెనక్కి పోవడంతో కమలం మాజీల సంఖ్య రోజురోజుకు పెరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
నిజానికి, బీజేపీలో ఇమడడం అందరికీ అయ్యే పనికాదు. ఇటీవల కాలంలో పార్టీలోకి ఎవరు వస్తానన్నా వద్దనకుండా స్వాగతం పలుకుతున్నారు. అయితే, అది గర్భగుడి ఈవలి వరకే .. గర్భ గుడిలోకి ప్రవేశం కావాలంటే ... ఆర్ఎస్ఎస్ ఎంట్రీ పాస్ మస్ట్. అదుంటేనే లోపలకి లేదా... మరికొంత కాలం నిరీక్షించక తప్పుదు.కాదంటే ... సొంతగూటికి చేక్కేయడమే ఉత్తమ్ అన్న అభిప్రాయం వినవస్తోంది.