జగన్ అవినీతిపై సంఘ్ ఆగ్రహం.. సంచలన కథనంతో కలకలం..
posted on Jul 22, 2021 @ 9:32PM
జగన్ ఏం చేస్తుంటారు? ఇప్పుడు ముఖ్యమంత్రి. గతంలో ప్రతిపక్షనేత. అంతకుముందు ఖాళీ. ఆయనేదైనా ఉద్యోగం చేస్తారా? అంటే చేయరు. ఆయనకేమైనా వ్యాపారాలు ఉన్నాయా? అంటే పెద్దగా ఏమీ లేవనే చెబుతారు. మరి, వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? ఇదే డౌట్ గతంలో అందరికీ వచ్చింది.. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సైతం ఇదే అనుమానం వ్యక్తం చేయడం.. జగన్ అవినీతిపై సంచలన కథనంతో నిలదీయడం.. ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది.
ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడే సంఘ్ పరివార్‌కు జగన్ అవినీతి విషయం గుర్తుకు రావడం ఆసక్తికర పరిణామం అంటున్నారు. జగన్ విషయంలో కేంద్ర వైఖరి మారబోతుందనే దానికి నిదర్శనమని చెబుతున్నారు. ఇన్నాళ్ల బీజేపీ, వైసీపీల రహస్య స్నేహం బ్రేకప్ దశకు చేరుకుందని తెలుస్తోంది. ఏపీలో జరుగుతున్న ఆలయాలపై దాడులు, మత మార్పిడిలపై హిందుత్వ సంస్థలు గుర్రుగా ఉన్నాయని.. అందుకే జగన్ అవినీతిపై ఆర్ఎస్ఎస్ తన "ది ఆర్గనైజర్" పత్రికలో నేరుగా దాడికి దిగిందని అంటున్నారు. ఇంతకీ "ది ఆర్గనైజర్"లో ఏం రాశారంటే..
అక్రమాస్తుల కేసులో 2012లో సీబీఐ జగన్‌ను అరెస్టు చేసిందని.. ఆ సమయంలో ఆయన దేశంలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడిగా ఆరోపణలు వచ్చాయని ది ఆర్గనైజర్ పేర్కొంది. తన తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినందుకు గాను పలు కంపెనీలకు లబ్ధి కలిగేలా కుట్రపన్నారని సీబీఐ చార్జిషీటులో పేర్కొందని వెల్లడించింది. ఇది సిగ్గు పడాల్సిన విషయం కాదా అని ప్రశ్నించింది. బెంగళూరు, పులివెందుల, హైదరాబాద్‌లలో జగన్ విలాసవంతమైన భవంతులు నిర్మించారని, అమరావతిలోనూ అత్యంత ఖరీదైన భవంతిని నిర్మించారని వెల్లడించింది.
2011లో హైదరాబాద్‌లోని జగన్ నివాసంలో సీబీఐ దాడులు చేసినప్పుడు.. ఎకరా విస్తీర్ణంలో 75 గదులున్న ఆ భవనంలో విచారణ చేసేందుకు సీబీఐకి పది గంటల సమయం పట్టిందని తెలిపింది. ఈ భవనం విలువ దాదాపు రూ.400 కోట్లు ఉంటుందని అనధికారిక అంచనా అని వెల్లడించింది. ఈ భవనంపై హెలిప్యాడ్ నిర్మించే యోచనలో జగన్ ఉన్నారంటూ ప్రచారం జరిగిందని, బెంగళూరులోని ఆయనకు చెందిన 31 ఎకరాల భవన సముదాయంలో హెలిప్యాడ్ ఉందని వెల్లడించింది. జగన్ అక్రమాస్తుల కేసులో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేరు ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. జగన్ ఒక్క ఉద్యోగం కూడా చేయలేదని, వ్యాపారమూ నిర్వహించలేదని, అయినా ఆయనకు వందల కోట్ల సంపద ఎక్కడి నుంచి వచ్చిందని ఘాటుగా విమర్శించింది "ది ఆర్గనైజర్".
ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే అయినప్పటికీ.. ఆర్ఎస్ఎస్ పత్రికలో ఇలాంటి ప్రత్యేక విమర్శనాత్మక కథనం రావడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆర్ఎస్ఎస్ వైఖరి దేనికి సంకేతం అనే ప్రశ్న మొదలైంది. ఆర్ఎస్ఎస్ అభిప్రాయమే బీజేపీ అభిప్రాయం అంటారు.. అలాంటప్పుడు బీజేపీ నేతృత్వంలోని కేంద్రం సైతం జగన్ అవినీతిపై ఆగ్రహంతో ఉందా? ఇకపై కేంద్రం నుంచి సహాయ నిరాకరణ తప్పదా? త్వరలోనే రాబోతున్న సీబీఐ కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? ఆర్ఎస్ఎస్ ఆదేశాలతో బీజేపీ కన్నెర్ర జేస్తే.. జగన్ పరిస్థితి ఏంటి? జగన్ విషయంలో కేంద్ర వైఖరి మారిపోనుందా? ఇదంతా జగన్ బెయిల్ రద్దుకు ముందస్తు సంకేతమా? అందుకే జగన్‌లో టెన్షన్ నెలకొందా..