తెలుగు తల్లికి మరో అవమానం.. జగన్ సర్కార్ పై జనాగ్రహం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకనే అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో లేక ఉద్దేశ పూర్వకంగానే, తెలుగు భాష, తెలుగు సంస్కృతీ చుట్టూ వివాదాలు రాజేస్తున్నారో గానీ, తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని చిన్న చూపు చూస్తున్నారు. ఒక విధంగా చూస్తే, తెలుగు భాషను, తెలుగు జాతి ఔనత్యాన్ని సజీవ సమాధి చేసేకుట్ర జరుగుతోందనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.
కొద్ది రోజుల క్రితం జగన్ రెడ్డి ప్రభుత్వం, తెలుగు భాషకు, సంస్కృత భాషను జోడించి, తెలుగు అకాడమీ పేరును తెలుగు- సంస్కృత అకాడమీగా మార్చి ఒక వివాదాన్ని రాజేసింది. ఆ సమస్య అలా ఉండగానే ఇప్పుడు కొత్తగా సాహిత్య, సంగీత, నృత్య, లలిత కళలు, చరిత్ర అకాడమీలకు ఆయా రంగాలకు సంబంధం లేని వారిని అధ్యక్షులుగా ప్రకటించి మరో వివాదానికి తెర తీసింది. ఈ నేపధ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ జగన్ రెడ్డి ప్రభుత్వం తెలుగు భాషా సంస్కృతులపై ప్రభుత్వం అవగాహనలేమితో వ్యవహరిస్తోందో.. కుట్రపూరితంగానో తెలుగును అవమానిస్తోందో అర్థంకాని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
నిజం బుద్ధ ప్రసాద్ అన్నట్లుగా, ఏ జాతి ఔన్నత్యం అయినా ఆ జాతి సంస్కృతి, సాహిత్యంపై ఆధారపడి ఉంటుంది. అందులోనూ తెలుగు భాషకు,తెలుగు జాతికి దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గొప్ప గుర్తింపు గౌరవం ఉన్నాయి. కృష్ణ దేవరాయలు మొదలు ఎందరో రారాజులు, చక్రవర్తులు తెలుగు భాషను, తెలుగు వారికి సొంతమైన సమున్నత సాంస్కృతిక ఔన్నత్యాన్ని వేనోళ్ళ కొనియాడారు.
ఈ నేఅపధ్యంలోనే భారతీయ కళలు, సాహిత్యాన్ని పరిపోషించేందుకు స్వాతంత్ర భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అనేక అకాడమీలను నెలకొల్పారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాటలో అడుగులు వేశాయి.ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ భాష, సంస్కృతీ అభివృద్ధి, పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నాయి.
అవిభక్త ఆంధ్ర ప్రదేశ్’లో బహుభాషా కోవిదుడు పీవీ నరసింహ రావు తెలుగు భాష, తెలుగు సంస్కృతీ అభివృద్ధికి, అకాడమీలకు అంకురార్పణ చేశారు.అప్పటి నుంచి వచ్చిపోయిన ప్రభుత్వాలు అన్నీ అకాడమీలకు ఆయా రంగాల్లోని నిష్ణాతులను అధ్యక్షులుగా నియమింఛి సంబధిత కళల అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేశాయి. ఉమ్మడి రాష్ట్రంలో సాహిత్య అకాడమీకి డాక్టర్ బెజవాడ గోపాల్‌రెడ్డి, దేవులపల్లి రామానుజరావు, సంగీత అకాడమీకి మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నృత్య అకాడమీకి నటరాజ రామకృష్ణ, లలిత కళా అకాడమీకి పీటీ రెడ్డి వంటి లబ్ధ ప్రతిష్ఠులు అధ్యక్షులుగా పనిచేశారు. ఆయా రంగాల్లో వారు తెలుగుజాతి ఖ్యాతిని ఇనుమడింపజేశారు. దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, అందుకు విరుద్దంగా ఆయా రంగాలతో సంబంధం లేని వారిని నియమించి తెలుగు భాషనే కాదు, తెలుగు కళలను, తెలుగు సంస్కృతి సంప్రదాయాలను అగౌరవపరిచారని తెలుగు అభిమానులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఈ నియామకాలు, తెలుగు భాష, జాతి పట్ల ముఖ్యమంత్రికి అయన ప్రభుత్వానికి ఉన్న చులకన భావనను ప్రతిబింబిస్తున్నాయి. అందుకే, మండలి బుద్ధా ప్రసాద్, తెలుగు భాషా సంస్కృతుల విధ్వంసానికి ప్రభుత్వమే పూనుకుంటూ ఉంటే చూస్తూ కూర్చోవడం వల్ల జాతి అస్థిత్వమే ప్రశ్నార్థకమవుతుందని ఆవేదనతో కూడిన హెచ్చరిక చేశారు .
భాషా సంస్కృతుల ఔన్నత్యాన్ని నిలుపుకోవటం మనందరి కర్తవ్యం. ప్రజలు, పాత్రికేయులు, రాజకీయ పక్షాలు అందరూ స్పందించాల్సిన సమయమిదని బుద్ధ ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రభుత్వమే తెలుగు భాష, సంస్కృతులను తుదముట్టించే ప్రయత్నం చేస్తోందన్న అనుమానాలకు తావిచ్చినప్పుడు,రక్షించుకోవలసిన బాధ్యత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరిపై ఉందని అంటున్నారు..తెలుగు తల్లి ముద్దుబిడ్డలు.