ఎమ్మెల్యే కాదు రాష్ట్ర స్థాయి పదవి..! క్లారిటీ ఇచ్చిన కేసీఆర్..
posted on Jul 22, 2021 @ 12:38PM
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇంచార్జీగా ఉన్న పౌడి కౌశిక్ రెడ్డి అధికార పార్టీలో చేరారు. బుధవారం తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కౌశిక్ రెడ్డి 61 వేల ఓట్లు సాధించారు. ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పటి నుంచి ఆయన నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. అయితే ‘ఆడియో లీక్’ల వ్యవహారంలో ఇరుక్కొని ఆయన హస్తం పార్టీకి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. టీఆర్ఎస్ లో చేరాల్సిన పరిస్థితులొచ్చాయి. అయితే అధికార పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ వస్తుందా రాదా అన్నదే ఇప్పుడు చర్చగా మారింది.
నిజానికి ఈటల రాజీనామా చేసినప్పటి నుంచే టీఆర్ఎస్ నేతలతో కౌశిక్ రెడ్డి టచ్ లోకి వచ్చారనే ప్రచారం జరిగింది. ఓ కార్యక్రమంలో కేటీఆర్ ను ఆయన కలవడం సంచలనంగా మారింది. కౌశిక్ రెడ్జి కారెక్కనున్నారనే వార్తలు వచ్చాయి. అయితే తాను పార్టీ మారడం లేదని కౌశిక్ రెడ్డి చెబుతూ వచ్చారు. ఇంతలోనే ఆడియో లీక్ కావడం.. కాంగ్రెస్ సీరియస్ గా స్పందించడంతో సీన్ మారిపోయింది. కేటీఆర్ తో కౌశిక్ రెడ్డి చాలా రోజులుగా సంప్రదింపులు జరుపుతున్నారన్నది కాంగ్రెస్ నేతల ఆరోపణ. ఆడియో లీక్ కాకున్నా.. ఎన్నికల ముందు టీఆర్ఎస్ లో చేరేవాడని వాళ్లు చెబుతున్నారు. కౌశిక్ రెడ్డి విషయంలో గులాబీ పార్టీలోనూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆడియో లీక్ కాకుండా ఉంటే కౌశిక్ రెడ్డికి ఖచ్చితంగా టీఆర్ఎస్ టికెట్ వచ్చేదని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనను బరిలోకి దింపకపోవచ్చనే అభిప్రాయపడుతున్నారు.
కౌశిక్ రెడ్డి చేరిక సమయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలాన్నిస్తున్నాయి. కౌశిక్ రెడ్డిని ప్రోత్సహించడానికి ప్రయత్నించారు. కానీ హుజూరాబాద్ టికెట్ పై మాత్రం సీఎం క్లారిటీ ఇవ్వలేదు. ‘కౌశిక్ రెడ్డి రాజకీయాల్లో ఒక యువకుడు. అతడు అపారమైన ప్రజా సేవ చేయగలడు. తన రాజకీయ వృద్ధిని ఎవ్వరూ ఆపలేరు. ఆయనకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. అతడి పురోగతికి నేను మంచి మార్గం వేస్తానని హామీ ఇస్తున్నా’ అని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కౌశిక్ రెడ్డి నియోజకవర్గానికే పరిమితం కాదు.. ఆయన సేవలు రాష్ట్రానికి మొత్తం ఉపయోగించుకుంటామని చెప్పారు. కేసీఆర్ వ్యాఖ్యలను బట్టి కౌశిక్ రెడ్డిని హుజురాబాద్ బరిలో దింపకుండా.. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి ఇచ్చే యోచనలో కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది.
కౌశిక్ రెడ్డి క్రికెట్ ప్లేయర్. జాతీయ స్థాయిలోనూ ఆయన ఆడారు. కేసీఆర్ ఈ విషయం కూడా చెప్పారు. దీంతో క్రీడలకు సంబంధించిన శాప్ చైర్మన్ గా కౌశిక్ రెడ్డిని నియమించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతానికి కార్పొరేషన్ చైర్మన్ గా నియమించి.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలనే ఆలోచనలో టీఆర్ఎస్ పెద్దలు ఉన్నారని అంటున్నారు. అందుకే రెండు, మూడు సార్లు కౌశిక్ రెడ్డిని రాష్ట్ర స్థాయిలో ఉపయోగించుకుంాటమని కేసీఆర్ చెప్పారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.