అనిల్ మంత్రి పదవి ఊస్ట్!.. ఇండికేషన్ ఇచ్చేసిన జగన్!..
posted on Jul 22, 2021 @ 2:29PM
నోరున్నోడికే మంత్రి పదవి. జగన్ నమ్మిన సిద్దాంతం. ఎంత తిడితే అంత మంచి కేబినెట్ పోస్ట్. జగన్ ఆచరించిన విధానం. కేవలం, తిట్లే ప్రాతిపదికన మంత్రి పదవులు పంచేశారనే విమర్శ ఆయనపై బలంగా ఉంది. రెండేళ్లుగా శాఖల పని తీరుకన్నా.. టీడీపీపై ఎదురుదాడి చేయడమే ఏకైక ఎజెండాగా పని చేస్తున్నారు పలువురు మంత్రివర్యులు. జగన్ కళ్లల్లో ఆనందం చూసేందుకు, తమ పదవిని ఐడేళ్ల పాటు పదిలంగా కాపాడుకోడానికి.. కొందరు మంత్రులు బూతులు మాట్లాడటానికి కూడా వెనకాడలేదు. ఆ రేసులో కొడాలి నాని అందరికంటే ముందు ఉంటే.. అనిల్ కుమార్ యాదవ్ నెంబర్ 2 ర్యాంక్ కొట్టేశారని అంటుంటారు. అయితే, ఇంతలా జగన్‌ను వెనకేసుకొచ్చినా కూడా అనిల్‌పై ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నారట. తాజా పరిణామాలు ఆ నోరున్న మంత్రిపై జగన్ నోరు పారేసుకునేలా చేశాయట. అదిప్పుడు ఏకంగా అనిల్ మంత్రి పదవికే ఎసరు పెట్టిందని అంటున్నారు. రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్లో మార్పులు జరిగితే.. ముందు దేవాదాయశాఖమంత్రి వెల్లంపల్లి, ఆ తర్వాత జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ పదవులే ఊడిపోనున్నాయట. పదవులు కోల్పోయే జాబితాలోనూ అనిల్ నెంబర్ 2గానే ఉండటం విశేషం.
మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు సమయం దగ్గర పడేకొద్దీ పలువురు మంత్రుల్లో గుబులు పెరుగుతోంది. ఇన్నాళ్లూ తన పదవికేం కాదంటూ బిందాస్‌గా ఉన్న అనిల్.. ఇప్పుడు ఎక్కడ తన సీటుకు ఎసరు వస్తుందోనని తెగ టెన్షన్ పడుతున్నారట. జగన్ ప్రవర్తనలో స్పష్టమైన మార్పు కనిపించడం.. ఇటీవల జరిగిన పోలవరం పర్యటనలో ఆ శాఖ మంత్రికి తగిన ప్రాధాన్యం దక్కకపోవడం.. అందుకు ఇండికేషన్లుగా భావిస్తున్నారు.
సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు సందర్శన ఆసాంతం అనిల్ కుమార్ ముఖ్యమంత్రి పక్కనే లేకుండా.. అప్పుడప్పుడు మాత్రమే పక్కన ఉండి.. ఆ తర్వాత చాలా వెనకాలే ఉండిపోవాల్సి వచ్చిందంటున్నారు. అధికారులతో సీఎం జరిపిన సమీక్షలో మంత్రికి అంతగా ప్రాధాన్యం లభించలేదు. ప్రాజెక్ట్ సందర్శనలో కూడా ఇతర మంత్రులు ముందుకొచ్చారే కానీ, అనిల్ వెనకబడిపోయారు. ఇక హెలికాప్టర్‌తో ఏరియల్ వ్యూ విషయంలోనూ మంత్రి అనిల్‌ను పక్కన పెట్టేశారు సీఎం జగన్. ముఖ్యమంత్రి, ఇతర అధికారులు మాత్రమే హెలికాప్టర్ ఎక్కారు. అనిల్ కి ప్లేస్ మిస్ అయింది. కేవలం హెలికాప్టర్ లోనేనా? లేక, కేబినెట్‌లో కూడా అనిల్‌కు ప్లేస్ మిస్ అయినట్టేనా అనే అనుమానాలు పెరిగాయి,
యువతకు ప్రాధాన్యం పేరుతో.. బీడీఎస్ చదివిన అనిల్‌కు కీలకమైన జలవనరుల శాఖ కట్టబెట్టడంపై మొదట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయన నోరు, మాట తీరు చూసి.. ఇలాంటి వారిని కూడా మంత్రులను చేస్తారా అంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు. జనం అనుకున్నట్టుగానే.. జగన్ కోరుకున్నట్టుగానే.. రెండేళ్లుగా నోటికి పని చెప్పడం మినహా, తన మంత్రిత్వ శాఖ పని చేయడం తక్కువేనంటారు. జగన్ కోరుకున్నదీ అదేననుకోండి. అంతా తన కనుసన్నల్లోనే జరగాలంటే.. అనిల్ లాంటి కట్టప్పలే మంత్రులుగా ఉండాలనేది జగన్ సిద్దాంతం అంటారు. కట్టప్ప రోల్‌లో తెగ జీవించేసిన అనిల్‌కు తెలంగాణ మంత్రుల రూపంలో ఊహించని షాక్ తగిలిందని చెబుతున్నారు. ఆ బటర్ ఫ్లై ఎఫెక్ట్ మూలంగానే ఇప్పుడు ఆయన మంత్రి పదవికి గండం వచ్చిందని అంటున్నారు.
రెండు రాష్ట్రాల జలవివాదంలో తెలంగాణ మంత్రులు రెచ్చిపోయారు. వైఎస్సార్‌ను, జగన్‌ను నోటికొచ్చినట్టు తిట్టారు. నీళ్ల విషయమే అయినా.. ఆ శాఖ మంత్రిగా అనిల్ ఏపీ తరఫున స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వలేకపోయారు. అందుకే జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ను అప్పటికప్పుడు సైడ్ చేసేసి.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్ రంగంలోకి దింపారని తెలుస్తోంది. అందుకే, ఇటీవల తెలంగాణ ఆరోపణలపై.. మంత్రి అనిల్ కాకుండా, సలహాదారు సజ్జలనే స్పందిస్తున్నారని అంటున్నారు. కావాలనే మంత్రి అనిల్‌ను పక్కన పెట్టేశారని చెబుతున్నారు. రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరిగితే.. అనిల్ పదవి కృష్ణాలో కలిసిపోవడం ఖాయమంటున్నారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనలో ఆ మేరకు ఇండికేషన్ కూడా ఇచ్చేశారని.. త్వరలోనే అనిల్‌కుమార్‌కు షాక్ తప్పదని చర్చించుకుంటున్నారు. తనకు మంత్రి పదవి పోతుందనే భయంలో అనిల్ మరింతగా తన నోటికి పని చెబుతారా? లేక, అన్నీమూసుకొని కూర్చుంటారా? చూడాలి.....