తెలంగాణలో మైక్రోసాఫ్ట్ డేటాసెంటర్.. ఏపీకి అథోగతే..నా? చంద్రబాబు ఉండి ఉంటేనా..
posted on Jul 22, 2021 @ 12:38PM
తెలంగాణలో మరో భారీ పెట్టుబడి. డేటా సెంటర్‌కు హైదరాబాద్ కేరాఫ్‌గా నిలుస్తోంది. ఇప్పటికే వచ్చిన అమెజాన్, వాల్‌మార్ట్‌ల డేటా సెంటర్లతో పాటుగా.. తాజాగా మైక్రోసాఫ్ట్ సైతం 15వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లో ఉన్న మైక్రోసాఫ్ట్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు ఇది అదనం. హైదరాబాద్‌లో అనేక సానుకూల అంశాలు ఉండటంతో దిగ్గజ కంపెనీలు తమ డేటా సెంటర్ల ఏర్పాటుకు నగరానికి వస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ రంగానికి హైదరాబాద్ ముఖ్య కేంద్రంగా మారడం, సాంకేతిక నిపుణులకు కొరత లేకపోవడం, ప్రభుత్వ ప్రోత్సాహం.. ఇలా అనేక అంశాలు కలిసిరావడంతో హైదరాబాద్‌కు కంపెనీలు క్యూ కడుతున్నాయి.
హైదరాబాద్‌కు ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం అందరికీ సంతోషకరమే. హైదరాబాద్ సంగతి సరే.. మరి, ఏపీ పరిస్థితి ఏంటనేది ఇక్కడి వారి ఆవేదన. ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క పెట్టుబడి కూడా రావడం లేదేంటనే బాధ. హైదరాబాద్ ఆ రేంజ్‌లో డెవలప్ కావడానికి, ఐటీ హబ్‌గా మారడానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమనేది అందరికీ తెలిసిన విషయమే. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ను హైదరాబాద్ రప్పించింది చంద్రబాబు నాయుడే. హైదరాబాద్‌లో సైబర్ టవర్స్ నిర్మించి.. ఐటీ కంపెనీలను రప్పించి.. పెట్టుబడుల కేపిటల్‌గా మార్చింది.. అక్షరాల చంద్రబాబే. సైబరాబాద్ నిర్మాత చంద్రబాబునాయుడు. ఆ రోజుల్లో సీఎం చంద్రబాబు నాయకత్వ లక్షణాలను, ప్రభుత్వ పాలసీలను చూసే ఐటీ పరిశ్రమ హైదరాబాద్‌కు తరలివచ్చింది. ఆనాడు ఆయన నాటిన విత్తనాలే.. ఇప్పుడు మహావృక్షాలై అభివృద్ధి ఫలాలు ఇస్తున్నాయి.
రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రను మళ్లీ పునాదుల నుంచి నిర్మించే ప్రయత్నాలు చేశారు చంద్రబాబు. ఏపీకి అంతర్జాతీయ స్థాయిలో రాజధానిని రూపొందించేందుకు కృషి చేశారు. హైదరాబాద్ మాదిరే విశాఖపట్నంను ఐటీ హబ్‌గా మార్చేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. దావోస్‌లో ప్రపంచ పెట్టుబడుల సమావేశాలకు హాజరై ఏపీకి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. దావోస్‌లో చంద్రబాబును చూసి గుర్తుపట్టిన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్.. ఆయన్ను పలకరించడం.. చంద్రబాబుతో కలిసి డిన్నర్ చేయడం గుర్తుండే ఉంటుంది. ఇదంతా 2015 విషయం.
ఆ తర్వాత సీఎం చంద్రబాబు ఆహ్వనం మేరకు.. విశాఖలో జరిగిన అగ్రిటెక్ సదస్సుకు సైతం హాజరయ్యారు బిల్‌గేట్స్. ఆ బిల్‌గేల్స్ సంస్థ మైక్రోసాఫ్టే ఇప్పుడు హైదరాబాద్‌లో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. భారత్‌లో డేటా సెంటర్ల ఏర్పాటు కోసం రిలయన్స్ జియోతో మైక్రోసాఫ్ట్‌తో కలిసి పని చేస్తోంది. ఆ రిలయన్స్ సంస్థ సైతం చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తిరుపతిలో 15వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. చంద్రబాబు ప్రభుత్వం రిలయన్స్‌కు భూములు కూడా కేటాయించింది. అయితే, సీఎం జగన్ ముఖ్యమంత్రి కావడంతో.. అంతా తలకిందులైంది. చంద్రబాబు హయాంలో వచ్చిన అనేక కంపెనీలు, పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి. రిలయన్స్ సైతం తిరుపతి భూములను జగన్ ప్రభుత్వానికి తిరిగిచ్చేసి.. జగన్‌కో దండమంటూ తిరిగెళ్లిపోయింది.
జగన్ గద్దె నెక్కడంతో.. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి కనుమరుగైంది. విశాఖకు ఐటీ కంపెనీలు గుడ్‌బై చెప్పాయి. వైజాగ్‌లో ఇప్పుడు భూదందా మినహా.. ఐటీ హడావుడి ఏమాత్రం లేదు. చంద్రబాబు హయాంలో వచ్చిన పెట్టుబడులు అటకెక్కేశాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన మినహా అభివృద్ధి, పెట్టుబడుల ఊసే లేదంటున్నారు. అందుకే, హైదరాబాద్‌కు పోటీ లేకుండా పోయిందంటున్నారు. హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రాకతో.. మరోసారి తెలుగువారందనికీ అప్పటి సీఎం చంద్రబాబు ఐటీ పరిశ్రమ కోసం చేసిన కృషిని మరోసారి గుర్తు తెచ్చుకుంటున్నారు. తెలుగునేలకు ఐటీతో అనుబంధం కొనసాగినన్నాళ్లూ.. అందరి మదిలో చంద్రబాబు మెదులుతూనే ఉంటారు. అంతటి చెదరని ముద్ర వేశారు మరి.