మెసేజ్ ఫార్వర్డ్ చేసిన టీచర్ సస్పెండ్.. జగనన్న పాలన ఇంత అరాచకమా?
posted on Jul 22, 2021 @ 11:39AM
ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన సాగుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడుతున్నాయి. ఇందుకు సంబంధించి గతంలో చాలా ఘటనలు వెలుగు చూశాయి. పోలీసుల తీరుపై కోర్టులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయినా ప్రభుత్వం మాత్రం తీరు మార్చుకోవడం లేదు. తాజాగా మరో అరాచక ఘటన జరిగింది. వాట్సాప్ మెసేజ్ ను ఫార్వర్డ్ చేసినందుకు ఓ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయడం దుమారం రేపుతోంది.
విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం ఉప్పరగూడెం పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న ఎస్. నాయుడును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న మెసేజ్ ను ఆయన ఫార్వడ్ చేసినందుకే ఆయనపై వేటు వేశారని తెలుస్తోంది. ఈ ఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. సీఎం జగన్ పై విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు. విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం ఉప్పరగూడెం పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న ఎస్. నాయుడును సస్పెండ్ చేశారంటూ ఓ దినపత్రికలో వచ్చిన వార్తను ఆయన పోస్ట్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సప్‌లో సందేశాలు పంపుతున్నారని ఫిర్యాదు రావడంతో ఆయనపై చర్యలు తీసుకున్నట్లు నారా లోకేష్ తెలిపారు
.'సామాజిక మాధ్యమాల్లో ఎవరో పంపిన మెసేజ్ ని ఫార్వార్డ్ చేస్తేనే ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తే, విద్యాబుద్ధులు నేర్పే గురువులకు తన చీప్ లిక్కర్ అమ్మే మద్యం దుకాణాల ముందు డ్యూటీవేసిన వైఎస్ జగన్ గారిని ఏం చెయ్యాలి?' అని లోకేశ్ నిలదీశారు.
'సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటూ విశాఖ జిల్లా నాతవరం మండలం ఉప్పరగూడెం ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న ఎస్. నాయుడు గారిని సస్పెండ్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. సర్వీస్ రూల్స్ కి విరుద్ధంగా వ్యవహరిస్తూ భావవ్యక్తీకరణ స్వేచ్ఛని హరిస్తోంది వైకాపా ప్రభుత్వం' అని ఆయన మండిపడ్డారు.'మాస్టారిపై తక్షణమే సస్పెన్షన్ ఎత్తివెయ్యాలి. జగన్ రెడ్డి పాలనలో టీచర్లను వేధించడం పరిపాటిగా మారింది. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం చేసే ప్రతి పోరాటానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతిస్తుంది' అని లోకేశ్ చెప్పారు.
సామాజిక మాధ్యమాల్లో ఎవరో పంపిన మెసేజ్ ని ఫార్వార్డ్ చేస్తేనే ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టీచర్ పై విధించిన సస్పెన్షన్ వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి.