అప్పులపై నిప్పులతో కడిగేసిన పయ్యావుల.. సమాధానం చెప్పగలవా బుగ్గన?
posted on Jul 22, 2021 @ 9:03PM
చేసిన అప్పులను ప్రభుత్వం దాయడంపై, ఆర్థిక మంత్రి బుగ్గన చెబుతున్న బుర్రకథలపై.. పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ మరోసారి మండిపడ్డారు. పాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయడం తప్పుకాదని.. చేస్తే ఆ వివరాలు సమగ్రంగా ఉండాలని టీడీపీ సీనియర్ నేత పయ్యావుల మండిపడ్డారు. అప్పుల విషయాన్ని శాసనసభకు తెలపకుండా రహస్యంగా దాచారని దుయ్యబెట్టారు. రాజ్యాంగానికి విరుద్దంగా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని తప్పుబట్టారు.
సహజంగా ఏ అప్పు చేసినా, ప్రభుత్వం ఏ గ్యారెంటీ ఇచ్చినా బడ్జెట్ పద్దులు ప్రవేశపెట్టే సమయంలో దాన్ని రాష్ట్ర శాసనసభకు వాల్యూమ్ 5/2 అనే పుస్తకంలో తెలపాలని చెప్పారు. అయితే ప్రభుత్వం అప్పులను ఆ పుస్తకంలో తెలియజేయకుండా దాచిందని తప్పుబట్టారు. బ్యాంకులకు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వనందున ఆ పుస్తకంలో రాయలేదని ఆర్థిక మంత్రి బుగ్గన అంటున్నారని.. బ్యాంకులేమో గ్యారెంటీలు ఉన్నాయంటున్నాయని తెలిపారు. ఆ మేరకు బ్యాంకులతో రాష్ట్రం ప్రభుత్వం చేసిన గ్యారెంటీ అగ్రిమెంట్‌ను విడుదల చేశారు. ఎస్క్రూ ఒప్పంద డాక్యుమెట్లను బయట పెట్టారు పయ్యావుల కేశవ్.
గ్యారెంటీలు ఇవ్వలేదని.. ఎస్క్రో చేయలేదని మంత్రి బుగ్గన చెబుతున్నారు. కానీ, గ్యారెంటీలు ఇచ్చినట్టు ఒప్పందం కుదుర్చుకున్నట్టు డాక్యుమెంట్లు ఉన్నాయి. మంత్రి చెప్పింది నిజమా? బ్యాంకర్లు చెప్పింది నిజమా? రాష్ట్ర ఖజానాకు రాకుండా నేరుగా నిధులను ఎస్క్రో చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. రాజ్యాంగ నిబంధనలకు విరుద్దంగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఒప్పందాన్ని రహస్యంగా ఉంచాలని అగ్రిమెంటులో ప్రస్తావించారు. ఎందుకంత రహస్యం? ఏం దాయాలని అనుకుంటున్నారు? అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు పయ్యావుల.
భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం తాకట్టు పెట్టింది. ఈ తరహా ఒప్పందాలకు కేంద్రం అంగీకారం ఉందా? RBI దృష్టిలో ఉందా? అని ప్రశ్నించారు. సార్వభౌమాధికారం ద్వారా వచ్చే రక్షణను వదులుకుంటామని ఒప్పందంలో అంగీకరించారు. గవర్నర్ పదవికి ఉన్న హోదాను వదులుకునేలా ప్రభుత్వ ఒప్పందం ఉంది. ఒప్పందం తప్పితే కేసులు పెట్టొచ్చని స్పష్టంగా అగ్రిమెంటులో పేర్కొన్నారు. గవర్నర్ మీద కేసులు పెట్టినా ఫర్వాలేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందా? అంటూ మండిపడ్డారు.
10 మద్యం డిపోల ఆదాయాన్ని పూచీ కత్తుగా పెట్టారంటే.. ఇక మధ్య పాన నిషేధం ఎక్కడ? దీంతో ప్రభుత్వం ఇక మద్యపాన నిషేధం అమలు చేయదని తేలిపోతోంది. 25 ఏళ్లు మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టారంటే మద్యపాన నిషేధం లేనట్టే కదా అని నిలదీశారు కేశవ్.
అసెంబ్లీ దృష్టికి ఈ విషయాలేవీ తీసుకు రాలేదు కాబట్టి.. ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను అంగీకరించాల్సిన అవసరం లేదన్నారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల.