జగన్ పాలనపై ఆర్ఎస్ఎస్ ఎటాక్.. ఇక మూడినట్టేనా?
posted on Jul 22, 2021 @ 2:29PM
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబం కులం ఏమిటి, మతం ఏమిటి? ఇది అనవసరమైన ప్రశ్న.అయితే, గడచిన రెండు సంవత్సరాలకు పైగా సాగుతున్న జగన్ రెడ్డి పాలనలో ఈ ప్రశ్న తరచూ వినవస్తూనే వుంది. అందుకు కారణం అయన పాలనలో అడ్డు అదుపు లేకుండా సాగుతున్న అన్యమత ప్రచారం. మత మార్పిడులు. క్రైస్తవులే లేని గ్రామాల్లో చర్చిల నిర్మాణం జరుగుతోంది. ఒకప్పుడు ఒకరిద్దరుగా సైకిల్ మీద వచ్చి క్రైస్తవ మత ప్రచారం చేస్తే ఇప్పుడు ఏసీ బసులలో ఒకే సారి 30- 40 మంది ఊరుమీద పడి ప్రచారం సాగిస్తున్నారు. అది నేరం. అయినా, అడిగే నాధుడు లేడు.ముఖ్యమంత్రి మావాడు, ప్రభుత్వమే తమదన్న భావన క్రైస్తవ సమాజంలో బలపడుతోంది. అందుకే. మత ప్రచారం మహా జోరుగా సాగుతోంది. క్రైస్తవ గ్రామాలు వెలుస్తున్నాయి, ఇందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న హిందూ వ్యతిరేక, క్రైస్తవ అనుకూల విధానాలే కారణం అనేది అంతటా వినవస్తున్న ఆరోపణ.
హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి.దేవుళ్ళ రథాలు తగలబడి పోతున్నాయి. విగ్రహాలు ద్వంసమవుతున్నాయి. ఇంతవరకు ఇంచు మించుగా 150 పైగా దేవాలయాల పై దాడులు జరిగాయి. పవిత్ర రామతీర్ధం దేవాలయంలోని రాములోరి విగ్రహం తలను తెగనరికిన దుండగులు ఎవరో ఇంతవరకు తేలలేదు. అంతర్వేది రథాన్ని దగ్ధం చేసిన దుండగుల ఆచూకీ దొరకలేదు. విజయవాడ కనక దుర్గమ్మ రథం నుంచి వెండి సింహం ఎవరు ఎత్తుకెళ్ళారో తెలియదు. అసలు ప్రభుత్వం ఆ నేరాలను నేరాలుగా పరిగణించడం లేదు. మంత్రులు హిందువుల మనోభావాలను దెబ్బతీసినా, హిందూ దేవుళ్ళను దుర్భాషలాడినా, ముఖ్యమంత్రి కనీసం మందలించిన సందర్భం లేదు.
అందుకే జగన్ రెడ్డి మతం ఏమిటన్న చర్చ మళ్ళీ మళ్ళీ జరుగుతోంది.అయితే, ఈ ప్రశ్నకు జగన్ రెడ్డి తల్లి, విజయమ్మ చాలా స్పష్టంగానే సమాధానం ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి,వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా తమ కుటుంబం మొత్తం క్రైస్తవ కుటుంబం అని ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. అంతే కాదు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, మెజారిటీ ప్రజలు హిందువులు కాబట్టి, హిందూ వేడుకల్లోనో పాల్గొంటామని చక్కగా చెప్పారు. తప్పు కాదు. అయితే, తమ మత విశ్వాసాలను ఇతర మతాల మీద రుద్దే ప్రయత్నం ఎవరు చేసినా తప్పే. అలాంటి ప్రయత్నం ప్రభుత్వమే చేయడం,తప్పే కాదు,నేరం కూడా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం అలాంటి నేరమే చేసింది, చేస్తోంది అంటోంది ... రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక, ‘ఆర్గనైజర్ ‘
జులై 17 సంచికలో ‘ఆర్గనైజర్’ తొలి సారిగా జగన్ రెడ్డి సాగిస్తున్న మత రాజకీయాల మీద మండిపడింది.విశ్లేషనాత్మక కథనాన్ని ప్రచురించింది. నిజానికి జగన్ రెడ్డి, రిలిజియస్ ఎజెండా గురించి, ‘జాగృతి’ వంటి స్థానిక సంఘ్ పరివార్ పత్రికలలో, సోషల్ మీడియా సైట్స్’లో చాలా కథనాలు వచ్చాయి. అదలా ఉంటే ‘ఆర్గనైజర్’, ఎలాంటి సందేహాలకు తావులేకుండా “రాష్ట్రంలో మతమార్పిడులే అజెండాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతోంది” అని కుండబద్దలు కొట్టింది. జగన్ రెడ్డి ఒక్కరే కాదు, ఆయన కుటుంబ సభ్యులు పాశ్చాత్య క్రిస్టియన్ మిషనరీ అజెండాను అమలు చేస్తున్నారని పేర్కొంది.నిజమే, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో కూడా ఇలాగే, క్రైస్తవ మత ప్రచారానికి ప్రభుత్వం ఊత మిచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలలో చర్చిల నిర్మాణం, మరమ్మతులకు ప్రభుత్వ నిధులు కేటాయించిన విషయం కోర్టు విచారణలు వరకు వెళ్ళింది. ప్రజ్ఞా భారతి చైర్మన్ హనుమాన్ చౌదరి, హైకోర్టులో కేసు వేశారు. అలాగే, ఏడుకొండలను రెండు చేసి అన్యమత ప్రచారానికి, కొండ మీద చర్చి నిర్మాణానికి కూడా వైఎస్ ప్రభుత్వ హయాంలో ప్రయత్నాలు జరిగినట్లు ఆరోపణలు, అనుమానాలు వినవచ్చాయి. అయితే, ఆ తర్వాత ప్రభుత్వం ఎందుకనో వెనకడుగు వేసింది. ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం అయితే, ఏకంగా చర్చిల నిర్మాణానికి టెండర్లే పిలిచింది.
ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత పవిత్ర కార్యంగా భావిస్తున్న మతమార్పిడి వ్యవహారం, క్రైస్తవీకరణ కుట్రలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశ మయ్యాయి. ఈ నేపధ్యంలోనే, ఆర్గనైజర్’ పత్రిక జగన్ రెడ్డి పాలన దేశ విచ్చిన్నపోకడలు పోతోందని పేర్కొంది. అలాగే, అధికారం కోసం జగన్ కుటుంబం ప్రమాదకరమైన హిందూ వ్యతిరేక అజెండాను అనుసరిస్తోందని ఆరోపించింది. జగన్ ఒక్కరే కాదు, జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, బావ అనిల్ కుమార్ ఈ అందరూ కూడా క్రైస్తవీకరణలో భాగస్వాములే అని ‘ఆర్గనైజర్’పత్రిక పేర్కొంది. ప్రపంచ క్రైస్తవీకరణకు కృషి చేస్తున్న క్రైస్తవ్ మిషనరీలతో వైఎస్ కుటుంబానికి ప్రత్యక్ష సంబంధాలున్నాయని పత్రిక ఆరోపించింది. నిజానికి, ఇది కూడా పాత ఆరోపణే, వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆయన కుమార్తె వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనీల్ అంతర్జాతీయ మత ప్రచారకుని స్థాయికి ఎదిగారని కేఏ పాల్ వంటి వారు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు.ఇదే విషయాన్ని ఆర్గనైజర్ మరో మారు ప్రస్తావించింది. ఆర్‌ఎ్‌సఎస్ పత్రిక ఆర్గనైజర్‌లో జగన్‌పై ప్రత్యేక విమర్శనాత్మక కథనం రావడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.ఇది దేనికి సంకేతం అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.